బీఎస్‌ఎఫ్‌లో చేరతారా?

దేశ సరిహద్దుల పరిరక్షణే ధ్యేయంగా దశాబ్దాలుగా సేవలందిస్తోంది సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌). తాజాగా వివిధ కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మన్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Updated : 15 Mar 2023 05:00 IST

1284 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

దేశ సరిహద్దుల పరిరక్షణే ధ్యేయంగా దశాబ్దాలుగా సేవలందిస్తోంది సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌). తాజాగా వివిధ కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మన్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1284 ఖాళీల్లో పురుషులకు 1220, మహిళలకు 64 కేటాయించారు.

కానిస్టేబుల్‌ (కోబ్లర్‌)/ టైలర్‌/ వాషర్‌మెన్‌/ బార్బర్‌/ స్వీపర్‌/ కుక్‌/ వాటర్‌ క్యారియర్‌/ వెయిటర్‌... మొదలైన ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌/ పదో తరగతి/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. కొన్ని ట్రేడుల్లో ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌ లెవల్‌-1 కోర్సు పూర్తిచేయాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక

రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌, డీటెయిల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ (డీఎంఈ) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. తగిన శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఎత్తు: పురుష అభ్యర్థులు 165 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ చుట్టుకొలత 75-80 సెం.మీ. ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 155 సెం.మీ. ఉండాలి. ఎస్సీ/ఎస్టీకి చెంది పురుష అభ్యర్థుల ఎత్తు 160 సెం.మీ., ఛాతీ 75-80 సెం.మీ ఉండాలి. మహిళా అభ్యర్థులు148 సెం.మీ. ఉండాలి.

రాత పరీక్ష

ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) లేదా ఓఎంఆర్‌ విధానంలో ఉంటుంది. 100 మార్కులకు 100 ప్రశ్నలతో ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.

ప్రశ్నపత్రం నాలుగు విభాగాలుగా ఉంటుంది. 1) జనరల్‌ అవేర్‌నెస్‌/ జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన 25 ప్రశ్నలకు 25 మార్కులు. 2) ఎలిమెంటరీ మేథమెటిక్స్‌కు చెందిన 25 ప్రశ్నలకు 25 మార్కులు. 3) ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన 25 ప్రశ్నలకు 25 మార్కులు. 4) ఇంగ్లిష్‌/ హిందీ భాషలో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి.

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రం పదోతరగతి స్థాయిలో ఉంటుంది.

రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశలో ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు.

నిర్ణీత ఎత్తు ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ జరుపుతారు. దీంట్లో భాగంగా నిర్వహించే పరుగు పందెంలో పురుష అభ్యర్థులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పూర్తిచేయాలి. మహిళా అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల దూరాన్ని8.30 నిమిషాల్లో పూర్తిచేయాలి. దీంట్లో గెలుపొందిన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది.

* ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ ఉండదు. పీఈటీ అర్హత పరీక్ష మాత్రమే. దీనికి మార్కులుండవు.

ట్రేడ్‌టెస్ట్‌: కానిస్టేబుల్‌ (కోబ్లర్‌) /  టైలర్‌/ వాషర్‌మెన్‌/ బార్బర్‌/ స్వీపర్‌ లకు ట్రేడ్‌ టెస్ట్‌ ఉంటుంది. వీరంతా సంబంధిత పనుల్లో నిపుణులై ఉండాలి.  కానిస్టేబుల్‌ (కుక్‌)/  వాటర్‌ క్యారియర్‌/ వెయిటర్‌లకు ట్రేడ్‌టెస్ట్‌ ఉండదు. ఈ మూడు కేటగిరీలకు చెందిన అభ్యర్థులు నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి ఫుడ్‌ ప్రొడక్షన్‌లో నేషనల్‌ స్కిల్స్‌ క్వాలిఫికేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌) లెవెల్‌-1 కోర్సు పూర్తిచేయాలి. ఈ మూడు దశల్లో పాసైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది జాబితాను రూపొందిస్తారు.

ముఖ్యాంశాలు

ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి.

అభ్యర్థులు తమకు కేటాయించిన రిజిస్ట్రేషన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను రాసుకుని భద్రపరుచుకోవాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి దివ్యాంగులు అనర్హులు.

ఇప్పటికే పనిచేస్తున్న అభ్యర్థులు అప్లికేషన్‌కు ‘నో అబ్జెక్షన్‌  సర్టిఫికెట్‌’ను జతచేయాలి.

ఎంపికైన అభ్యర్థులకు రేషన్‌ అలవెన్స్‌, వైద్య సహాయం, ఉచిత వసతి, ఉచిత లీవ్‌ పాస్‌ లాంటి సదుపాయాలన్నీ వర్తిస్తాయి.


దరఖాస్తు ఫీజు: రూ.100 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీఎస్‌ఎఫ్‌ ఉద్యోగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2023

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు