డిగ్రీలో చేరితే ఉపకార వేతనం

తెలివితేటలు, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థికంగా వెసులుబాటు లేనివారు ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహిస్తూ మరుబెనీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎంఐపీఎల్‌) మెరిటోరియస్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది.

Published : 10 Sep 2019 00:20 IST

తెలివితేటలు, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థికంగా వెసులుబాటు లేనివారు ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహిస్తూ మరుబెనీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎంఐపీఎల్‌) మెరిటోరియస్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఇప్పటికే విడుదలైంది. ఇంటర్‌ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరినవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు రకాల ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపకారవేతనాలకు అర్హులను ఎంపిక చేస్తారు.

ఆర్థిక ఇబ్బందులున్న మెరిట్‌ విద్యార్థులను ఉన్నతవిద్య దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎంఐపీఎల్‌ మరుబెనీ ఇండియా మెరిటోరియస్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. విభాగాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా వీటిని ఇస్తున్నారు. మొత్తం 100 వరకూ స్కాలర్‌షిప్‌లు ఉంటాయి. ఎంపికైనవారికి ఒకేసారి రూ.40,000 నుంచి రూ.50,000 వరకూ అందజేస్తారు.

అర్హతలు
* గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫుల్‌టైం అండర్‌ గ్రాడ్యుయేట్‌/ ప్రొఫెషనల్‌/ టెక్నికల్‌ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* ఇంటర్మీడియట్‌లో 75% మార్కులు సాధించి ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షలకు మించకూడదు.
* ఏడాదికి రూ.6000 కన్నా తక్కువగా ఇతర స్కాలర్‌షిప్‌లు పొందుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ: మెరిట్‌, ఆర్థిక అవసరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం టెలిఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారు. అందులో ఉత్తీర్ణులైనవారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనిలోనూ ప్రతిభ చూపితే స్కాలర్‌షిప్‌ ఇస్తారు. తుది ఫలితాలను డిసెంబర్‌లో ప్రకటిస్తారు.

ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-మెయిల్‌/ ఫేస్‌బుక్‌/ గూగుల్‌ అకౌంట్లతోనూ నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఏమీ లేదు.

సమర్పించాల్సిన పత్రాలు
* ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్‌
* అడ్రస్‌ ప్రూఫ్‌
* వయసు ధ్రువీకరణ పత్రం
* పది, ఇంటర్‌ మార్కు షీట్లు
* ఆదాయ ధ్రువీకరణ పత్రం
* అడ్మిషన్‌ ప్రూఫ్‌

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: సెప్టెంబరు 25, 2019
వెబ్‌సైట్‌: https://marubeni.co.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని