డిపెండెంట్‌ వీసా ఉండగా...హెచ్‌1బి పొందవచ్చా?

అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ప్రశ్నలను ఆహ్వానించింది....

Published : 26 Feb 2020 00:39 IST

అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ప్రశ్నలను ఆహ్వానించింది. వాటికి హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు.

2007లో డిపెండెంట్‌ (ఎఫ్‌-4) వీసా కోసం దరఖాస్తు చేశాను. ఇంకా ఆమోదం పొందలేదు. అమెరికాలో అండర్‌గ్రాడ్యుయేషన్‌ చేయాలనుకుంటున్నాను. విద్యార్థి (ఎఫ్‌-1) వీసా జారీ అవుతుందా?

- రవిచంద్రన్‌ టీవీ

జవాబు: దరఖాస్తు చేసుకున్న వీసా విభాగానికి అర్హులా.. కాదా? అన్నది ఇంటర్వ్యూ సమయంలో కాన్సులర్‌ అధికారి స్థూలంగా పరిశీలిస్తారు. మీ విద్యార్హతలు, భవిష్యత్తు ప్రణాళికలపై కాన్సులర్‌ అధికారితో చర్చించేందుకు సన్నద్ధమై ఉండండి. వీసా పొందేందుకు విశ్వసనీయతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. డిపెండెంట్‌ వీసా దరఖాస్తు పెండింగులో ఉన్నప్పటికీ విద్యార్థి వీసాను పొందేందుకు ఎలాంటి ప్రతిబంధకం లేదు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ వెబ్‌సైట్‌ https://educationusa.stae.gov, యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ (యూఎస్‌ఐఈఎఫ్‌) వెబ్‌సైట్‌ https://www.usief.org.in చూడండి. విద్యార్థి వీసాకు సంబంధించిన సమాచారం కోసం www.ustraveldocs.com ను పరిశీలించండి.


నాకు 2020 ఆగస్టు వరకు చెల్లుబాటు అయ్యే హెచ్‌-1బి వీసా ఉంది. మరో యాజమాన్యం కిందకి ఉద్యోగం మారాను. వ్యక్తిగత పనులపై భారతదేశం రావాలనుకుంటున్నాను. ఇక్కడ వీసా స్టాంప్‌ చేయించుకోవచ్చా?

- కృష్ణచంద్ర మువ్వా

జ: యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఆమోదించిన హెచ్‌-1బి వీసాపై మీ కోసం పిటిషన్‌ దాఖలు చేసిన యాజమాన్యం పేరు, చెల్లుబాటు తేదీ తదితర సమాచారం ఉంటుంది. మీరు ఆ యాజమాన్యం వద్ద పని చేయని కారణంగా మీ వీసా చెల్లుబాటు కాదు. మీరు అమెరికాలో ప్రవేశానికి ముందుగానే నూతన యాజమాన్యం ద్వారా హెచ్‌-1బి పిటిషన్‌ దాఖలు చేసి ఉండాలి. మరింత సమాచారం కోసం https://www.uscis.gov/ చూడండి.


ఫార్మసీ గ్రాడ్యుయేషన్‌లో భాగంగా ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాను. అమెరికాలో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. ప్రవేశ ప్రక్రియ ఏమిటి?

- శారద కలిదిండి

జ: డిగ్రీ నాలుగో సంవత్సరంలో కానీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ రెండో సంవత్సరంలో కానీ పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకోండి. అమెరికాలో పీహెచ్‌డీ చేయాలంటే అత్యధిక శాతం విశ్వవిద్యాలయాలు పరిశోధన లేదా వృత్తి నైపుణ్యం అవసరమని కోరతాయి. పీహెచ్‌డీ కోసం కనీసం ఒకటీ రెండు సంవత్సరాల ముందు నుంచి ఆ ప్రక్రియను చేపట్టండి. పీహెచ్‌డీలో పరిశోధన చేయాలనుకున్న అంశాన్నీ, విశ్వవిద్యాలయాన్నీ, ప్రొఫెసర్‌నూ దరఖాస్తుకు ముందుగానే నిర్ణయించుకోండి. పీహెచ్‌డీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇంగ్లిషు నైపుణ్య పరీక్ష (జీఆర్‌ఈ/జీమ్యాట్‌, టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌/పీటీఈ) స్కోరులతోపాటు ఆర్థికపరమైన పత్రాలు తదితరాలను సిద్ధం చేసుకోవాలి. మరింత సమాచారం కోసం

https://educationusa.state.gov/complete-your-us-application-graduate ను పరిశీలించండి.


డిపెండెంట్‌ వీసాపై అమెరికాలో ఉంటున్నాను. డిపెండెంట్‌ వీసా ఉండగా హెచ్‌1బి వీసా పొందవచ్చా?

- హర్షిత

జ: డిపెండెంట్‌ వీసాపై ఉన్నప్పటికీ హెచ్‌1బి వీసాను పొందవచ్ఛు అయితే ఆ వీసా ప్రక్రియ ప్రారంభం కావాలంటే- మీకు ఉద్యోగం ఇచ్చేందుకు అమెరికా కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేస్తూ అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీకి దాఖలు చేసిన పిటిషన్‌ ఆమోదం పొందాలి. తర్వాత హెచ్‌-1బి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. డిపెండెంట్‌ వీసా అమెరికాలో ఉన్నా హెచ్‌-1బి వీసాను పొందటంలో ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. హెచ్‌-1బి పిటిషన్‌కు సంబంధించిన సమాచారం కోసం https://www.uscis.gov/ చూడండి. వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ తదితర సమాచారం కోసం www.ustraveldocs.com ను పరిశీలించండి.●

* వీసాలకు సంబంధించిన నిర్దిష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి.

* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు.

*  హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపవచ్చు.

- ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని