పరిశోధనలకు దివ్యమైన చేయూత

పరిశోధన పట్ల ఆసక్తి ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తోంది. శారీరక లోపాలతో ఇబ్బందిపడుతున్న వారిలో....

Published : 03 Jun 2020 00:25 IST

ఫెలోషిప్‌లకు ప్రకటన విడుదల

పరిశోధన పట్ల ఆసక్తి ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తోంది. శారీరక లోపాలతో ఇబ్బందిపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. సామాజిక, విజ్ఞాన శాస్త్రాలు సహా పలు విభాగాల్లో రిసెర్చ్‌ చేస్తున్నవారు ఈ ఫెలోషిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

త సంవత్సరం లేదా ఈ ఏడాది ఎంఫిల్‌ లేదా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరిన దివ్యాంగులకోసం 400 ఫెలోషిప్‌లు ఎదురుచూస్తున్నాయి. వీటిని కేంద్రానికి చెందిన సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ ఫెలోషిప్స్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌ పేరుతో అందిస్తున్నారు. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఆధ్వర్యంలో ఏడాదికి 200 మందికి చొప్పున ఇస్తున్నారు. 2018-2019, 2019-2020 విద్యా సంవత్సరాలకు ఈ ఫెలోషిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన వెలువడింది. అభ్యర్థులు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కులను ప్రామాణికంగా చేసుకుని మెరిట్‌ ప్రాతిపదికన వీటిని అందిస్తారు.

ఎవరి కోసం?

ఈ ఫెలోషిప్‌లు పొందడానికి దివ్యాంగులు మాత్రమే అర్హులు. ఏప్రిల్‌ 1, 2018 తర్వాత రెగ్యులర్‌, ఫుల్‌ టైం విధానంలో ఎంఫిల్‌ లేదా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరినవారికే అవకాశం ఉంటుంది. వీటికి అర్హత పొందిన వారు మరే ఇతర ఫెలోషిప్‌లూ పొందుతూ ఉండకూడదు. అలాగే ఆ తర్వాత కూడా వేటికీ దరఖాస్తు చేసుకోకూడదు. 2018-2019, 2019-2020 విద్యా సంవత్సరాల్లో రిసెర్చ్‌ కోర్సుల్లో చేరినవారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్ఛు రెండు విద్యా సంవత్సరాలకు కలిపి 400 స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి. వీటిలో 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు దక్కుతాయి. మిగిలినవాటికి దివ్యాంగులందరూ పోటీ పడవచ్చు.

ఫెలోషిప్‌ వివరాలు

మెరిట్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి అయిదేళ్లపాటు ఈ ఫెలోషిప్‌ అందుతుంది. మానవీయశాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, యాంత్రిక, సాంకేతిక శాస్త్రాల అభ్యర్థులకు మొదటి రెండేళ్లు జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) నెలకు రూ.25 వేలు, ఆ తర్వాత మూడేళ్లు సీనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌) నెలకు రూ.28 వేలు వంతున అందుతాయి. కంటింజెన్సీ కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున మొదటి రెండేళ్లు, రూ.20,500 మేరకు తర్వాత మూడేళ్లు ఇస్తారు. విజ్ఞానశాస్త్రం, యాంత్రిక, సాంకేతిక శాస్త్ర విభాగాల అభ్యర్థులకు కంటింజెన్సీ కింద మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.12 వేలు, తర్వాత మూడేళ్లు రూ.25 వేలు వంతున దక్కుతాయి. హాస్టల్‌లో ఉచితంగా వసతి కల్పిస్తారు. ఒకవేళ వసతి సౌకర్యం ఇవ్వలేకపోతే ప్రతినెల హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. ఆ యూనివర్సిటీ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఫెలోషిప్‌లో 30 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ అందుతుంది. వీరికి ఎస్కార్ట్‌/ రీడర్‌ అసిస్టెన్స్‌గా కొనసాగిన వారికి ప్రతి నెల రూ.2000 చొప్పున చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 19, 2020

వెబ్‌సైట్‌: https://www.ugc.ac.in/nfpwd/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని