పది పాసైతే తపాలా కొలువు
నియామక పరీక్ష రాయకుండా, పదో తరగతి మార్కుల ప్రతిభతోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది! గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది.
నియామక పరీక్ష రాయకుండా, పదో తరగతి మార్కుల ప్రతిభతోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది! గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 12,828 పోస్టులు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 118, తెలంగాణలో 96 ఖాళీలు ఉన్నాయి. అవకాశం వచ్చినవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు. పోస్టును బట్టి సుమారు రూ.15,000 నుంచి 20,000 వేతనం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి!
గతంలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైనవారికి స్థిర వేతనం, ఏటా ఇంక్రిమెంట్ మాత్రమే లభించేవి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వీరికి మూలవేతనం (బేసిక్ పే)తో పాటు కరవు భత్యం(డియర్నెస్ అలవెన్సు)ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో 42 శాతం డీఏ అమలవుతోంది.
* దీని ప్రకారం బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12,000 మూలవేతనంతోపాటు ఇందులో 42 శాతం అంటే రూ.5040 డీఏ కూడా దక్కుతుంది. అంటే మొదటి నెల నుంచే వీరు రూ.17040 వేతనం అందుకోవచ్చు. దీంతోపాటు ఇతర ప్రోత్సాహకాలూ ఉంటాయి. ప్రతి ఆరు నెలలకు ఒక డీఏ, ఏటా ఇంక్రిమెంట్ వేతనంలో కలుస్తుంది.
* అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)కు రూ.పదివేల మూల వేతనంతోపాటు రూ.4200 డీఏ దక్కుతుంది. వీరు విధుల్లో చేరిన మొదటి నెల నుంచి రూ.14,200 వేతనం, ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చు. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ఏబీపీఎంలకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. స్వల్పమొత్తంలో హెచ్‌ఆర్‌ఏ కూడా దక్కుతుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/కంప్యూటర్/స్మార్ట్‌ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఈ పోస్టుల్లో అవకాశం వచ్చినవారు రోజుకు సుమారు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది.
విధులిలా..
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం): వీరు బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పోస్టల్‌కు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం): ఈ విధులు నిర్వర్తించేవాళ్లు స్టాంపులు/స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ, ఇండియన్ పోస్టు పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, పోస్టల్‌కు సంబంధించిన ఇతర వ్యవహారాలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్టు మాస్టర్ చెప్పిన పనులు పూర్తిచేయాలి. తపాలా స్కీమ్‌ల గురించి ప్రజల్లో అవగాహన
కలిగించాలి.
ఎంపిక
అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌తో నియామకాలుంటాయి. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్/ అన్ రిజర్వ్‌డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తోన్నదానికి ఆప్షన్-1 తర్వాత దానికి ఆప్షన్-2...ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు.
కటాఫ్ అంచనా: గత నియామకాలు పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణల్లో జనరల్, ఓబీసీ విభాగాల్లో సుమారు 95 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 93 శాతం మార్కులు పొందినవారికి అవకాశం దక్కింది. పోస్టుల సంఖ్యను బట్టి కటాఫ్‌లో హెచ్చుతగ్గులుంటాయి.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవాలి.
వయసు: జూన్ 11, 2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ సడలింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 11
వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: కేంద్ర మంత్రి
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!
-
India News
Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
-
Ts-top-news News
Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
-
General News
Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి