రిజర్వ్‌ బ్యాంకులో ఆఫీసర్‌ అవుతారా?

దేశంలోని బ్యాంకులను నియంత్రించే సెంట్రల్‌ బ్యాంకు అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆఫీసర్‌ ఉద్యోగం సాధించడమనేది చాలామంది అభ్యర్థుల కల. అది నెరవేర్చుకునే అవకాశం వచ్చింది!

Updated : 11 May 2023 01:23 IST

291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌  

దేశంలోని బ్యాంకులను నియంత్రించే సెంట్రల్‌ బ్యాంకు అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆఫీసర్‌ ఉద్యోగం సాధించడమనేది చాలామంది అభ్యర్థుల కల. అది నెరవేర్చుకునే అవకాశం వచ్చింది! రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గ్రేడ్‌ ‘బి’ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

తాజా నోటిఫికేషన్‌లో మొత్తం 291 ఖాళీలు ప్రకటించగా.. వీటిలో జనరల్‌ ఆఫీసర్‌ పోస్టులు 222, డీఈపీఆర్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ పాలసీ రిసెర్చ్‌) పోస్టులు 38, డీఎస్‌ఐఎం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌) పోస్టులు 31.

అభ్యర్థులను మూడు దశల్లో- (ఫేజ్‌-1 - ప్రిలిమ్స్‌), ఫేజ్‌-2 - మెయిన్స్‌, ఇంటర్వ్యూ) ఎంపిక చేస్తారు. జనరల్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్‌, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అయితే డీఈపీఆర్‌, డీఎస్‌ఐఎం పోస్టులకు మాత్రం మూడు దశల్లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. సాధారణ బ్యాంకు పరీక్షల కంటే భిన్నంగా ఉండే ఈ పరీక్షకు అదే విధంగా ప్రిపేర్‌ అవ్వాలి. కానీ అంతగా ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదు. ఒక ప్రణాళికతో సన్నద్ధం కావాలి. ముందుగా పరీక్ష విధానం, సిలబస్‌లను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. పరీక్ష సిలబస్‌ను నోటిఫికేషన్‌లోనే వివరంగా పేర్కొన్నారు. డీఈపీఆర్‌, డీఎస్‌ఐఎం పరీక్షల సబ్జెక్టులు ఆయా పోస్టులను అనుసరించి ఎకనామిక్‌, స్టాటిస్టిక్స్‌ సంబంధించినవిగా ఉంటాయి. అయితే ఎక్కువమంది అభ్యర్థులు దరఖాస్తు చేసే జనరల్‌ పోస్టుల సబ్జెక్టులు సాధారణంగానే ఉంటాయి.

జీతభత్యాలు

రిజర్వ్‌ బ్యాంకు గ్రేడ్‌ ‘బి’ ఆఫీసర్‌గా నియమితులైన అభ్యర్థులకు చాలా మంచి జీతభత్యాలు అందుతాయి. రూ.55,200 మూల వేతనంతో, ఇతర భత్యాలు కలిపి ప్రారంభంలో రూ.1,16,914 నెలవారీ వేతనం లభిస్తుంది. వసతి కేటాయించని పక్షంలో మూలవేతనంలో 15 శాతం అదనంగా హెచ్‌ఆర్‌ఏ కూడా లభిస్తుంది. ఉన్నత విద్యార్హత/ అనుభవం ఉన్న అభ్యర్థులకు అదనంగా 4 ఇంక్రిమెంట్లు అందించే అవకాశం ఉంది. ఇవి కాకుండా అనేక ఇతర సదుపాయాలను (వెహికల్‌, న్యూస్‌పేపర్‌, కంప్యూటర్‌, ఫర్నిచర్‌, లోన్స్‌, ఎల్‌టీఏ మొదలైనవి) బ్యాంకు సమకూరుస్తుంది.

పదోన్నతులు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో గ్రేడ్‌ ‘బి’ ఆఫీసర్‌ (మేనేజర్‌)గా నియమితులైన అభ్యర్థులు పదోన్నతులతో అంచెలంచెలుగా డిప్యూటీ గవర్నర్‌ స్థాయి వరకూ చేరుకునే అవకాశం ఉంది. ఆర్‌బీఐ అంతర్గతంగా నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ చూపితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. పదోన్నతుల క్రమం ఇలా ఉంటుంది- మేనేజర్‌ (గ్రేడ్‌ ‘బి’ ఆఫీసర్‌), అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, డిప్యూటీ గవర్నర్‌, గవర్నర్‌. చిన్న వయసులో ఆఫీసర్‌గా నియమితులైన అభ్యర్థులు తమ ప్రతిభ ఆధారంగా డిప్యూటీ గవర్నర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

ఇవి పాటించండి

* పరీక్షకు ఉన్న సమయంతో స్టడీ టైమ్‌లైన్‌ ఏర్పరుచుకోవాలి. దాన్ని వారాల వారీగా విభజించుకోవాలి. ఏ వారంలో ఏది పూర్తిచేయాలో నిర్ణయించుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2 టాపిక్స్‌ పూర్తయ్యేలా చూడాలి.

* ప్రతిరోజూ కరెంట్‌ అఫైర్స్‌ చదవాలి. ప్రతివారం వాటిని రివైజ్‌ చేసుకోవాలి. వార్తాపత్రికల్లో ముఖ్యమైనవి మాత్రమే చదవాలి. మరీ ఎక్కువ సమయం కేటాయించనక్కర్లేదు.

* ప్రతివారం సన్నద్ధతను సమీక్షించుకోవాలి. తగిన విధంగా కొనసాగుతోందో లేదో గమనించుకోవాలి.

* ప్రతిరోజూ కనీసం ఒక మాదిరి ప్రశ్నపత్రం రాయాలి.  

* మెయిన్స్‌ పరీక్ష కోసం రైటింగ్‌ స్కిల్స్‌ పెంచుకోవాలి. ప్రతివారం డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో మోడల్‌ పరీక్ష సాధన చేయాలి.

ఈ విధంగా ఏర్పరుచుకున్న ప్రణాళికను అనుసరించి ప్రతిరోజూ 12 గంటల సమయానికి తగ్గకుండా క్రమశిక్షణతో సన్నద్ధత కొనసాగించాలి. ఇలా చేస్తే.. దేశంలోని బ్యాంకులన్నింటికీ నిర్దేశకత్వం చేసే సెంట్రల్‌ బ్యాంకులో ఉద్యోగంలో చేరే మీ కల నెరవేరుతుంది!


ఇలా సన్నద్ధం కండి!

* ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లలో వేర్వేరు సబ్జెక్టులుంటాయి. కాబట్టి ఉమ్మడిగా తయారయ్యే అవకాశం ఉండదు. కానీ రెండింటికీ ఒకే సమయంలో ప్రిపరేషన్‌ను మొదలుపెట్టాలి.


* ప్రిలిమ్స్‌ పరీక్ష ఇతర బ్యాంకు పరీక్షల ప్రిలిమ్స్‌ మాదిరిగానే ఉంటుంది. కానీ జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం అదనం. ఇది అర్హత పరీక్ష మాత్రమే కాబట్టి అభ్యర్థులు తమ దృష్టి ఎక్కువగా మెయిన్స్‌ పరీక్షలపై కేంద్రీకరించాలి.


* అయితే ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధించేలా ఆయా సబ్జెక్టులకు సమయాన్ని కేటాయించి సిద్ధం కావాలి.


* అన్ని సబ్జెక్టుల్లోనూ విడిగా అర్హత సాధించాలి కాబట్టి అన్ని విభాగాలూ ముఖ్యమైనవే.


* గతంలో అడిగిన పరీక్షల ప్రశ్నపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏయే టాపిక్స్‌ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎన్నెన్ని వస్తున్నాయో గమనించి ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌పైనే దృష్టి పెట్టాలి. తద్వారా ప్రిలిమ్స్‌లో అర్హత సాధించడానికి సరిపోయే మార్కులను సంపాదించొచ్చు.


* ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం ఆప్టిట్యూడ్‌లోని పర్సంటేజి, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, సింపుల్‌/ కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌, టైమ్‌-వర్క్‌, టైమ్‌-డిస్టెన్స్‌, యావరేజి, మెన్సురేషన్‌, మిక్సర్‌-అలిగేషన్‌, పర్ముటేషన్స్‌-కాంపినేషన్స్‌, ప్రాబబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ టాపిక్స్‌ ముఖ్యమైనవి.


* రీజనింగ్‌లో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌, సిలాజిజమ్‌, ఇన్‌ఈక్వాలిటీ, కోడింగ్‌-డీకోడింగ్‌, డైరెక్షన్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌ మొదలైనవి. ఇంగ్లిష్‌లో గ్రామర్‌ను వినియోగించే మోడల్‌ ప్రశ్నలు (జంబుల్డ్‌ సెంటెన్స్‌, ఫిల్లింగ్‌ ద బ్లాంక్స్‌, క్లోజ్‌టెస్ట్‌, స్పాటింగ్‌ ఎర్రర్స్‌ మొదలైనవి), కాంప్రహెన్షన్‌ బాగా చూసుకోవాలి.


* జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం కరెంట్‌ అఫైర్స్‌, ఫైనాన్షియల్‌, ఎకనామిక్స్‌ వార్తలు, ప్రభుత్వ పథకాలు/ ఒప్పందాలు, బ్యాంకింగ్‌ ప్రక్రియ, రేట్లు, టర్మినాలజీ, స్టాటిక్‌ జి.కె. బాగా చదువుకోవాలి.


* జనరల్‌ పోస్టుల మెయిన్స్‌ పరీక్షలో ఎకనామిక్‌, సోషల్‌ ఇష్యూస్‌, డిస్క్రిప్టివ్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ ఫైనాన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలున్నాయి. వీటికి సంబంధించి ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో ప్రశ్నలుంటాయి. వీటి సిలబస్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రిపేర్‌ అవ్వాలి. ప్రస్తుతం చాలావరకూ మెటీరియల్‌ ఆన్‌లైన్‌లో ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. దాన్ని వినియోగించుకోవచ్చు.


రిఫరెన్స్‌ పుస్తకాలు

ప్రిలిమ్స్‌లోని ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌ల కోసం: మార్కెట్‌లో లభ్యమయ్యే ఏ పుస్తకాలైనా ఉపయోగపడతాయి.

మెయిన్స్‌ విభాగాల కోసం: ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, ఇండియన్‌ ఎకానమీ - వీకే పురి అండ్‌ ఎస్‌కే మిశ్రా, ఇండియన్‌ ఎకానమీ - రమేష్‌ సింగ్‌, సోషల్‌ ప్రాబ్లమ్స్‌ ఇన్‌ ఇండియా - రామ్‌ అహుజా, యూనియన్‌ బడ్జెట్‌, ఎకనామిక్‌ సర్వే, నీతీ అయోగ్‌ నివేదికలు, ఇండియన్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్‌ - భరత్‌ వి పాథక్‌, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ - ఆర్‌పీ రస్తోగీ, ఆర్గనైజేషన్‌ బిహేవియర్‌- స్టీఫెన్‌ పి రాబిన్స్‌, ప్రిన్సిపల్స్‌ అండ్‌ ప్రాక్టీస్‌ మేనేజ్‌మెంట్‌ - టీఎన్‌ చబ్రా, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ - సీబీ గుప్తా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు