ఐడీబీఐ బ్యాంక్‌లో 1036 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Published : 01 Jun 2023 00:03 IST

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. కాంట్రాక్ట్‌ వ్యవధి సంవత్సరమే అయినప్పటికీ మూడేళ్లకు పొడిగించే అవకాశం ఉంటుంది. సమర్థంగా పనిచేసినవారు అసిస్టెంట్‌ మేనేజర్‌ (గ్రేడ్‌-ఎ) స్థాయికి చేరుకోవచ్చు.

మొత్తం 1036 పోస్టుల్లో.. అన్‌ రిజర్వుడ్‌కు 451, ఈడబ్ల్యూఎస్‌లకు 103, ఓబీసీలకు 255, ఎస్సీలకు 160, ఎస్టీలకు 67 ఉన్నాయి. డిగ్రీ పాసవడంతోపాటు అభ్యర్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ ఇన్‌ కంప్యూటర్‌ ఆపరేషన్స్‌/ కంప్యూటర్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయసు 01.05.2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.05.1998 తర్వాత 01.05.2003 ముందు జన్మించి ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు ఐదేళ్ల మినహాయింపు . డిగ్రీ పాసైనవాళ్లు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. డిప్లొమాను పరిగణనలోకి తీసుకోరు. దరఖాస్తు ఫీజు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200. ఆన్‌లైన్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ప్రీ రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌లతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అభ్యర్థులను ముందుగా ఏడాది కాలానికి కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమిస్తారు. పనితీరును బట్టి కాంట్రాక్టును ఏడాదికోసారి పొడిగిస్తారు. ఇలా మూడేళ్లు సమర్థంగా పనిచేసినవారిని అసిస్టెంట్‌ మేనేజర్‌ (గ్రేడ్‌-ఎ)గా నియమించే అవకాశం ఉంటుంది. మొదటి ఏడాది రూ.29,000, రెండో ఏడాది రూ.31,000, మూడో ఏడాది రూ.34,000 వేతనం చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులను ఐడీబీఐ బ్రాంచ్‌లు, డిపార్ట్‌మెంట్‌లు, బిజినెస్‌ యూనిట్లు, అనుబంధ సంస్థల్లో ఎక్కడైనా నియమించొచ్చు.

ఆన్‌లైన్‌ టెస్టు

ఇది 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రంలో నాలుగు భాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనలిటిక్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌ 60 ప్రశ్నలు (60 మార్కులు), పార్ట్‌-2లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు (40 మార్కులు), పార్ట్‌-3లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు (40 మార్కులు), పార్ట్‌-4లో జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/ కంప్యూటర్‌/ ఐటీ 60 ప్రశ్నలు (60 మార్కులు) ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/ హిందీ భాషల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులు తగ్గిస్తారు. నాలుగు విభాగాల్లోనూ అభ్యర్థులు కనీసార్హత మార్కులు సాధించాలి. ఆన్‌లైన్‌ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు.

లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనలిటిక్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌: ఆల్ఫాన్యూమరిక్‌ సిరీస్‌, ఆర్డర్‌ అండ్‌ ర్యాంకింగ్‌, డైరెక్షన్‌ అండ్‌ డిస్టెన్స్‌, కోడింగ్‌, డీకోంగ్‌, ఇన్‌ఈక్వాలిటీ, ఇన్‌పుట్‌ అవుట్‌పుట్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌, డేటా సఫీషియెన్సీ, డెసిషన్‌ మేకింగ్‌, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్‌, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ అసెమ్‌షన్స్‌, స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ ఆర్గ్యుమెంట్‌, స్టేట్‌మెంట్‌ అండ్‌ కన్‌క్లూజన్‌, ఇంటర్‌ఫియరెన్స్‌ ఫ్రమ్‌ పాసేజ్‌ ..ఈ అంశాలను బాగా సాధన చేయాలి. మాక్‌ టెస్ట్‌లు రాస్తూ ఎప్పటికప్పుడు లోటుపాట్లను సమీక్షించుకోవాలి.

డేటా అనలిటిక్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌: దీంట్లోని ప్రశ్నలకు వేగంగా సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి. ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయాలనుకోకుండా రాసినవి కరెక్టుగా ఉండేలా జాగ్రత్తపడాలి. నెగెటివ్‌ మార్కులు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాత ప్రశ్నపత్రాల్లో ఈ అంశం నుంచి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాసి సన్నద్ధతను మెరుగుపరుచుకోవాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: నంబర్‌ సిస్టమ్‌, సింప్లిఫికేషన్‌ అండ్‌ అప్రాక్సిమేషన్‌, పర్సంటేజ్‌, రేషియో అండ్‌ ప్రొపోర్షన్‌, యావరేజ్‌, ఏజ్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, సింపుల్‌ అండ్‌ కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌, స్పీడ్‌ టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌, బోట్‌ అండ్‌ స్టీమ్‌, మిక్చర్‌ అండ్‌ ఎలిగేషన్‌, మెన్సురేషన్‌, పెర్‌మ్యుటేషన్‌ అండ్‌ కాంబినేషన్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, ఇన్‌ఈక్వాలిటీస్‌, నంబర్‌ సిరీస్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ అంశాలను పునశ్చరణ చేసుకోవడం, మాక్‌ టెస్టులు రాయడం ద్వారా నైపుణ్యం సాధించవచ్చు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: టెన్సెస్‌, వాయిసెస్‌, నరేషన్స్‌, సబ్జెక్ట్‌ వెర్బ్‌ అగ్రిమెంట్‌, ఆర్టికల్స్‌, నౌన్‌, ప్రొనౌన్‌, అడ్జెక్టివ్స్‌, వెర్బ్‌, యాడ్‌వెర్బ్‌, ప్రిపోజిషన్‌, కన్‌జంక్షన్‌, కండిషనల్‌ సెంటెన్సెస్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఎర్రర్‌ డిటెక్షన్‌, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌... మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎర్రర్‌ డిటెక్షన్‌, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సాధన చేయడం, మాక్‌ టెస్టులు రాయడం ద్వారా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/కంప్యూటర్‌/ఐటీ: ఎగ్జిక్యూటివ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌లో ఇది అతి ముఖ్యమైన సెక్షన్‌. ఊహించి సమాధానాలు గుర్తించడానికి ప్రయత్నించకూడదు. నెగెటివ్‌ మార్కులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు రాయాలి. ఎకానమీ, బ్యాంకింగ్‌, పొలిటికల్‌ రంగాల్లోని వర్తమానాంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దీని కోసం రోజూ వార్తా పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమానాంశాలు, బ్యాంకింగ్‌ విషయాల్లో అవగాహన పెంచుకోవడానికి బిజినెస్‌ పత్రికలు, పోటీ పరీక్షల మ్యాగజీన్లు పరిశీలించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 07.06.2023

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 02.07.2023  

వెబ్‌సైట్‌: http://www.idbibank./

గమనించాల్సినవి: ఒకరు ఒక దరఖాస్తును మాత్రమే పంపాలి. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు పంపితే చివరగా పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

* ప్రస్తుతం ఉపయోగిస్తోన్న మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీలను మాత్రమే అప్లికేషన్‌లో రాయాలి. ఉద్యోగ సమాచారాన్ని బ్యాంక్‌ వీటి ద్వారానే తెలియజేస్తుంది.

* దరఖాస్తు, ఇ-రిసిప్ట్‌ ప్రింటవుట్లను భద్రపరుచుకుని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌లో సమయంలో చూపించాలి.

* ప్రకటనలో ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీని పేర్కొన్నప్పటికీ అది మారే అవకాశం ఉంటుంది. తాజా సమాచారం, కాల్‌ లెటర్ల కోసం అభ్యర్థులు తరచూ వెబ్‌సైట్‌ను సందర్శిస్తుండాలి.

* ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రీ ఎగ్జామినేషన్‌ ట్రెయినింగ్‌ (పీఈటీ) ఉంటుంది. దీన్ని ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను నింపే సమయంలోనే అభ్యర్థులు పీఈటీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీన్ని ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే సమాచారాన్ని అభ్యర్థుల ఈమెయిల్‌/మొబైల్‌ నంబర్లకు తెలియజేస్తారు.

* ఉద్యోగం చేస్తోన్న అభ్యర్థులు ‘నో అబ్జెక్షన్‌’ సర్టిఫికెట్‌ను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ సమయంలో సమర్పించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని