కోస్టుగార్డులో.. 255 ఉద్యోగాలు

పదో తరగతి, ఇంటర్‌ విద్యార్హతలతో భారతీయ తీర గస్తీ దళంలో కొలువు దీరే అవకాశం వచ్చింది. నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌, నావిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి ఇండియన్‌ కోస్టు గార్డు ప్రకటన విడుదల చేసింది.

Published : 02 Feb 2023 00:25 IST

పదో తరగతి, ఇంటర్‌ విద్యార్హతలతో భారతీయ తీర గస్తీ దళంలో కొలువు దీరే అవకాశం వచ్చింది. నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌, నావిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి ఇండియన్‌ కోస్టు గార్డు ప్రకటన విడుదల చేసింది. చిన్న వయసులోనే చెప్పుకోదగ్గ వేతనంతో కెరియర్‌లో స్థిరపడాలనుకునేవారికి ఈ పోస్టులు మంచి అవకాశం!

ప్రకటించిన రెండు విభాగాల్లోనూ మొత్తం 255 పోస్టులు ఉన్నాయి. రాత, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. పరీక్షలో నెగ్గినవారికి శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇండియన్‌ కోస్టు గార్డు ఏడాదికి రెండుసార్లు నావిక్‌ (జనరల్‌ డ్యూటీ, డొమెస్టిక్‌ బ్రాంచ్‌) పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు. నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌: ఈ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు.

నావిక్‌ జనరల్‌ డ్యూటీ: ఇందులో 225 ఖాళీలు ఉన్నాయి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు.

వయసు: పై రెండు పోస్టులకూ 18 నుంచి 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే సెప్టెంబరు 1, 2001 - ఆగస్టు 31, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.


పరీక్ష ఇలా..

రెండు పోస్టులకూ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. వీటిలో సరైన సమాధానం గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు. 2 సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-1 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే అడుగుతారు. మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు. ఇందులో మ్యాథ్స్‌ 20, సైన్స్‌ 10, ఇంగ్లిష్‌ 15, రీజనింగ్‌ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.

నావిక్‌ డొమిస్టిక్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ ఒక్క సెక్షన్‌ రాసుకుంటే సరిపోతుంది. నావిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులవాళ్లు అదనంగా సెక్షన్‌ 2 రాయాలి. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్‌ సిలబస్‌ నుంచి మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సెక్షన్లవారీ కనీస మార్కులు సాధించడం తప్పనిసరి. జనరల్‌ విభాగానికి చెందినవారైతే... సెక్షన్‌-1లో 30, సెక్షన్‌-2లో 20 మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలు సెక్షన్‌-1లో 27, సెక్షన్‌-2లో 17 మార్కులు చొప్పున పొందితే అర్హులగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్‌-2కు ఎంపిక చేస్తారు.    

స్టేజ్‌-2: పరీక్షలు ఒకటి లేదా రెండు రోజుల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కులు ఉండవు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో 1.6 కి.మీ.దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్స్‌ తీయగలగాలి. అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి.

స్టేజ్‌-3: స్టేజ్‌-2లో అర్హత సాధించినవారిని స్టేజ్‌-1 మెరిట్‌తో స్టేజ్‌-3కి ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్‌ఎస్‌ చిల్కలో మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు తర్వాతి దశకు చేరతారు. స్టేజ్‌-4లో భాగంగా అభ్యర్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాలు పరిశీలించి అన్నీ సరిగా ఉంటే శిక్షణకు తీసుకుంటారు.  


శిక్షణ, వేతనం

నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌, జనరల్‌ డ్యూటీ విభాగాలవారికి ప్రాథమిక శిక్షణ ఐఎన్‌ఎస్‌ చిల్కలో నిర్వహిస్తారు. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్‌ శిక్షణ ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. వీరికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని వీరు రూ.35 వేలకుపైగా వేతన రూపంలో పొందవచ్చు. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా వరకు చేరుకోవచ్చు. నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచీకి ఎంపికైనవారు కుక్‌, స్టివార్డ్‌ సేవలు అందిస్తారు. నావిక్‌ జీడీ విభాగంలో చేరినవారు వారికి కేటాయించిన ట్రేడుల్లో విధులు నిర్వర్తించాలి.


ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 16 వరకు స్వీకరిస్తారు.
ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
పరీక్షలు: స్టేజ్‌ 1 మార్చిలో నిర్వహిస్తారు. స్జేజ్‌ 2 మేలో, స్టేజ్‌ 3 సెప్టెంబరులో ఉంటాయి.
వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని