సశస్త్ర సీమా బల్‌లో 1656 కొలువులు

హోమ్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సశస్త్ర సీమా బల్‌ 1656 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

Updated : 30 May 2023 02:59 IST

హోమ్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సశస్త్ర సీమా బల్‌ 1656 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  వీటిలో 111 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, 914 హెడ్‌కానిస్టేబుల్స్‌, 543 కానిస్టేబుల్స్‌తో పాటు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌) 40, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఫార్మసిస్ట్‌, రేడియోగ్రాఫర్‌, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌ అండ్‌ డెంటల్‌ టెక్నీషియన్‌) 30, అసిస్టెంట్‌ కమాండెంట్‌ (వెటరినరీ) 18 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా లేదా దేశం వెలుపలా నియమించే అవకాశం ఉంది.

మొత్తం 111 ఎస్‌ఐ పోస్టుల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పయనీర్‌) 20, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (డ్రాఫ్ట్స్‌మ్యాన్‌) 03, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (కమ్యూనికేషన్‌) 59, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టాఫ్‌నర్స్‌-ఫిమేల్‌) 29 ఉన్నాయి.  

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పయనీర్‌):  సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/డిప్లొమా పాసై ఉండాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (డ్రాఫ్ట్‌మ్యాన్‌): మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష పాసై.. రెండేళ్ల ఐటీఐ నేషనల్‌ ట్రేడ్స్‌మెన్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. ఆటోక్యాడ్‌లో ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలి/ ఆటోక్యాడ్‌లో ఏడాది అనుభవం ఉండాలి. డ్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్‌లో ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (కమ్యూనికేషన్‌): ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ / కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంజినీరంగ్‌ డిగ్రీ పాసవ్వాలి. లేదా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేయాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.

సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (స్టాఫ్‌నర్స్‌) ఫిమేల్‌: సైన్స్‌ సబ్జెక్టుతో 10+2/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. జనరల్‌ నర్సింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేయాలి. సెంట్రల్‌/స్టేట్‌ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టరై ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3 ఏళ్లు, డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు 5 నుంచి 10 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.  

ఎంపిక: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌ఈ), రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (కమ్యూనికేషన్‌) పోస్టుకు మాత్రమే పీఈటీ నిర్వహిస్తారు. 1.6 కి.మీ పరుగును పురుష అభ్యర్థులు 6 నిమిషాల 30 సెకన్లలో ముగించాలి. మహిళా అభ్యర్థులు 800 మీటర్ల రేసును 4 నిమిషాల్లో ముగించాలి. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పీఈటీ లేదు. అయితే వీరు పీఎస్‌టీ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌లకు హాజరుకావాలి.

రాత పరీక్ష

పీఈటీ, పీఎస్‌టీ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్ష (కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)కు ఎంపికచేస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దీన్ని నిర్వహిస్తారు. ఈ పరీక్ష వ్యవధి 3 గంటలు. 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 150 మార్కులు. ప్రశ్నపత్రం పార్ట్‌-1లో జనరల్‌ నాలెడ్జ్‌, మేథమెటిక్స్‌, రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌/ జనరల్‌ హిందీ 50 మార్కులకు ఉంటాయి.  

* పార్ట్‌-2లో టెక్నికల్‌ సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాలి. రాత పరీక్షలో సంపాదించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. పోస్టుల సంఖ్యకు మూడురెట్ల మంది అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

సన్నద్ధత

పరీక్ష విధానంపై అవగాహన అవసరం. ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులో తెలుసుకోవాలి. దానికి దానికి అనుగుణంగా టైమ్‌టేబుల్‌ వేసుకుని సన్నద్ధం కావచ్చు.

* టెక్నికల్‌ సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించారు. కాబట్టి అభ్యర్థుల తాము ఐటీఐలో చదివిన టెక్నికల్‌ అంశాలపై గట్టి పట్టుసాధించాలి. వాటిని పునశ్చరణ (రివిజన్‌) చేసుకోవాలి.

* టైమ్‌టేబుల్‌ వేసుకోవడమే కాకుండా దాన్ని కచ్చితంగా పాటించడాన్ని అలవాటు చేసుకోవాలి.

* ప్రశ్నల సరళిని తెలుసుకునేందుకు పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఆయా ప్రశ్నలకు సమాధానాలు రాసి ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోవాలి. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో సమీక్షించుకుంటూ మెరుగుపరుచుకోవాలి.

* వార్తాపత్రికను ప్రతిరోజూ చదవడం వల్ల వర్తమానాంశాలపై పట్టు సాధించగలుగుతారు.

* తగిన శారీరక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. వేగంగా పరుగెత్తడాన్ని రోజూ సాధనచేయాలి. వీటిల్లో అర్హత సాధించినవారికి మాత్రమే రాత పరీక్షను నిర్వహిస్తారు. కాబట్టి వీటికి తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలి.


హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు

మొత్తం 914 పోస్టుల్లో కేటగిరీలవారీగా.. హెడ్‌ కానిస్టేబుల్‌ (ఎలక్ట్రీషియన్‌) 15 పోస్టులు, హెచ్‌సీ- మెకానిక్‌ (పురుషులకు మాత్రమే) 296, స్టీవార్డ్‌-02, వెటర్నరీ-23, కమ్యూనికేషన్‌ 578 పోస్టులు ఉన్నాయి.  

పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమాతో పాసవడంతోపాటు పని అనుభవం ఉండాలి. హెచ్‌సీ (మెకానిక్‌) పోస్టుకు 21-27 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3 ఏళ్లు, డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థులకు 40 నుంచి 45 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీసెమెన్‌, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, స్కిల్‌టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా జరుగుతుంది.


పోలీస్‌ కానిస్టేబుల్‌ ...

మొత్తం 543 పోస్టుల్లో.. కానిస్టేబుల్‌ కార్పెంటర్‌-01, బ్లాక్‌స్మిత్‌-03, డ్రైవర్‌-96, టైలర్‌-04, గార్డెనర్‌-04, కోబ్లర్‌-05, వెటర్నరీ-24, పెయింటర్‌-03, వాషర్‌మ్యాన్‌ (పురుషులు మాత్రమే)-58, బార్బర్‌ (పురుషులు మాత్రమే)-19, సఫాయివాలా (పురుషులు మాత్రమే)-81, సీటీ-కుక్‌ (పురుషులు)- 165, సీటీ కుక్‌ (మహిళలు)-01, సీటీ వాటర్‌ క్యారియర్‌ (పురుషులు) 79 ఉన్నాయి.

డ్రైవర్‌ పోస్టుకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. పదోతరగతి/ తత్సమాన పరీక్ష పాసవడంతోపాటు.. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వయసు 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి. వెటరినరీ పోస్టుకు సైన్స్‌ ప్రధాన సబ్జెక్టుగా పదోతరగతి/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. వెటరినరీ హాస్పిటల్‌లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. కార్పెంటర్‌, బ్లాక్‌స్మిత్‌, పెయింటర్‌ పోస్టులకు పదోతరగతి/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా ఏడాది వ్యవధి ఉన్న ఐటీఐ సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉండాలి/ రెండేళ్ల ఐటీఐ డిప్లొమా ఉండాలి. ట్రేడ్‌ టెస్టులో తప్పనిసరిగా అర్హత సాధించాలి. వాషర్‌మ్యాన్‌, బార్బర్‌, సఫాయివాలా, టైలర్‌, గార్డెనర్‌, కోబ్లర్‌, కుక్‌ అండ్‌ వాటర్‌ కేరియర్‌ పోస్టులకు పదో తరగతి/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. రెండేళ్ల పని అనుభవం/ ఐటీఐ ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉండాలి/ఐటీఐలో రెండేళ్ల డిప్లొమా ఉండాలి. ట్రేడ్‌ టెస్ట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మల్టీస్కిల్డ్‌ వ్యక్తులకు ప్రాధాన్యమిస్తారు.  

దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మ్యాన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో భాగంగా 4.8 కి.మీ.ల పరుగును పురుష అభ్యర్థులు 24 నిమిషాల్లో ముగించాలి. 2.4 కి.మీ.ల దూరాన్ని మహిళా అభ్యర్థులు 18 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పీఈటీ ఉండదు. వీరు పీఎస్‌టీ, రాత పరీక్షకు హాజరుకావాలి.

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌: పీఈటీలో అర్హత సాధించిన అభ్యర్థులను పీఎస్‌టీకి ఎంపిక చేస్తారు.దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీఈటీ) నిర్వహిస్తారు. వ్యవధి రెండు గంటలు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌, మేథమెటిక్స్‌, రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌/ జనరల్‌ హిందీ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షలో అన్‌ రిజర్వుడ్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాలి. దీంట్లో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2023

వెబ్‌సైట్‌: www.ssbrectt.gov.in


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని