దివ్యమైన ఆసరా!

శారీరక లోపాలతోపాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును, ఉద్యోగ ప్రయత్నాలను మధ్యలో వదిలేయకుండా చూసేందుకు ప్రభుత్వం దివ్యాంగులకు ఉపకారవేతనాలను అందిస్తోంది.

Updated : 24 Jul 2019 01:43 IST

 

శారీరక లోపాలతోపాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును, ఉద్యోగ ప్రయత్నాలను మధ్యలో వదిలేయకుండా చూసేందుకు ప్రభుత్వం దివ్యాంగులకు ఉపకారవేతనాలను అందిస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు విద్యార్థులు, ఇతర దేశాల్లో చదువుకునే వారు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ సాయాన్ని పొందవచ్చు.
న దేశంలో సుమారు 2.68 కోట్ల మంది దివ్యాంగులున్నారని ఒక అంచనా. శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి దృఢంగా జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్‌లను వీరికి అందిస్తోంది. మొత్తం ఉపకారవేతనాల సంఖ్య 39,520. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ నిధులను సమకూరుస్తుంది.

అర్హతలేమిటి?
* రైట్స్‌ ఆఫ్‌ డిజెబిలిటీస్‌ యాక్ట్‌ 2016 ప్రకారం 40 శాతం అంగవైకల్యం ఉన్న విద్యార్థులు అర్హులు.

* తల్లిదండ్రులకు ఇద్దరికంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న పిల్లలు ఉంటే వారికి వర్తించవు. కానీ రెండోసారి కవలలు పుట్టి, వారికి అంగవైకల్యం ఉంటే ఇద్దరూ అర్హులే.

* స్కాలర్‌షిప్‌ పొందే విద్యార్థులు ఆ ఏడాది తరగతిలో ఉత్తీర్ణులు కాకపోతే తర్వాతి ఏడాది స్కాలర్‌షిప్‌ ఇవ్వరు.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవైనా ఇతర ఉపకార వేతనాలు పొందే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లు పొందడానికి అనర్హులు.

* కుటుంబ వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పరిమితి స్కాలర్‌షిప్‌ను బట్టి మారుతుంది.

* ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌-మెట్రిక్‌, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌లకు రాష్ట్రాలవారీ స్లాట్‌ ఉంటుంది. దాని బట్టే ఉపకారవేతనాలకు ఎంపిక ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ-మెట్రిక్‌- 910, పోస్ట్‌-మెట్రిక్‌- 773, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌- 14 స్లాట్స్‌ ఉన్నాయి.
తెలంగాణలో ప్రీ-మెట్రిక్‌- 781, పోస్ట్‌-మెట్రిక్‌- 664, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌- 12 స్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి. దివ్యాంగ విద్యార్థినులకు వీటిలో 50 శాతం స్కాలర్‌షిప్‌లను కేటాయించారు. నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లో 30 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఒకవేళ విద్యార్థినులకు ఇచ్చే రిజర్వేషన్‌కు తగ్గ దరఖాస్తులు రాకపోతే వాటిని అర్హత ఉన్న పురుష విద్యార్థులకు కల్పిస్తారు.

ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌
డే స్కాలర్స్‌కు రూ.500, హాస్టల్‌లో ఉండేవారికి రూ.800 చొప్పున నెలకు ఇస్తారు. వీటితోపాటు బెక్‌గ్రాంట్‌ కింది ఏడాదికి రూ.1000, డిజెబిలిటీ అలవెన్స్‌, నిర్వహణ ఖర్చుల కోసం రూ. 2000 నుంచి 4000 వరకు ప్రోత్సాహకంగా అందిస్తారు. విద్యార్థి అకడమిక్‌ ప్రతిభ, వయసు ఆధారంగా ఎంపిక ఉంటుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలకు మించకూడదు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎవరు అర్హులు: తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 20000
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబరు 15

పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌
మొత్తం విద్యార్థులను నాలుగు గ్రూపులుగా చేశారు.
* గ్రూప్‌-1లో మెడిసిన్‌, ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ, ప్లానింగ్‌/ ఆర్కిటెక్చర్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌/ ఫైనాన్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులకు డేస్కాలర్స్‌ అయితే రూ. 750, హాస్టలర్స్‌కు రూ. 1600 చొప్పున నెలకు అందిస్తారు.
* గ్రూప్‌-2లో డిగ్రీ/ డిప్లొమా, ఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ, ఇతర పారామెడికల్‌ బ్రాంచిలు తదితరాల్లో చదువుతున్న డేస్కాలర్స్‌కు నెలకు రూ. 700, హాస్టలర్స్‌కు రూ. 1100 ఇస్తారు.‌్ర గ్రూప్‌-3లో బీఏ/ బీఎస్సీ/ బీకాం విద్యార్థులకు డేస్కాలర్స్‌కు నెలకు రూ. 650, హాస్టలర్స్‌కు రూ. 950 చొప్పున అందిస్తారు. ‌
* గ్రూప్‌-4లో ఐటీఐ కోర్సులు/ పాలిటెక్నిక్‌ చదివే విద్యార్థులకు డేస్కాలర్స్‌కు నెలకు రూ. 550, హాస్టలర్స్‌కు రూ. 900 చొప్పున అందిస్తారు.
వీటితోపాటు బుక్‌ అలవెన్స్‌ కింద సంవత్సరానికి రూ. 1500, డిజెబిలిటీ అలవెన్స్‌, నిర్వహణ ఖర్చుల కోసం ఏడాదికి రూ. 2000 నుంచి రూ. 4000 వరకు అందిస్తారు. విద్యార్థి అకడమిక్‌ ప్రతిభ, వయసు ఆధారంగా ఎంపిక ఉంటుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలకు మించకూడదు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎవరు అర్హులు: ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్థులు  స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 17000
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబరు 31
వెబ్‌సైట్‌: scholarships.gov.in
(యూనివర్సిటీల్లో ఎంఫిల్‌/ పీహెచ్‌డీ చేస్తున్న అభ్యర్థులకు ఇచ్చే నేషనల్‌ ఫెలోషిప్‌; విదేశీ యూనివర్సిటీల్లో మాస్టర్స్‌/ పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులకు అందించే నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌;  పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న వారికి ఇచ్చే ఉచిత శిక్షణ-ఉపకారవేతనం, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ వివరాలు www.eenadupratibha.net


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని