Published : 12 Aug 2019 00:54 IST

ఇంజినీర్లకు కొలువుల పిలుపు

ప్రిపరేషన్‌ గైడెన్స్‌

సివిల్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. 11,158 ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.  రాత పరీక్షలో ప్రతిభను ప్రదర్శిస్తే సర్కారీ కొలువు అందుకోవచ్చు.

సాంకేతిక అర్హతలున్న నిరుద్యోగులకు ఇదో సువర్ణావకాశం. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం పొందినవారు గ్రామ సచివాలయాల్లో నియమితులవుతారు. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష ప్రశ్నపత్రం డిప్లొమా (గత ఈసెట్‌ ప్రశ్నపత్రాల) స్థాయిలో ఉండవచ్చు. సిలబస్‌కు అనుగుణంగా సమగ్రంగా సిద్ధమయితే ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు.

ఏ సబ్జెక్టు ఎలా చదవాలి?
పార్ట్‌- ఎ: జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ: ఇది 50 మార్కులకు ఉంటుంది. సాధారణ అంకగణిత ప్రశ్నలే కాకుండా రీజనింగ్‌కు సంబంధించి కోడింగ్‌-డీకోడింగ్‌, నంబర్‌ సిరీస్‌, రక్త సంబంధాలు మొదలైనవి సాధన చేయాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులు, సైన్స్‌ టెక్నాలజీలకు సంబంధించిన వర్తమాన వ్యవహారాలతో ముడిపడిఉన్న ప్రశ్నలు అడుగుతారు. ఇవి అభ్యర్ధి తార్కిక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఈ ప్రశ్నల ఒరవడి తెలుసుకోవాలంటే ప్రతిరోజూ ప్రముఖ వార్తాపత్రికలను చదువుతూ నోట్సు తయారుచేసుకోవాలి. పోటీ పరీక్షల మ్యాగజీన్లను కూడా పరిశీలిస్తే ఫలితం ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌తో కూడికలు, తీసివేతలు, భాగహారాలు వంటి ప్రాథమికాంశాలు కాల్‌క్యులేటర్‌ను ఉపయోగించకుండా నోటితోనే చేయగలిగేలా అభ్యాసం చేయాలి.  జనరల్‌ ఇంగ్లిష్‌లో మంచిమార్కులు సాధించాలంటే బేసిక్‌ గ్రామర్‌ చాలా ముఖ్యం. ఇందులో ఒక పదానికి సంబంధించిన పర్యాయపదాలు, వ్యతిరేకపదాలపై మంచి అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఖాళీలు పూరించటం, తప్పులను గుర్తించటం, డైరెక్ట్‌, ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌, ఆర్టికల్స్‌, యాక్టివ్‌ అండ్‌ ప్యాసివ్‌ వాయిస్‌, ప్రిపొజిషన్‌ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. దీనికోసం వొకాబ్యులరీపై పట్టు అవసరం.మొబైల్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, బిగ్‌డేటా, మిషన్‌ లర్నింగ్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ మొదలైన ఆధునిక సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలి. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంక్షేమ-అభివృద్ధి పథకాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా నవరత్నాలపై అవగాహన చాలా అవసరం.

ఈసెట్‌ స్థాయిలో ప్రశ్నలు

డిప్లొమా కనీస అర్హత కాబట్టి ప్రశ్నలు ఆ స్థాయిలోనే ఉంటాయి. ఈసెట్‌ ప్రశ్నలను పరిశీలించి ప్రిపరేషన్‌ సాగించవచ్చు. సిలబస్‌ను ఒకటి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో అర్థమవుతుంది. పరీక్షకు తక్కువ సమయం ఉంది కాబట్టి కనీసం 8 నుంచి 10 గంటలు అధ్యయనానికి  కేటాయించాలి. ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి.
పార్ట్‌-బి: సివిల్‌/మెకానికల్‌ (డిప్లొమా స్థాయి) ఈ విభాగం అభ్యర్థుల సంబంధిత కోర్‌ సబ్జెక్టుకు సంబంధించినది. 100 మార్కులకు ఉంటుంది. ఇందులో స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, ప్ల్లూయిడ్‌ మెకానిక్స్‌, హైడ్రాలిక్‌ పంప్స్‌, ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్స్‌, సర్వేయింగ్‌, ప్రొడక్షన్‌ టెక్నాలజీ ముఖ్యం. ప్రొడక్షన్‌ టెక్నాలజీ అనేది మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వారికి మాత్రమే ఉంటుంది. దీనిపై సివిల్‌ అభ్యర్థులకు అంతగా పట్టు ఉండదు. అయినా ఆందోళన చెందకుండా వారి కోర్‌ సబ్జెక్టులను పూర్తిగా చదవాలి. రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ స్ట్రక్చర్స్‌, సర్వేయింగ్‌ అనేవి మెకానికల్‌ వారికి ఉండవు. ఉన్న సమయంలో మెకానికల్‌ కోర్‌ సబ్జెక్టులను పూర్తిగా చదవాలి.

-  వై.వి. గోపాలకృష్ణమూర్తి

జామ్‌ - 2020 ప్రిపరేషన్‌ విధానం : https://t.ly/Nzzwx ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ వివరాలు https://t.ly/yBNG లేదా www.eenadupratibha.net చూడవచ్చు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని