Agniveer: ఆర్మీలో అగ్నివీర్‌ అవుతారా?

ఇండియన్‌ ఆర్మీ అగ్నివీర్‌ ప్రకటనలు దేశ  వ్యాప్తంగా వెలువడ్డాయి. ఎనిమిదో తరగతి విద్యార్హతతోనూ కొన్ని ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. పరీక్ష, ఫిజికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. అవకాశం వచ్చినవారు శిక్షణతో కలిపి నాలుగేళ్లు ఆర్మీలో సేవలు అందించవచ్చు. అనంతరం వీరిలో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగంలోకి తీసు

Updated : 06 Mar 2023 04:47 IST

ఇండియన్‌ ఆర్మీ అగ్నివీర్‌ ప్రకటనలు దేశ  వ్యాప్తంగా వెలువడ్డాయి. ఎనిమిదో తరగతి విద్యార్హతతోనూ కొన్ని ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. పరీక్ష, ఫిజికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. అవకాశం వచ్చినవారు శిక్షణతో కలిపి నాలుగేళ్లు ఆర్మీలో సేవలు అందించవచ్చు. అనంతరం వీరిలో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. మిగిలినవారు ఆర్థిక ప్రోత్సాహకాలతో వైదొలగాలి. ప్రకటనల పూర్తి వివరాలు...  

తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌, సికింద్రాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ వారికి గుంటూరు, విశాఖపట్నం నియామక కేంద్రాల ఆధ్వర్యంలో పరీక్షలు, ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. ముందు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభావంతులకు ఫిజికల్‌ టెస్టులు ఉంటాయి. తాజా నోటిఫికేషన్‌ ద్వారా.. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ టెక్నికల్‌ (ఆల్‌ ఆర్మ్స్‌), అగ్నివీర్‌ క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మన్‌ పోస్టులను భర్తీ చేస్తారు.

పరీక్ష ఇలా..

ఆన్‌లైన్‌ పరీక్ష నిమిత్తం 5 కేంద్రాలు ఎంచుకోవాలి. తప్పు సమాధానానికి పావు శాతం మార్కులు తగ్గిస్తారు. ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్‌ టెస్టు అందుబాటులో ఉంచారు. దాన్ని రాసి, పరీక్షపై అవగాహన పెంచుకోవచ్చు. పరీక్షలో.. జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, లాజికల్‌ రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం ప్రశ్నపత్రం టెక్నికల్‌ పోస్టులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లోనూ ప్రశ్నలు వస్తాయి.


పోస్టులు..అర్హతలు  

అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ: పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గ్రేడ్‌ల్లో అయితే కనీసం సీ2 అవసరం. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం ఉండాలి. లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి డ్రైవర్‌ పోస్టులకు ప్రాధాన్యమిస్తారు. ఎత్తు 166 సెం.మీ. ఉండాలి.  

అగ్నివీర్‌ టెక్నికల్‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు ఈ పోస్టులకు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందాలి. లేదా పదో తరగతిలో ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులతో పాటు నిర్దేశిత ట్రేడ్‌/బ్రాంచీల్లో రెండేళ్ల ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు 165 సెం.మీ. ఉండాలి.  

అగ్నివీర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌: ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌లో 60 శాతం మార్కులు పొందినవాళ్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌/ అకౌంట్స్‌/ బుక్‌ కీపింగ్‌లో 50 శాతం తప్పనిసరి. ఎత్తు 162 సెం.మీ. ఉండాలి.  

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మన్‌: పదో తరగతిలో ఉత్తీర్ణులైతే చాలు. ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు ఉండాలి. ఎత్తు 166 సెం.మీ. అవసరం.      

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మన్‌: ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణులైతే చాలు. ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు తప్పనిసరి. ఎత్తు 166 సెం.మీ. ఉండాలి.    

వయసు: పై అన్ని పోస్టులకూ కనిష్ఠంగా 17 1/2 గరిష్ఠంగా 21 ఏళ్లలోపు ఉండాలి. అక్టోబరు 1, 2002 - ఏప్రిల్‌ 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. అన్ని పోస్టులకు ఎత్తుకు తగ్గ బరువు అవసరం. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి. సర్వీస్‌మెన్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, వార్‌ విడో పిల్లలకు ఇందులో కొంత మినహాయింపులు వర్తిస్తాయి.


బోనస్‌ మార్కులు

ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ పిల్లలకు 20 ఉంటాయి.

క్రీడల్లో రాణించినవారికి స్థాయిని బట్టి గరిష్ఠంగా 20 మార్కులు కేటాయించారు.

ఎన్‌సీసీ ఎ ఉంటే 5, బికి 10, సి 20, సీతోపాటు రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొంటే 25 మార్కులు.

పది తర్వాత రెండేళ్ల ఐటీఐకి 20, రెండు లేదా మూడేళ్ల డిప్లొమాకి 30 మార్కులు  ః ఇంటర్‌ తర్వాత ఏడాది ఐటీఐకి 30, రెండేళ్లదైతే 40 మార్కులు.

* ఇంటర్‌ తర్వాత డిప్లొమా చేస్తే 50 మార్కులు.

అయితే ఈ బోనస్‌ మార్కులు గరిష్ఠంగా టెక్నికల్‌ పోస్టులైతే 50, మిగిలినవాటికి 25 కలుపుతారు. వీటిని పరీక్షలో సాధించిన మార్కులకు జతచేసి మెరిట్‌ లిస్టు రూపొందిస్తారు. అర్హులకు ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు.

ఫిజికల్‌ టెస్టులు

అన్ని పోస్టులకూ ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధించడం తప్పనిసరి. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 5 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేస్తే 60 మార్కులు, 5 నిమిషాల 31 సెకన్ల నుంచి 5 నిమిషాల 45 సెకన్ల లోపు పూర్తిచేస్తే 48 మార్కులు ఇస్తారు. కనీసం 6 పుల్‌అప్స్‌ తప్పనిసరి.6 తీసినవారికి 16, 7 తీస్తే 21, 8కి 27, 9కి 33, 10 తీస్తే 40 మార్కులు పొందవచ్చు. 9 అడుగుల దూరానికి దూకగలిగితే అర్హత సాధిస్తారు. జిగ్‌జాగ్‌ బ్యాలెన్స్‌లో అర్హత సాధించాలి. అనంతరం ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, మెడికల్‌ టెస్టులు ఉంటాయి. వీటన్నింటిలో విజయవంతమైతే శిక్షణకు ఎంపికచేస్తారు.  

అవకాశమొస్తే...

మొదటి సంవత్సరం: రూ.30,000

రెండో ఏడాది : రూ.33,000

మూడో ఏడాది: రూ.36,500

నాలుగో ఏడాది : రూ.40,000 చెల్లిస్తారు.


వర్తించేవి

నాలుగేళ్ల సేవలకు గానూ సేవానిధి ప్యాకేజీ అందిస్తారు. వార్షిక సెలవులు 30 ఉంటాయి. ఆరోగ్య సమస్యను బట్టి సిక్‌ లీవ్‌ కేటాయిస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌లో ఉన్నప్పుడు రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్‌, రేషన్‌, డ్రెస్‌, ట్రావెల్‌ అలవెన్సులు మాత్రం అందిస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ వర్తిస్తుంది. నాలుగేళ్ల సేవలకు గానూ వీరికి అగ్నివీర్‌ స్కిల్‌ సర్టిఫికెట్‌ అందుతుంది. అలాగే పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్‌తో సమాన స్థాయి సర్టిఫికెట్‌ ఇస్తారు.


వర్తించనివి...

వీరికి పింఛను, గ్రాట్యుటీ వర్తించవు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌గానూ పరిగణించరు. కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) వీరికి వర్తించవు. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) సైతం ఉండదు.


సేవానిధి..

ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది ప్రతి నెల పొందే 30,000 నుంచి రూ.9000 మినహాయిస్తారు. అగ్నివీరుని చేతికి రూ.21,000 అందుతుంది. రెండో ఏడాది రూ.23,100 వేతనం అందుతుంది. రూ.9900 నిధిలో జమ అవుతుంది. మూడో ఏడాది రూ.25,500 చేతికి వస్తుంది. రూ.10,950 నిధికి వెళ్తుంది. ఇలా నాలుగో ఏడాదికి వచ్చే సరికి వీరునికి రూ.28,000, నిధికి రూ.12,000 వెళ్తాయి. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి గానూ సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి పోగవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జమ చేస్తుంది. అంటే రూ.10.04 లక్షలన్నమాట. దీనికి వడ్డీని కలిపి అగ్నివీరునికి అందిస్తారు. సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం వీరికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు.

మధ్యలో మానేస్తే...

అగ్నివీరులు నాలుగేళ్లలోపే కావాలంటే వైదొలగొచ్చు. అలాంటి సందర్భంలో అగ్నివీరుని వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే చేతికి అందిస్తారు. వీరికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం ఉండదు.

ఉద్యోగంలోకి...

నాలుగేళ్ల వ్యవధి పూర్తిచేసుకున్న అగ్నివీరుల ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని ఆర్మీలో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇందుకోసం నాలుగేళ్ల వ్యవధిలో చూపిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా ఎంపికైనవారు 15 ఏళ్లు విధుల్లో కొనసాగవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 15 వరకు స్వీకరిస్తారు.

ఫీజు: రూ.250

ఆన్‌లైన్‌ పరీక్షలు: ఏప్రిల్‌ 17 నుంచి నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు