స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు పోటీ పడతారా?

ప్రావిడెంట్‌ ఫండ్‌ల నియంత్రణ, నిర్వహణ ధ్యేయంగా పని  చేస్తోంది న్యూదిల్లీలోని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ). కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఈ సామాజిక భద్రత సంస్థ.

Published : 30 Mar 2023 00:05 IST

ప్రావిడెంట్‌ ఫండ్‌ల నియంత్రణ, నిర్వహణ ధ్యేయంగా పని  చేస్తోంది న్యూదిల్లీలోని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ). కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఈ సామాజిక భద్రత సంస్థ.. 185 స్టెనోగ్రాఫర్‌ (గ్రూప్‌ సి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

నియామకం జరగనున్న 185 పోస్టుల్లో ఎస్సీలకు 28, ఎస్టీలకు 14, ఓబీసీలకు (ఎన్‌సీఎల్‌) 50, ఈడబ్ల్యూఎస్‌లకు 19, అన్‌ రిజర్వుడ్‌కు 74 కేటాయించారు. అభ్యర్థులు పన్నెండో తరగతి పాసై స్టెనోగ్రఫీలో నైపుణ్యం కలిగి ఉండాలి. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు మూడు నుంచి ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది.

అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. ఫేజ్‌-1లో రాత పరీక్ష, ఫేజ్‌-2లో స్కిల్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.  

రాత పరీక్ష: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 200 ప్రశ్నలకు 800 మార్కులు. పరీక్ష సమయం 2.10 గంటలు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలు (200 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌లో (కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ సహా) 50 ప్రశ్నలు (200 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో 100 ప్రశ్నలు (400 మార్కులు). ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ నాలుగోవంతు మార్కులు తగ్గిస్తారు. రాత పరీక్షలో అభ్యర్థులను 1:10 నిష్పత్తిలో ఎంపికచేసి.. వారికి స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.  

స్కిల్‌టెస్ట్‌: నిమిషానికి 80 పదాల చొప్పున.. పది నిమిషాల డిక్టేషన్‌ ఉంటుంది. కంప్యూటర్‌పైన 50 నిమిషాల ఇంగ్లిష్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌/ 65 నిమిషాల హిందీ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఫేజ్‌-1 మెయిన్‌ పరీక్షలో సాధించిన మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటారు.

దరఖాస్తు రుసుము రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యాంశాలు

ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు పంపితే.. చివరిగా పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రస్తుతం వినియోగిస్తోన్న మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీలను మాత్రమే దరఖాస్తులో రాయాలి. ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు.

అడ్మిట్‌కార్డ్‌లో తెలియజేసిన కేంద్రాల్లో ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహిస్తారు.

ప్రభుత్వ/పబ్లిక్‌ సెక్టర్‌ అండర్‌టేకింగ్స్‌లో పనిచేస్తోన్న అభ్యర్థులు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ సమయంలో ‘నో అబ్జెక్షన్‌’ సర్టిఫికెట్‌ను సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 26.04.2023

దరఖాస్తు సవరణ తేదీలు: 27.04.2023 నుంచి 28.04.2023 వరకు

వెబ్‌సైట్‌: www.epfindia.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని