డిగ్రీతో 20 వేల ఉద్యోగాలు

కేంద్రప్రభుత్వ శాఖల్లోని గ్రూప్‌ బి, సి విభాగాల్లో 20,000 పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ లెవల్‌ (సీజీఎల్‌) పరీక్ష-2022 గతంలో వచ్చిన ప్రకటనకు భిన్నంగా ఉంది. పరీక్ష విధానంలో భారీ మార్పులు వచ్చాయి.

Published : 21 Sep 2022 00:58 IST

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ప్రకటన  

కేంద్రప్రభుత్వ శాఖల్లోని గ్రూప్‌ బి, సి విభాగాల్లో 20,000 పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ లెవల్‌ (సీజీఎల్‌) పరీక్ష-2022 గతంలో వచ్చిన ప్రకటనకు భిన్నంగా ఉంది. పరీక్ష విధానంలో భారీ మార్పులు వచ్చాయి. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ పోస్టులకు పోటీ పడవచ్చు!

టైర్‌-1, టైర్‌-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 08.10.2022 తేదీ నాటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. 01.01.2022 నాటికి 18 నుంచి 32 సంవత్సరాల వయసు ఉండాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. జనరల్‌, ఓబీసీ కేటగిరీ పురుషులు రూ.100 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి, దరఖాస్తు పూర్తిచేయాలి. www.ssc.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తును నింపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 08.10.2022

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: టైర్‌-1, టైర్‌-2 రెండు పరీక్షలూ కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షలు.

టైర్‌-1: డిసెంబరు, 2022, టైర్‌-2: తేదీలను తర్వాత విడుదల చేస్తారు.

టైర్‌-2 పేపర్‌-1 పరీక్షలో భారీ మార్పులు వచ్చాయి.

150 ప్రశ్నలకు 450 మార్కులు కేటాయించారు. 2 గంటల 15 నిమిషాల నిడివిలో టైర్‌-2లోని పేపర్‌-1ని పూర్తిచేయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు.
* పేపర్‌-1 పరీక్షలో 3 సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-1లో మేథమెటికల్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల నుంచి ప్రతి సెక్షన్‌ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ఈ 60 ప్రశ్నలు పూర్తి చేయడానికి గంట సమయం ఉంటుంది.
* సెక్షన్‌-2 నుంచి 70 ప్రశ్నలు వస్తాయి. ఈ 70 ప్రశ్నలకు గంట సమయం ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 45 ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి.
* సెక్షన్‌-3 నుంచి 20 ప్రశ్నలు కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు సంబంధించినవి వస్తాయి. వీటికి 60 మార్కులు కేటాయించారు. ఈ సెక్షన్‌లోని ప్రశ్నలను 15 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి.
* సీజీఎల్‌ నోటిఫికేషన్‌లోని ఏ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులైనా టైర్‌-2లోని పేపర్‌-1 పరీక్ష రాయాల్సిందే. స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు పోటీ పడేవారు టైర్‌-2లో పేపర్‌-1తోపాటు పేపర్‌-2 కూడా రాయాలి. ఏఏఓ పోస్టుకు దరఖాస్తుచేసిన అభ్యర్థులు టైర్‌-2లో పేపర్‌-1తోపాటు పేపర్‌-3 కూడా రాయాలి.  
* టైర్‌-2 పేపర్‌-1లో రాత పరీక్షతోపాటు డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌ కూడా ఉంటుంది. 15 నిమిషాలు సెషన్‌కు కేటాయించారు. ఇది క్వాలిఫయింగ్‌ పరీక్ష మాత్రమే. ఇందులోని మార్కులను ఫైనల్‌ మెరిట్‌ మార్కుల్లో పరిగణనలోకి తీసుకోరు.

జనరల్‌ అవేర్‌నెస్‌  
ఎక్కువ సబ్జెక్టు, కరెంట్‌ అఫైర్స్‌ ఉండటం వల్ల అభ్యర్థులు ఎక్కువ సమాచారం చదవాలి, నేర్చుకోవాలి. సమాచారం సేకరించి దాన్ని నోట్స్‌ రాసుకుని, ఎక్కువసార్లు చదవడం వల్ల గుర్తుంచుకునే వీలుంటుంది. షార్ట్‌కట్‌ పద్ధతుల్లో గుర్తుంచుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. రోజువారీ దిన పత్రికల్లోని ముఖ్యమైన వార్తలను, వాటికి అనుసంధానంగా ఉన్న ఇతరత్రా సమాచారం సేకరించాలి. ప్రాథమిక విశ్లేషణతో ఆలోచిస్తూ అంశాలవారీగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి.
జనరల్‌ సైన్స్‌లో ఇన్‌వెన్షన్స్‌- డిస్కవరీస్‌, మెజర్‌మెంట్స్‌, థీరీస్‌, కెమికల్‌ ఫార్ములా, ప్లాంట్‌, హ్యూమన్‌ బాడీస్‌, వ్యాక్సిన్‌, వైరస్‌ తదితర అంశాలు ముఖ్యమైనవి.
చరిత్రకు సంబంధించి భారతదేశ చరిత్ర, మధ్యయుగం, ఆధునిక యుగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రాజ్యాలు, స్థాపకులు, యుద్ధాలు, గవర్నర్‌ జనరల్స్‌, గాంధీయుగం, ఉద్యమాలు ముఖ్యమైనవి.
భూగోళశాస్త్రం నుంచి నదులు, పర్వతాలు, నేలలు, సరిహద్దులు, అడవులు, వాతావరణం, పక్షులు, జంతు సంరక్షణ - పరిరక్షణ, సంబంధిత అంశాల నుంచి ఎక్కువ సమాచారం సేకరించాలి.
పాలిటీ అంశాల్లో పౌరులు, ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి, పార్లమెంట్‌, అధికరణలు, సవరణలు బాగా ముఖ్యమైనవి.
ఎకానమీ: డిమాండ్‌-సప్లయ్‌, ద్రవ్యోల్బణం, పేదరికం, మార్కెట్‌ రకాలు, జాతీయ-అంతర్జాతీయ సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి. కరెంట్‌ అఫైర్స్‌ నుంచి వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు, అవార్డులు, ముఖ్యమైన తేదీలు, కేంద్రప్రభుత్వ పథకాలు, దేశాలు, రాజధానులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతి, కేపిటల్‌, కరెన్సీల నుంచి ప్రశ్నలు వస్తాయి.


సన్నద్ధత ఎలా?

మేథమెటికల్‌ ఎబిటిటీస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

* అభ్యర్థులు తక్కువ సమయంలోనూ, ఎక్కువ సమయంలోనూ పూర్తిచేయొచ్చు. తక్కువ సమయంలో సమాధానాలు గుర్తించేవారే విజేతలు అవుతారు. సింప్లిఫికేషన్‌ మీద దృష్టి సారించాలి. సమయం వృథా అవ్వకూడదు. ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం వెచ్చిస్తే, సమయం వృథా అవుతుంది. తేలికపాటి ప్రశ్నలను వదులుకోవాల్సి వస్తుంది. ఫార్ములాలను కాకుండా లాజిక్‌/¨టెక్నిక్‌ వాడటం ద్వారా సమాధానాలు గుర్తిస్తే అద్భుతాలు చేయొచ్చు.
* డేటా ఎనాలిసిస్‌, డేటా సఫిషియన్సీల నుంచి ప్రశ్నలు వస్తాయి. అతి కీలకమైన ఛాప్టర్లు- శాతాలు, నిష్పత్తి-అనుపాతం, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభ-నష్టాలు. కాలం-పని, కాలం-దూరం, పడవలు-ప్రవాహాలు, ఎల్‌సీఎం అండ్‌ హెచ్‌సీఎఫ్‌, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
* లాజిక్‌, టెక్నిక్‌, షార్ట్‌కట్‌లు వాడి తక్కువ సమయంలో సమాధానాలు గుర్తించాలి. ఎక్కువ ప్రశ్నలను సాధన చేయడం వల్ల సబ్జెక్టు మీద పట్టు సాధించవచ్చు. ఎలాంటి ప్రశ్నలకు తప్పు సమాధానాలు గుర్తిస్తున్నామో గమనించి వాటిని మెరుగుపరుచుకోవాలి.
మ్యాథమెటిక్స్‌లో 3 అంశాలుంటాయి. 1.బీజగణితం 2.త్రికోణమితి 3.జామెట్రీ. మ్యాథ్స్‌లోని ప్రశ్నలు పూర్తిచేయాలంటే సాధన అవసరం.

* గతంలో టైర్‌-1, టైర్‌-2లో వచ్చిన ప్రశ్నల స్థాయి కంటే ఎక్కువ స్థాయి ప్రశ్నలు ప్రిపేర్‌ అవ్వడం మంచిది. గతంలో జరిగిన సీజీఎల్‌ పరీక్షలో జామెట్రీ నుంచి అధికంగా ప్రశ్నలు వచ్చాయి. త్రిభుజాలు, త్రిభుజకోణాలు, అంతర, పరివృత్త, లంబ, గురుత్వ కేంద్రాలు, సరూప త్రిభుజాలపై వచ్చే ప్రశ్నలు ముఖ్యమైనవి.
* వృత్తాలు, స్పర్శరేఖ, చక్రీయ చతుర్భుజం, ఆల్టర్‌నేట్‌ సెగ్మెంట్‌ థియరమ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. త్రికోణమితిలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే సాధన ముఖ్యమైంది. త్రికోణమితి నిష్పత్తులు, విలువల పట్టిక, ఐడెంటిటీస్‌.. మొదలైన అంశాలు ప్రిపేర్‌ అవ్వాలి.
* ఎత్తులు, దూరాలపై ప్రశ్నలు వస్తాయి. వీటికి సీజీఎల్‌ పరీక్షలో ప్రాముఖ్యం ఎక్కువ. బీజగణితంలో ప్రశ్నలు ఆలోచింపజేసేవిధంగా ఉంటాయి. కరణుల నుంచి కచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. సూత్రాలను బాగా గుర్తుంచుకోవాలి. ఇచ్చిన సమాధానాల్లో విలువలను ప్రతిక్షేపించుకోవడం ద్వారా బీజగణిం ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు.

రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌: నాన్‌ వెర్బల్‌, హైలెవల్‌ రీజనింగ్‌, పజిల్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. టైర్‌-1, టైర్‌-2లో ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఎక్కువ స్థాయి ఉండే ప్రశ్నలు సాధన చేయాలి. అనాలజీ, సిరీస్‌, కోడింగ్‌-డీ కోడింగ్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, క్లాక్‌, క్యాలండర్‌, దిక్కులు, రక్త సంబంధాలు, క్యూబ్‌, డైస్‌, వెన్‌ చిత్రాలు, పజిల్స్‌, సిలాజిజమ్‌, ర్యాంకింగ్‌ సీక్వెన్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలో ఉన్న సమాచారం ఆధారంగా కామన్‌సెన్స్‌ ఉపయోగించి సమాధానాలు గుర్తించాలి. లాజిక్‌ పట్టుకోవడం కీలకమైన అంశం. మాదిరి ప్రశ్నపత్రాలనూ, వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలనూ సాధన చేయాలి.

ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌: గ్రామర్‌ మీద పూర్తి అవగాహన ఉండాలి. రీడింగ్‌ స్కిల్‌ మెరుగుపరుచుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం చదవడం అలవాటు చేసుకోవాలి. రోజువారీ ఇంగ్లిష్‌ దినపత్రిక చదవాలి. ఇంగ్లిష్‌లో మాట్లాడటం, ఇంగ్లిష్‌ వార్తలు చూడటం ద్వారా లాంగ్వేజ్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ పాసేజ్‌, క్లోజ్‌టెస్ట్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, ఇంగ్లిష్‌ గ్రామర్‌ ఆధారిత ప్రశ్నలు, వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌, ఇడియమ్స్‌, ఫ్రేజెస్‌, యాంటనిమ్స్‌- సిననిమ్స్‌, వాయిస్‌, డైరెక్ట్‌- ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి అంశం నుంచీ కనీసం 200 ప్రశ్నలు సాధన చేస్తే ఇంగ్లిష్‌ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.

కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ: కంప్యూటర్‌ బేసిక్స్‌, సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, డివైజెస్‌, కంప్యూటర్‌ మెమరీ, మెమరీ ఆర్గనైజేషన్‌, బ్యాక్‌అప్‌ డివైజెస్‌, విండోస్‌ ఎక్స్‌ప్లోరర్‌, కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌, సాఫ్ట్‌వేర్‌, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌, ఈమెయిల్‌, నెట్‌వర్కింగ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని