టెన్త్‌ అర్హతతో ఉపకార వేతనాలు

విద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లోని పేదలకు చేయూతనందిస్తే వారి జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని విశ్వసించే సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి మొత్తం ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది...

Published : 12 Jun 2019 00:21 IST

విద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లోని పేదలకు చేయూతనందిస్తే వారి జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని విశ్వసించే సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి మొత్తం ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. పదోతరగతి ఉత్తీర్ణులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌ 1999లో ఏర్పాటైంది. ఎస్‌.డి.సిబులాల్‌ (ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో), కుమారి సిబులాల్‌ దీనిని స్థాపించారు.  విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో పేదలకు చేయూతనిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యాదాన్‌ ఉపకార వేతనాలను ప్రవేశపెట్టారు. దాతల సహకారంతో అందించే ఈ ఉపకార వేతనాలతో వేలాది మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుతం 2800 మంది స్కాలర్‌షిప్‌లు పొందుతున్నారు. 
ప్రతిభ ఎంత ఉన్నా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేస్తుంటారు. ఉన్నత చదువులు చదవాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం వారికి అడ్డుగా ఉంటోంది. అలాంటి వారికి ఉపకార వేతనాలు అందించడమే గాక ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తోంది సరోజిని దామోదరన్‌ సంస్థ. పదోతరగతిలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు విద్యాదాన్‌ పేరిట ఉపకార వేతనాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఇంటర్‌తో పాటు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల ప్రతిభ, కోర్సు ప్రాతిపదికగా సంవత్సరానికి రూ.10 వేల నుంచి రూ.60 వేలు వరకు స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది.

పలు రాష్ట్రాల విద్యార్థులకు.. 
ఈ ఫౌండేషన్‌ విద్యాదాన్‌ కార్యక్రమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, కర్ణాటక,  తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. పదో తరగతిలో 90% మార్కులతోఉత్తీర్ణత లేదా 9 జీపీఏ సాధించిన వారు వీటిని పొందడానికి అర్హులు. దివ్యాంగులైతే 75% మార్కులు లేదా 7.5 జీపీఏ సాధిస్తే చాలు. అభ్యర్థుల కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలి.  రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా అభ్యర్థులను  ఎంపిక చేస్తారు. వీరికి రెండేళ్ల పాటు సంవత్సరానికి రూ.6 వేల చొప్పున ఉపకార వేతనాలను అందిస్తారు. అలాగే ప్రతిభ కనబరుస్తూ ఉన్నత చదువులకు వెళ్లే అభ్యర్థులకు ఉపకారవేతనాలు కొనసాగిస్తారు.

దరఖాస్తు విధానం: ఉపకార వేతనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు వ్యక్తిగత ఈ-మెయిల్‌ ఐడీ ఉండాలి. మొదట ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ www.vidyadhan.org లో రిజిస్టర్‌ చేసుకోవాలి. తర్వాత లాగిన్‌ అయ్యి వివరాలను నమోదు చేయాలి. 2019 పదోతరగతి మార్కులు, కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. విద్యాదాన్‌ వివరాలు ఈ-మెయిల్‌కీ వస్తాయి కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు మెయిల్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: జూన్‌ 30, 2019

రాత, మౌఖిక పరీక్షలు: జులై 15 నుంచి ఆగస్టు 30 వరకు జరుగుతాయి. ఎంపికైన విద్యార్థులకు రాత పరీక్ష కేంద్రాలను వ్యక్తిగతంగా తెలియజేస్తారు. 
ఇతర సమాచారం కోసం: ‌vidyadhan.andhra@sdfoundationindia.com లేదా 8367751309 ఫోన్‌నెంబర్లకు మెసేజ్‌ పంపి సంప్రదించవచ్చు. 
- మొహిద్దీన్‌, న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని