సంస్కృత విద్యార్థులకు ఉపకారం

సంస్కృతం సబ్జెక్టుగా చదివితే మంచి మార్కులతోపాటు స్కాలర్‌షిప్‌ను సంపాదించుకోవచ్చు. తొమ్మిదో తరగతితో మొదలు పెడితే పీహెచ్‌డీ వరకు వీటిని అందుకునే వీలుంది. దేశ రాజధానిలోని డీమ్డ్‌ యూనివర్సిటీ ఈ మేరకు నోటిఫికేషన్‌ ఇచ్చింది.

Published : 01 Oct 2019 01:02 IST

సంస్కృతం సబ్జెక్టుగా చదివితే మంచి మార్కులతోపాటు స్కాలర్‌షిప్‌ను సంపాదించుకోవచ్చు. తొమ్మిదో తరగతితో మొదలు పెడితే పీహెచ్‌డీ వరకు వీటిని అందుకునే వీలుంది. దేశ రాజధానిలోని డీమ్డ్‌ యూనివర్సిటీ ఈ మేరకు నోటిఫికేషన్‌ ఇచ్చింది.

సంస్కృతం చదివే విద్యార్థులను ప్రోత్సహించి, ఆ భాషాభివృద్ధికి తోడ్పటం కోసం న్యూదిల్లీలోని  ‘రాష్ట్రీయ సాన్‌స్క్రిట్‌ సంస్థాన్‌’ (డీమ్డ్‌ యూనివర్సిటీ) ఉపకార వేతనాలను అందిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన విడుదలైంది. తొమ్మిదో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు సంస్కృతం/ పాళీ/ ప్రాకృత భాషలను చదువుతున్న విద్యార్థులెవరైనా  ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉపకార వేతనాలకు అర్హులను ఎంపిక చేస్తారు. రెగ్యులర్‌ విధానంలో చదువుతున్నవారే దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాల, కళాశాల విద్యార్థులు ఎవరైనా గత ఏడాది చదివిన తరగతిలో 60 శాతం మార్కులను పొందివుండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు,  దివ్యాంగులు 50 శాతం, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు 55 శాతం మార్కులు సాధించాలి.

ఉపకార వేతనాల సంఖ్యను ప్రకటించలేదు. ఏటా అందుబాటులో ఉండే నిధులను బట్టి వీటిని మంజూరు చేస్తారు.

అర్హతలు: తొమ్మిదో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు సంస్కృతం/ పాళీ/ ప్రాకృత భాషలను ప్రధానాంశంగా కానీ, ఐచ్ఛికాంశంగా కానీ చదవాలి.
* తొమ్మిదో తరగతి/ పదో తరగతి/ పూర్వ-మధ్యమ మొదటి సంవత్సరం
* పదకొండో తరగతి/ ప్రాక్‌-శాస్త్రి మొదటి సంవత్సరం/ ఉత్తర్‌ మధ్యమ మొదటి సంవత్సరం
* పన్నెండో తరగతి/ ప్రాక్‌-శాస్త్రి రెండో సంవత్సరం/ ఉత్తర్‌ మధ్యమ రెండో సంవత్సరం
* శాస్త్రి మొదటి సంవత్సరం/ బీఏ మొదటి సంవత్సరం/ బీఏ (ఆనర్స్‌) మొదటి సంవత్సరం
* శాస్త్రి రెండో సంవత్సరం/ బీఏ రెండో సంవత్సరం/ బీఏ (ఆనర్స్‌) రెండో సంవత్సరం
* శాస్త్రి మూడో సంవత్సరం/ బీఏ మూడో సంవత్సరం/ బీఏ (ఆనర్స్‌) మూడో సంవత్సరం
* ఆచార్య మొదటి సంవత్సరం/ ఎంఏ మొదటి సంవత్సరం లేదా సంస్కృతం/ పాళీ/ ప్రాకృతంలో తత్సమాన కోర్సు
* ఆచార్య రెండో సంవత్సరం/ ఎంఏ రెండో సంవత్సరం లేదా సంస్కృతం/ పాళీ/ ప్రాకృతంలో తత్సమాన కోర్సు
* విద్యార్థి/పీహెచ్‌డీ లేదా సంస్కృతం/ పాళీ/ ప్రాకృతంలో తత్సమాన కోర్సు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, విద్యాసంస్థల రిజిస్ట్రేషన్‌/ ప్రొఫైల్‌ అప్‌డేషన్‌ కోసం
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: అక్టోబరు 20, 2019
విద్యాసంస్థల రిజిస్ట్రేషన్‌ యాక్టివేషన్‌ తర్వాత విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవడానికి గడువు: అక్టోబరు 31, 2019,
వెబ్‌సైట్‌: http://sanskrit.nic.in లేదా  www.scholarship.rsks.in

ఎంత మొత్తం?

తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు నెలకు రూ.250 ఇస్తారు. పదకొండు, పన్నెండో తరగతి చదువుతుంటే నెలకు రూ.300, డిగ్రీ మొదటి, రెండు, మూడు సంవత్సరాలవారికి నెలకు రూ.400,  పీజీ మొదటి, రెండు సంవత్సరాల విద్యార్థులకు నెలకు రూ.500 ఇస్తారు. ఈ అందరికీ పది నెలలపాటు ఉపకార వేతనం అందుతుంది. పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.1500 చొప్పున 12 నెలలపాటు ఇస్తారు. స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు ప్రతి సంవత్సరం దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఏడాది ఉపకార వేతనానికి ఎంపికైతే ఏటా అదే కొనసాగదు. ఇతర ఉపకార వేతనాలను పొందుతున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని