ఉపకారం.. నెలకు 7 వేల దాకా!

మిగతావారితో పోలిస్తే దళిత, గిరిజన వర్గాల విద్యార్థులు చదువులోనూ వెనకబడే ఉంటున్నారు. వారిని ఉన్నతవిద్య దిశగా ప్రోత్సహించటానికి ప్రవేశపెట్టినవే ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌లు’. దీనికింద 1000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం అందిస్తారు.

Published : 05 Nov 2019 01:31 IST

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వృత్తివిద్యలో పీజీ స్కాలర్‌షిప్పులు

మిగతావారితో పోలిస్తే దళిత, గిరిజన వర్గాల విద్యార్థులు చదువులోనూ వెనకబడే ఉంటున్నారు. వారిని ఉన్నతవిద్య దిశగా ప్రోత్సహించటానికి ప్రవేశపెట్టినవే ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌లు’. దీనికింద 1000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం అందిస్తారు. ఎంపికైనవారికి చదివే కోర్సును బట్టి నెలకు రూ.4,500 నుంచి రూ.7,800 చెల్లిస్తారు. దీని ప్రకటన త్వరలో వెలువడనుంది!

యూజీసీ గుర్తింపుపొందిన యూనివర్సిటీలు/ విద్యాసంస్థలు/ కళాశాలల్లో వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న విశ్వవిద్యాలయాలు/ విద్యాసంస్థలు/ కాలేజీల విద్యార్థులూ  దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ), డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ), ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ), రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌సీఐ), ఎన్‌సీటీఐఎస్‌, ఎన్‌సీటీఇ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ), ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌), ఐఎన్‌సీ, ఫోరెన్సిక్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాల గుర్తింపు పొందిన కోర్సులను ప్రొఫెషనల్‌ కోర్సులుగా పరిగణిస్తారు. ఎం.ఎ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.ఎస్‌.డబ్ల్యు., మాస్‌ కమ్యూనికేషన్‌, జర్నలిజం డిగ్రీలన్నీ నాన్‌-ప్రొఫెషనల్‌ కోర్సుల కిందకే వస్తాయి. కరస్పాండెన్స్‌ లేదా దూరవిద్యా విధానంలో వృత్తివిద్యా కోర్సులు చదువుతున్నవారు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి అర్హులు కారు.

కాలపరిమితి: కోర్సు కాలవ్యవధిని బట్టి ఉపకార వేతనం రెండు లేదా మూడు సంవత్సరాలు ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరు. ఎం.ఇ./ ఎం.టెక్‌ పీజీ స్కాలర్‌షిప్‌ కింద ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,800 చెల్లిస్తారు. ఇతర కోర్సులకు నెలకు రూ.4,500 చెల్లిస్తారు. పీజీ మొదటి సంవత్సరంలో చేరిన తేదీ నుంచి స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు. స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని అభ్యర్థి బ్యాంక్‌ అకౌంట్‌లో నేరుగా జమచేస్తారు.

కొనసాగింపు: మొదటి సంవత్సరం ఉపకార వేతనం పొందినప్పటికీ రెండో ఏడాది విద్యార్థి దాన్ని రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరంలో విద్యార్థి చూపిన ప్రతిభ, హాజరు ఆధారంగా రెండో సంవత్సరంలో స్కాలర్‌షిప్‌ను కొనసాగిస్తారు. మొదటి ఏడాది ఫెయిలైతే స్కాలర్‌షిప్‌ను నిలిపివేస్తారు. రెండో సంవత్సరంలో కోర్సును మార్చుకోవడానికి అనుమతించరు. మొదటి సంవత్సరం చదివిన కోర్సునే రెండో ఏడాదీ కొనసాగించాలి. ఈ పథకం మొత్తం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నియంత్రణలోనే ఉంటుంది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సరంలో 60 శాతం మార్కులు పొందకపోతే స్కాలర్‌షిప్‌ రద్దవుతుంది. వ్యక్తిగత కారణాల వల్ల కోర్సును కొనసాగించకపోయినా స్కాలర్‌షిప్‌ రద్దవుతుంది. దరఖాస్తులో చూపిన సమాచారంలోగానీ, బ్యాంకు వివరాల్లోగానీ తప్పులు ఉంటే స్కాలర్‌షిప్‌ను రద్దుచేస్తారు.

దరఖాస్తు విధానం

న్‌లైన్‌లో ‘నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌’లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి ఆన్‌లైన్‌ దరఖాస్తు వివరాలను అతడు ప్రస్తుతం చదువుతోన్న విశ్వవిద్యాలయం పరిశీలించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆధార్‌ను తప్పనిసరిగా జతచేయాలి. మానవ వనరుల అభివృద్ధి శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ సబ్సిడీలు/ స్కాలర్‌షిప్‌లు/ ఫెలోషిప్‌లు పొందడానికి ఆధార్‌ అనుసంధాన్ని తప్పనిసరిచేస్తూ యూనియన్‌ గ్రాంట్స్‌ కమిషన్‌కు ఆదేశాలు జారీచేసింది. సంబంధిత విశ్వవిద్యాలయం ద్వారా ఆధార్‌ వివరాలను విద్యార్థి తప్పనిసరిగా అందజేయాలి.

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/ లోని UGC Schemes  విభాగంలో చూడండి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని