గ్రామీణ బ్యాంకులు పిలుస్తున్నాయి!

గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్‌ (స్కేల్‌ 1/2/3), ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8612 ఖాళీలు దీని ద్వారా భర్తీ కానున్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published : 06 Jun 2023 00:10 IST

దేశవ్యాప్తంగా 8612 ఉద్యోగాలు

గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్‌ (స్కేల్‌ 1/2/3), ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8612 ఖాళీలు దీని ద్వారా భర్తీ కానున్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంకింగ్‌ సేవలను గ్రామీణ ప్రాంతాలకు అందించే ఉద్దేశంతో గ్రామీణ (రీజనల్‌ రూరల్‌) బ్యాంకులను ఏర్పరిచారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ బ్యాంకులు ఉంటాయి. కాబట్టి ఈ పోస్టులు రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్రంలో ఆయా బ్యాంకులు ఉన్న కొన్ని జిల్లాల్లో మాత్రమే పనిచేయాలి. అంతర్‌ రాష్ట్ర బదిలీలు ఉండవు. తమ ప్రాంతంలో బ్యాంకు కొలువు చేస్తూ.. సేవలు అందించాలనుకునే అభ్యర్థులకు ఇదో అద్భుత అవకాశం!

జీతభత్యాలు: ప్రారంభ దశలో ఆఫీస్‌ అసిస్టెంట్‌లకు రూ.20-25 వేలు, స్కేల్‌-1 ఆఫీసర్‌లకు రూ.30-35 వేలు, స్కేల్‌-2 ఆఫీసర్‌లకు రూ.35-40 వేలు, స్కేల్‌-3 ఆఫీసర్‌లకు రూ.40-45 వేలు లభిస్తాయి. వీటితోపాటు అదనపు సదుపాయాలు (ఫర్నిచర్‌, లోన్‌ మొదలైనవి) ఉంటాయి.

ప్రకటించిన ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 939 ఉన్నాయి. గత ఏడాది ఖాళీల కంటే ఈ ఏడాది సంఖ్య 50 శాతానికి పైగా ఉంది. నోటిఫికేషన్‌లో తెలంగాణలోని రెండు గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీలను ఎన్‌ఆర్‌గా పేర్కొన్నారు. అంటే ఆయా బ్యాంకులు ఇంకా తమ ఖాళీల సంఖ్యను ఐబీపీఎస్‌కు నివేదించలేదు. అయితే దరఖాస్తు చేసుకునే చివరి తేదీ (జూన్‌ 21) లోగా వాటి ఖాళీల సంఖ్యను ఐబీపీఎస్‌కు తెలిపే అవకాశం ఉంది. గతంలో కూడా ఎన్‌ఆర్‌గా పేర్కొన్న బ్యాంకులు చివరి తేదీలోగా ఖాళీల సంఖ్యను వెల్లడించాయి. ఈ కారణంగా ఐబీపీఎస్‌ సవరించిన ఖాళీల సంఖ్యతో మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఐబీపీఎస్‌ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.


తెలుగు రాష్ట్రాల్లో ఐదు బ్యాంకులు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 5 గ్రామీణ బ్యాంకులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు కేంద్రంగా చైతన్య గోదావరి బ్యాంకు, చిత్తూరు కేంద్రంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు, కడప కేంద్రంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు, వరంగల్‌ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకుల్లో తమ ప్రాధాన్యాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి. అభ్యర్థులు సాధించిన మార్కులు, పేర్కొన్న ప్రాధాన్యాల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఎంపిక

ఆఫీస్‌ అసిస్టెంట్లను రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. స్కేల్‌-1 ఆఫీసర్లను రెండు దశల ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా, స్కేల్‌-2, స్కేల్‌-3 ఆఫీసర్లను ఒకే దశలో నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.

తెలుగులో రాసే సదుపాయం: ప్రస్తుతం దేశంలోని క్లరికల్‌ పోస్టులన్నింటినీ ఇంగ్లిష్‌, హిందీలతోపాటు ప్రాంతీయ భాషల్లో రాసుకునే సదుపాయం ఉంది. అయితే కేవలం గ్రామీణ బ్యాంకుల్లో మాత్రమే స్కేల్‌-1 ఆఫీసర్‌ (పీవో) పరీక్ష కూడా ప్రాంతీయ భాషలో రాసుకోవచ్చు. కాబట్టి స్కేల్‌-1 ఆఫీసర్‌ (పీవో), ఆఫీస్‌ అసిస్టెంట్‌ (క్లర్క్‌) పరీక్షలను తెలుగులో రాసే అవకాశం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అభ్యర్థులకు ఉంది. గ్రామీణ ప్రాంతంలోని/ తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం.


సబ్జెక్టులు - ముఖ్యమైన టాపిక్స్‌

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ

సింప్లిఫికేషన్స్‌, అప్రాక్సిమేషన్‌, నంబర్‌సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, వివిధ అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ (నంబర్‌ సిస్టమ్‌, రేషియో-ప్రపోర్షన్‌, పార్టనర్‌షిప్‌, పర్సంటేజ్‌, యావరేజ్‌, ఏజెస్‌, ప్రాఫిట్‌-లాస్‌, టైమ్‌-వర్క్‌, టైమ్‌-డిస్టెన్స్‌, ట్రెయిన్స్‌, బోట్స్‌-స్టీమ్స్‌, ఎలిగేషన్‌, మెన్సురేషన్‌, పర్ముటేషన్‌-కాంబినేషన్‌, ప్రాబబిలిటీ).
రీజనింగ్‌: సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, డైరెక్షన్స్‌, ఆర్డర్‌-ర్యాంకింగ్‌, ఆల్ఫా న్యూమరిక్‌ సిరీస్‌, సిలాజిజమ్‌, బ్లడ్‌రిలేషన్స్‌, నంబర్‌సిరీస్‌, డేటా సఫిషియన్సీ మొదలైనవి. వీటితోపాటు మెయిన్స్‌ కోసం ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, ఎలిజిబిలిటీ టెస్ట్‌, కాజ్‌-ఎఫెక్ట్‌, స్టేట్‌మెంట్‌ సంబంధ టాపిక్స్‌.

ఇంగ్లిష్‌: గ్రామర్‌ బాగా చూసుకోవాలి. దీని ఆధార ప్రశ్నలు సాధన చేయాలి (ఉదాహరణకు సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్‌, సెంటెన్స్‌ కరెక్షన్స్‌, ఎర్రర్‌ ఫైండింగ్స్‌, ఫిల్లింగ్‌ ది బ్లాంక్స్‌, క్లోజ్‌ టెస్ట్‌ మొదలైనవి). రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ బాగా సాధన చేయాలి. ఒకాబ్యులరీ (సిననిమ్స్‌ - యాంటనిమ్స్‌) నుంచి ప్రశ్నలుంటాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌: కరెంట్‌ అఫైర్స్‌, ఆర్థిక వ్యవస్థలు, దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు (వరల్డ్‌ బ్యాంక్‌, ఏడీబీ, నీతి ఆయోగ్‌ మొదలైనవి). రిజర్వ్‌బ్యాంక్‌, బ్యాంకింగ్‌ వ్యవస్థ, ముఖ్యమైన దినోత్సవాలు, వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు-రచయితలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మొదలైనవి.

కంప్యూటర్‌ నాలెడ్జ్‌: బేసిక్స్‌ ఆఫ్‌ కంప్యూటర్‌, ఎవల్యూషన్‌, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ (వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌), నెట్‌ వర్కింగ్‌, కమ్యూనికేషన్స్‌, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ హ్యాకింగ్‌, సెక్యూరిటీ, వైరస్‌లు మొదలైనవి.

పరీక్ష విధానం


ఎలా సన్నద్ధం కావాలి?

కేవలం గ్రాడ్యుయేషన్‌ అర్హతగా ఉన్న ఆఫీస్‌ అసిస్టెంట్‌, స్కేల్‌-1 ఆఫీసర్‌ పరీక్షా విధానాలు ఒకే విధంగా ఉంటాయి. పరీక్షలోని ప్రశ్నల స్థాయిలో మాత్రం భేదం ఉంటుంది. కాబట్టి రెండు పరీక్షల్లో దేనికి ప్రిపేర్‌ అయినా అది రెండో పరీక్షకు సరిపోతుంది.

* ప్రిలిమినరీ పరీక్షలో కేవలం రెండు సబ్జెక్టులు (ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌)లు మాత్రమే ఉంటాయి. మెయిన్స్‌లో వీటితోపాటు ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌లు ఉంటాయి.

* ప్రిలిమ్స్‌ పరీక్షకు రెండు నెలల సమయం ఉంది. ఈ సమయాన్ని అనుసరించి అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ ప్రణాళికను ఏర్పరుచుకోవాలి.

* ప్రిలిమ్స్‌లోని రెండు సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తూ మెయిన్స్‌లో ఉన్న సబ్జెక్టులను కూడా కలిపి ఉమ్మడి ప్రిపరేషన్‌ చేసుకోవాలి.

* మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు ఎల్‌పీటీ పద్ధతిలో ప్రిపేర్‌ అవ్వాలి. నేర్చుకోవడం (లెర్నింగ్‌), ప్రాక్టీస్‌ చేయడం (ప్రాక్టీస్‌), టెస్ట్‌లు రాయడం (టెస్ట్స్‌). ఈ మూడూ ఒకదానితో ఒకటి కలిసి ఉండేలా చూడాలి.

* ముందుగా సబ్జెక్టులోని ఏదైనా టాపిక్‌ను బాగా నేర్చుకుని, దానిలో వివిధ తరహాల్లో ఉండే ప్రశ్నలను సాధన చేయాలి.

* వీటిని వేగంగా సాధించగలిగేలా షార్ట్‌కట్‌ పద్ధతులు నేర్చుకోవాలి.

* ఆపై నిర్ణీత సమయాన్ని నిర్దేశించుకుని (ఉదా: 50 ప్రశ్నలు - 30 నిమిషాలు) టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో అర్థమవుతుంది. ఆ సంఖ్య పెరిగేలా సాధన చేయాలి.

* టెస్ట్టులను టాపిక్‌లవారీగా, సెక్షన్‌వారీగా (ఆప్టిట్యూడ్‌/ రీజనింగ్‌/ ఇంగ్లిష్‌ మొదలైనవి) ఆపై పూర్తిస్థాయి ప్రశ్నపత్రంవారీగా రాయాలి.

* ప్రతిరోజూ అన్ని సబ్జెక్ట్‌లనూ సాధన చేయాలి.

* సబ్జెక్టుల కఠినత్వాన్ని అనుసరించి సమయాన్ని నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు 10 గంటల సాధనలో ఆప్టిట్యూడ్‌కు 4 గంటలు, రీజనింగ్‌కు 3 గంటలు, ఇంగ్లిష్‌కు 2 గంటలు, కరెంట్‌ అఫైర్స్‌/కంప్యూటర్స్‌కు 1 గంట కేటాయించాలి.

* వీలైనంత త్వరగా టాపిక్స్‌ పూర్తయ్యేలా చూసుకుని ఆపై వాటిలోని వివిధ ప్రశ్నలను బాగా సాధన చేయాలి.

* గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను గమనిస్తే ప్రశ్నలు ఏ స్థాయిలో, ఏయే టాపిక్స్‌ నుంచి ఎన్నెన్ని వస్తున్నాయో అవగాహన ఏర్పడుతుంది. వాటిని అనుసరించి ప్రిపేర్‌ అవ్వాలి.

* ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌ ముందుగా పూర్తిచేసుకోవాలి.

ఇలా ఒక ప్రణాళికతో ప్రిపేర్‌ అయితే గ్రామీణ బ్యాంకులో తప్పనిసరిగా కొలువు సాధించగలుగుతారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని