ఉన్నతవిద్యకు ఎల్‌ఐసీ ఉపకారం!

ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎల్‌ఐసీ పలు రకాల ఉపకారవేతనాలను అందిస్తోంది.  ప్రస్తుతం గోల్డెన్‌ జూబ్లీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ స్కాలర్‌షిప్‌లకు ప్రకటనలు వెలువడ్డాయి. ఎనిమిదో తరగతి మొదలు పీహెచ్‌డీ వరకు వీటిని పొందవచ్చు.

Published : 24 Dec 2019 02:00 IST

ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎల్‌ఐసీ పలు రకాల ఉపకారవేతనాలను అందిస్తోంది.  ప్రస్తుతం గోల్డెన్‌ జూబ్లీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ స్కాలర్‌షిప్‌లకు ప్రకటనలు వెలువడ్డాయి. ఎనిమిదో తరగతి మొదలు పీహెచ్‌డీ వరకు వీటిని పొందవచ్చు. వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

జీవిత బీమా సంస్థకు చెందిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌) కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా నాలుగు కేటగిరీల్లో స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.
ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు:  గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఎనిమిది, తొమ్మిది లేదా పదో తరగతిలో చేరిన విద్యార్థులు అర్హులు. ముందు ఏడాది చదివిన తరగతిలో  65 శాతం మార్కులు పొంది ఉండాలి. ఈ స్కాలర్‌షిప్‌ కింద ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందుతుంది.
ఇంటర్మీడియట్‌: గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ మొదటి లేదా రెండో సంవత్సరం లేదా ఐటీఐ/ డిప్లొమా/ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరినవారు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. పదో తరగతిలో 65 శాతం మార్కులు ఉండాలి. ఏడాదికి రూ.15 వేల ఉపకార వేతనం పొందవచ్చు.
డిగ్రీ అభ్యర్థులు: గుర్తింపు పొందిన కాలేజీలు/ యూనివర్సిటీలు/ విద్యా సంస్థల్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నవారు ఈ కేటగిరీకి అర్హులు. ఇంటర్మీడియట్‌ 65 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఏటా రూ.20 వేల స్కాలర్‌షిప్‌ ఇస్తారు. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నవారు అనర్హులు.
పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌: గుర్తింపుపొందిన కాలేజీలు/ యూనివర్సిటీలు/ విద్యాసంస్థల్లో పీజీలో ప్రవేశం పొందిన విద్యార్థులు అర్హులు.  డిగ్రీలో 65 శాతం మార్కులు పొందివుండాలి.   ఏటా రూ.30 వేల ఉపకార వేతనం పొందవచ్చు.పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తుకు అర్హులు కాదు. అన్ని కేటగిరీల్లో అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలకు మించకూడదు. అల్పాదాయ వర్గాలు, అనాథలు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యాల బారినపడిన వారికి, సింగిల్‌ పేరెంట్‌ పిల్లలకూ, సంవత్సరకాలంగా ఆదాయంలేని తల్లిదండ్రుల పిల్లలకూ ప్రాధాన్యమిస్తారు.

దరఖాస్తు, ఎంపిక విధానాలు
ఉపకారవేతనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ వెబ్‌సైట్‌లో సంబంధిత లింక్‌లు ఉన్నాయి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. దీనికి ‌్ర్ర్ర.్జ్య్ట్ట్వ4(్మ్య్ట్వ.‘్న్ఝ ను గేట్‌వేగా ఉపయోగిస్తున్నారు.  అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది. ప్రతిభ, ఆర్థిక అవసరాల ఆధారంగా అభ్యర్థులను మొదటి దశలో ఎంపికచేస్తారు. వారికి టెలిఫోన్‌ ఇంటర్వ్యూ జరుగుతుంది.అందులోనూ అర్హత పొందితే అవసరాన్ని బట్టి ప్రత్యక్ష ముఖాముఖి నిర్వహించి తుదిఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబరు 31, 2019.
వెబ్‌సైట్‌:www.lichousing.com


బంగారంలాంటి అవకాశం

ర్థిక సమస్యలతో హైస్కూలు, జూనియర్‌ కళాశాల, డిగ్రీ స్థాయుల్లోనే చాలామంది విద్యాభ్యాసం ఆగిపోతోంది. కొంత ఆర్థిక సాయం అందితే వీరు డిగ్రీ, డిప్లొమా, వృత్తివిద్యాకోర్సుల్లో కొనసాగుతారు. అలాంటి వారికి ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌లు ఆసరా అందిస్తున్నాయి.

ఎవరు అర్హులు?
2018-19 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షను 60 శాతం మార్కులతో పాసైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ను పొందడానికి అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం ఏడాదికి లక్ష రూపాయలకు మించకూడదు. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, ఏదైనా డిగ్రీ, డిప్లొమా తత్సమాన కోర్సులు, వొకేషనల్‌ కోర్సులు చదవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ కాలేజీ/ విద్యాసంస్థలు లేదా ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్ల (ఐటీఐ)లో చదివే విద్యార్థులూ వీటిని పొందడానికి అర్హులు.
* 2018-19 విద్యా సంవత్సరంలో పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులూ ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్‌లో 60 శాతం మార్కులను పొంది ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీలు/ విద్యాసంస్థలు లేదా ఐటీఐల్లో వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న అభ్యర్థులూ అప్లై చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల వార్షికాదాయం లక్ష రూపాయలు మించకూడదు. ఎంపికైన వారికి ఏడాదికి ఇరవైవేల రూపాయల చొప్పున అందిస్తారు. మూడు వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.

ఎంపిక విధానం
గత విద్యా సంవత్సరంలో చూపిన ప్రతిభ, కుటుంబ సభ్యుల ఆదాయం ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రొఫెషనల్‌ కోర్సుల్లో 55 శాతం మార్కులు, ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌ లేదా తత్సమాన కోర్సుల్లో 50 శాతం మార్కులు పొందినవారికి ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం ఉంటుంది. రెగ్యులర్‌గా స్కూలు/కాలేజీ/యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు మాత్రమే స్కాలర్‌షిప్‌ పొందడానికి అర్హులు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.


బాలికల కోసం..

బాలికలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. పదో తరగతి 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడులో పాసైన విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018-19 విద్యా సంవత్సరంలో పదో తరగతి పాసై ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం లక్ష రూపాయలు మించకూడదు. 10+2 లేదా తత్సమాన కోర్సులో చేరాలనే ఆసక్తి ఉన్న విద్యార్థినులు మాత్రమే ఈ ఉపకార వేతనానికి దరఖాస్తు చేయాలి. కాలపరిమితి రెండేళ్లు. ఏడాదికి పదివేల రూపాయల ఉపకార వేతనాన్ని అందిస్తారు. మూడు వాయిదాల్లో ఈ మొత్తాన్ని అభ్యర్థుల బ్యాంక్‌ అకౌంట్‌కు నేరుగా చెల్లిస్తారు.

వెబ్‌సైట్‌: https://www.licindia.in/ Golden-Jubilee-Foundation
చివరి తేదీ: డిసెంబరు 24, 2019.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని