బార్క్‌లో భలే అవకాశాలు!

భారతప్రభుత్వ విభాగమైన భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌), ముంబయి 160 స్టైపెండరీ ట్రెయినీ, 105 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌లకు విడివిడిగా ప్రకటనలు వెలువరించింది. ఐటీఐ/ డిప్లొమా/ ఎమ్మెస్సీ అర్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.

Published : 21 Dec 2020 00:36 IST

భారతప్రభుత్వ విభాగమైన భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌), ముంబయి 160 స్టైపెండరీ ట్రెయినీ, 105 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌లకు విడివిడిగా ప్రకటనలు వెలువరించింది. ఐటీఐ/ డిప్లొమా/ ఎమ్మెస్సీ అర్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.
స్టైపెండరీ ట్రెయినీలో రెండు విభాగాలున్నాయి. కేటగిరి-1 గ్రూప్‌ బిలో 50, కేటగిరి-2 గ్రూప్‌ సిలో 110 ఖాళీలు భర్తీ చేస్తారు.
కేటగిరి 1 పోస్టులకు ఆబ్జెక్టివ్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 40 ప్రశ్నలు వస్తాయి. ఇవి సంబంధిత విభాగాల్లో డిప్లొమా/బీఎస్సీ సిలబస్‌ ప్రకారం ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. ఇందులో ప్రతిభ చూపినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి విధుల్లోకి తీసుకుంటారు. కేటగిరి 2 పోస్టులకు 3 దశల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలు చేపడతారు. స్టేజ్‌ 1 పరీక్షలో 50 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్‌ 20, సైన్స్‌ 20, జనరల్‌ అవేర్‌నెస్‌ 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. అర్హత సాధించినవారికి వారి ట్రేడుల ప్రకారం స్టేజ్‌ 2 అడ్వాన్స్‌డ్‌ టెస్టు ఉంటుంది. ఇందులో 2 గంటల వ్యవధిలో 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికీ 3 మార్కులు ఉంటాయి. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ఇందులో మెరిసినవారికి స్టేజ్‌ 3 స్కిల్‌ టెస్టు నిర్వహిస్తారు.
ఎంపికైనవారికి బార్క్‌ కేంద్రాలైన తారాపూర్‌/కల్పక్కంలో రెండేళ్ల శిక్షణ ఉంటుంది. కేటగిరి 1లో చేరినవారికి మొదటి ఏడాది ప్రతి నెల రూ.16,000 రెండో ఏట రూ.18,000 చొప్పున చెల్లిస్తారు. కేటగిరీ 2 విభాగాల్లో చేరినవారికి తొలి సంవత్సరం రూ.10,500 ఆ తర్వాత రూ.12,500 అందిస్తారు. కేటగిరి 1 శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. కేటగిరి 2లో శిక్షణ పూర్తిచేసుకున్నవారికి టెక్నీషియన్‌ బి, సి హోదాలు దక్కుతాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31, 2021.


జేఆర్‌ఎఫ్‌లు

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)కు ఎంపికైనవారు కేంద్ర అణువిద్యుత్‌ శక్తి సంస్థకు చెందిన హోమీ బాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ చేసుకోవచ్చు. ఎంపికైనవారికి అయిదేళ్లపాటు స్టైపెండ్‌ అందుతుంది.  
మొత్తం ఫెలోషిప్పులు: 105 అర్హత: మంచి అకడమిక్‌ నేపథ్యం అవసరం. బీఎస్సీలో 60 శాతం, ఎమ్మెస్సీలో 55 శాతం మార్కులు సాధించాలి. ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/లైఫ్‌ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ/ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ బీఎస్‌-ఎంఎస్‌తోపాటు నిర్దేశిత అర్హత పరీక్షల్లో ఎందులోనైనా ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. వయసు: జనవరి 15, 2021 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: యూజీసీ-సీఎస్‌ఐఆర్‌ నెట్‌/ జస్ట్‌/ ఐసీఎంఆర్‌/ఐసీఏఆర్‌/డీబీటీ/గేట్‌ వీటిలో ఏదో ఒక స్కోర్‌ పొందడం తప్పనిసరి. ఇలా అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది నియామకాలు చేపడతారు.
ఫెలోషిప్‌కు ఎంపికైనవారికి మొదటి రెండేళ్లు ప్రతి నెలా రూ.31,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్‌లో తర్వాతి మూడేళ్లు నెలకు రూ.35,000 చొప్పున అందుతుంది. ఏటా రూ.40,000 కాంటింజెన్సీ ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 15, 2021 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. ఇంటర్వ్యూలు: ఏప్రిల్‌/మేలో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://barc.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని