నాబార్డ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

నాబార్డ్‌ (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) సంస్థ 170 గ్రేడ్‌ ‘ఏ’ అసిస్టెంట్‌  మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గత నోటిఫికేషన్లతో పోలిస్తే ఈసారి ఖాళీలు ఎక్కువగా ఉండటం వల్ల అభ్యర్థులకు

Published : 20 Jul 2022 01:22 IST

నాబార్డ్‌ (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) సంస్థ 170 గ్రేడ్‌ ‘ఏ’ అసిస్టెంట్‌  మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గత నోటిఫికేషన్లతో పోలిస్తే ఈసారి ఖాళీలు ఎక్కువగా ఉండటం వల్ల అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ పరీక్ష గురించిన మరిన్ని వివరాలు...

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం పనిచేసే నాబార్డ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం మేనేజ్‌మెంట్‌లో ప్రవేశస్థాయి కొలువు. పరీక్ష పాసై ఉద్యోగంలో చేరినవారికి తొలి రెండేళ్లు ప్రొబేషన్‌ కాలం. అభ్యర్థి పనితీరుబట్టి మరో ఏడాదిపాటు పెంచే అవకాశం ఉంది. ఈ ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల అమలులో బ్యాంకు తరఫున తమ పాత్ర పోషించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం ఉన్నా, ఎక్కువగా రాష్ట్రాల రాజధాని నగరాల్లోనే ఇస్తుంటారు.

విభాగాల వారీగా ఖాళీలు..
అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌) - 161
(రాజభాష సర్వీస్‌) - 07
(ప్రోటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌) - 02

* ప్రిలిమ్స్‌లో రీజనింగ్‌, ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాలు పాసైతే చాలు. మిగతా వాటిని మెయిన్స్‌ అర్హతకు ప్రామాణికంగా తీసుకుంటారు.

* మెయిన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1లో జనరల్‌ ఇంగ్లిష్‌ 100 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. గంటన్నరలో వ్యాసరూప సమాధానాలు రాయాలి. పేపర్‌ 2లో తొలి సెక్షన్‌లో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. రెండో విభాగంలో వ్యాసరూప జవాబులు రాయాలి. ఈఎస్‌ఐ (ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ ఇష్యూస్‌), ఏఆర్డీ (అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) సబ్జెక్టులపై ప్రశ్నలు అడుగుతారు.

ఎలా చదవాలి?: ఈ పరీక్ష ఇతర బ్యాంకింగ్‌ ఎగ్జామ్స్‌తో పోలిస్తే కాస్త కఠినంగానూ భిన్నంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లిష్‌ పేపర్‌ వ్యాసరూప జవాబులు రాయడానికి అభ్యర్థులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అయితే దానికంటే కూడా ప్రిలిమ్స్‌లో ఈఎస్‌ఐ, ఏఆర్డీ అంశాలు ఎంతబాగా చదివామనే దానిపైనే అభ్యర్థి విజయం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పరీక్ష వచ్చే సెప్టెంబర్‌లో ఉంటుందని అంచనా. అందువల్ల సన్నద్ధతకు 50 నుంచి 60 రోజుల సమయం దొరికే అవకాశం ఉంటుంది. కనీసం 50 రోజులు అనుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే మిగిలిన రోజులను మాక్‌టెస్టులు రాసేందుకు ఉపయోగించుకోవచ్చు. ముందుగా గత ప్రశ్నపత్రాలు చూడటం తప్పనిసరి. ఇప్పటికే ఏఎఫ్‌వో (అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌), ఇతర బ్యాంక్‌ పరీక్షలకు చదివిన వారికి ఈ పరీక్షకు సన్నద్ధం కావడం కాస్త సులువుగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా...

దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 8

వయసు, విద్యార్హత, దరఖాస్తు ఫీజుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

పరీక్ష విధానం: ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం మూడంచెలుగా ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ముఖాముఖి పరీక్షల్లో ప్రతిభ చూపినవారికి కొలువు దక్కుతుంది.

ప్రిలిమ్స్‌ : ఇది ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. 200 ప్రశ్నలు ఇస్తారు. 2 గంటల్లో పూర్తిచేయాలి.

మెయిన్స్‌ : ఇది ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ విధానాల కలయిక. మొత్తం రెండు పేపర్లలో మొదటి దానికి వ్యాసరూప సమాధానాలు రాయాలి. ఆన్‌లైన్‌ పరీక్ష కావడం చేత జవాబులను కీబోర్డు మీద టైప్‌ చేయాల్సి ఉంటుంది. రెండో పేపర్‌ ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ తరహాలో ఇస్తారు.

వెబ్‌సైట్‌ : www.nabard.org


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని