పదితో.. సాయుధ దళాల్లోకి!

కేంద్ర సాయుధ దళాల్లో 24,369 పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. మహిళల కోసం ప్రతి విభాగంలోనూ కొన్ని ఖాళీలను కేటాయించారు. పదోతరగతి విద్యార్హతతోనే వీటికి పోటీ పడవచ్చు.

Updated : 31 Oct 2022 02:38 IST

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా 24,369 పోస్టుల భర్తీ

కేంద్ర సాయుధ దళాల్లో 24,369 పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. మహిళల కోసం ప్రతి విభాగంలోనూ కొన్ని ఖాళీలను కేటాయించారు. పదోతరగతి విద్యార్హతతోనే వీటికి పోటీ పడవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌, దేహదార్ఢ్య, శారీరక ప్రమాణ, మెడికల్‌ టెస్టులతో అర్హులను ఎంపిక చేస్తారు. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే సుమారు రూ.40 వేలు వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో పదోన్నతులకూ అవకాశం ఉంది!

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ దాదాపు ఏటా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తోంది. పదో తరగతి విద్యార్హతతో, జనరల్‌ అభ్యర్థులు 23 ఏళ్ల వయసు వరకు వీటికి పోటీ పడవచ్చు. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి గరిష్ఠ వయసులో మూడేళ్ల మినహాయింపు ఇచ్చారు. దీంతో 26 ఏళ్లలోపు వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలు ఐదేళ్లు, ఓబీసీలు మూడేళ్లు మినహాయింపు పొందవచ్చు. అందువల్ల ఈ పోస్టులను లక్ష్యంగా చేసుకున్నవారు విజయం సాధించడానికి అవకాశాలెక్కువ. ఎంపికైనవారు.. ఆసక్తి, మెరిట్‌ ప్రకారం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌), నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)లో నచ్చిన విభాగంలో సేవలు అందించవచ్చు. ఎన్‌సీబీలో చేరినవారికి లెవెల్‌-1 వేతనం దక్కుతుంది. మిగిలిన ఏ విభాగాన్ని ఎంచుకున్నప్పటికీ వేతనం మాత్రం అందరికీ సమానంగానే ఉంటుంది. వీరు శిక్షణ అనంతరం విధుల్లోకి చేరిన తర్వాత లెవెల్‌-3 మూలవేతనం రూ.21,700 పొందుతారు. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. తొలి నెల నుంచే సుమారు రూ.40 వేలు అందుకోవచ్చు. విధుల్లో చూపిన ప్రతిభ, విద్యార్హత, అనుభవంతో హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎస్సై స్థాయికి చేరుకోవచ్చు. శాఖాపరమైన పరీక్షల ద్వారా ఎస్సై, ఆపై స్థాయికీ ఎంపిక కావచ్చు. 

పరీక్ష ఇలా

గత ఏడాది వరకు ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉండేది. ఇప్పుడు ప్రశ్నల సంఖ్యను 80కి పరిమితం చేశారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ప్రశ్నపత్రం 160 మార్కులకు ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 20 (గతంలో 25) చొప్పున మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. వీటికి ఒక గంటలో (గతంలో గంటన్నర) సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు అర (గతంలో పావు) మార్కు చొప్పున తగ్గిస్తారు. పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. మాక్‌ టెస్టు ఎస్‌ఎస్‌బీ వెబ్‌సైట్‌లో పరీక్షకు కొద్ది రోజుల ముందు అందుబాటులో ఉంచుతారు.

పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 30, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌లు 25, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌కు 5, బీ ఉంటే 3, ఎ ఉన్నవారికి 2 శాతం మార్కులు కలుపుతారు. ఇలా అర్హత మార్కులు పొందినవారి జాబితా నుంచి ఆయా విభాగాల వారీ మొత్తం ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో అభ్యర్థులకు ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. 

పీఈటీ, పీఎస్‌టీ

పీఈటీలో భాగంగా పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో, మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని 8 1/2 నిమిషాల్లో చేరుకోవాలి. పీఎస్‌టీలో.. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీలకు మినహాయింపు ఉంది. పురుషులైతే 162.5, మహిళలు 150 సెం.మీ. ఉంటే సరిపోతుంది. పురుషుల ఛాతీ విస్తీర్ణం 80 సెం.మీ. (ఎస్టీలకు 76) తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ.పెరగాలి. ఎత్తుకు తగ్గ బరువుండాలి. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారి జాబితా నుంచి వారు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం కేటగిరీలవారీ ఖాళీలకు 2 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెడికల్‌ టెస్టుకు ఎంపికచేస్తారు. అందులోనూ విజయవంతం కావాలి. తుదినియామకాలు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్‌, విభాగాల వారీ ఖాళీలు, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు నింపినప్పుడే సర్వీసులవారీ తమ ప్రాధాన్యం తెలపాలి. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు కానిస్టేబుల్‌ హోదాతో విధుల్లో కొనసాగవచ్చు.

 

సన్నద్ధత

నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ ప్రకారం సన్నద్ధత కొనసాగించాలి. పాత, మాదిరి ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిద్వారా ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చో తెలుస్తుంది. పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. 80 ప్రశ్నలకు 60 నిమిషాల వ్యవధి అంటే ప్రతి ప్రశ్నకు 45 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. గతంతో పోలిస్తే ఈ వ్యవధి తగ్గింది. గతంలో వంద ప్రశ్నలకు 90 నిమిషాలు ఉండేది. అంటే ఒక్కో ప్రశ్నకు 54 సెకన్లు దక్కేది. అలా చూసుకుంటే ఈసారి ప్రతి ప్రశ్నకు 9 సెకన్లు తగ్గినట్లే. అందువల్ల అభ్యర్థులు తక్కువ వ్యవధిలో సరైన సమాధానం గుర్తించడంపైనే విజయావకాశాలు ఆధారపడతాయి.

పరీక్షలో విజయానికి వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో మాదిరి ప్రశ్నలు సాధన చేయడమే ఏకైక మార్గం. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంటలిజెన్స్‌ల్లో ప్రశ్నలకు ఎక్కువ సమయం అవసరమవుతుంది. సూత్రాలు ఉపయోగించే విధానం, షార్ట్‌ కట్‌ మెథడ్స్‌పై పట్టు సాధిస్తే వీలైనంత తక్కువ వ్యవధిలో సమాధానం గుర్తించగలుగుతారు. ముందుగా పరీక్ష కోసమే సన్నద్ధం కావాలి. అది ముగిసిన తర్వాత ఫిజికల్‌ టెస్టు సన్నద్ధతపై దృష్టి సారించవచ్చు.

ప్రశ్నలడిగే అంశాలు

* జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: నంబర్‌ ఎనాలజీ, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు నంబర్‌ క్లాసిఫికేషన్‌, ఫిగర్‌ ఎనాలజీ, నంబర్‌ సిరీస్‌, కోడింగ్‌ - డీకోడింగ్‌, వర్డ్‌ బిల్డింగ్‌...మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే ఉంటాయి. 

* జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు రాసేయవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటన (వర్తమాన వ్యవహారాలు)లే ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్‌ సోషల్‌, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జనవరి 2022 నుంచి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి.

* ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌: అంకెలతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. అంకెల మధ్య సంబంధం, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్‌, కొలతలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.

* ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల నుంచే వీటిని అడుగుతారు హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధ్యమే!

ఇవి గమనించండి

విభాగాలవారీ: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)-10497, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)-100, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)-8911, సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ)-1284, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)-1613, అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌)-1697, సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)-103, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)-164 

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

వయసు: మూడేళ్ల మినహాయింపుతో.. జనవరి 1, 2023 నాటికి 18-26 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 2, 1997 - జనవరి 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు.ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: నవంబరు 30 రాత్రి 11 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు.

పరీక్ష: జనవరిలో నిర్వహిస్తారు. తేదీలు తర్వాత ప్రకటిస్తారు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని