ఇంటర్‌ టు పీహెచ్‌డీ ఉపకారం!

ఉపకార వేతనాలకు సంబంధించి జాతీయస్థాయిలో  ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పరీక్షల్లో ఎన్‌టీఎస్‌ఈ  మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే ఇంటర్‌ నుంచి పీహెచ్‌డీ వరకు ఆర్థిక సాయాన్ని అందుకోవచ్చు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఇదో చక్కటి అవకాశం.

Updated : 07 Aug 2019 01:17 IST

ఉపకార వేతనాలకు సంబంధించి జాతీయస్థాయిలో  ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పరీక్షల్లో ఎన్‌టీఎస్‌ఈ  మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే ఇంటర్‌ నుంచి పీహెచ్‌డీ వరకు ఆర్థిక సాయాన్ని అందుకోవచ్చు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఇదో చక్కటి అవకాశం.

ప్రతిభావంతులను ప్రోత్సహించి ఆర్థిక సాయాన్ని అందించడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రధానమైనది నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌ (ఎన్‌టీఎస్‌ఈ).  ఈ పరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్‌ నుంచి పీజీ వరకు ఉపకారవేతనం అందుతుంది. దేశవ్యాప్తంగా రెండు వేల మంది వీటిని దక్కించుకోవచ్చు. ఇందుకోసం రెండు దశల్లో నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలి. స్టేజ్‌ -1 రాష్ట్ర స్థాయి పరీక్ష. విద్యార్థులు తాము పదో తరగతి చదువుతున్న రాష్ట్రంలో పరీక్షకు హాజరు కావచ్చు. ఈ దశలో అర్హత సాధించినవారికి స్టేజ్‌ -2 (జాతీయ స్థాయి) పరీక్ష నిర్వహిస్తారు.

మొదటి దశ రాష్ట్రస్థాయిలో
రాష్ట్రస్థాయిలో జరిగే స్టేజ్‌ -1 స్టేట్‌ లెవెల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ పూర్తి ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్ష. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు పేపర్‌-1లో మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌- వంద ప్రశ్నలు, స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 100 (ఫిజిక్స్‌ 13, కెమిస్ట్రీ 13, బయాలజీ 14, మ్యాథ్స్‌ 20, హిస్టరీ 12, జాగ్రఫీ 12, పొలిటికల్‌ సైన్స్‌ 8, ఎకనామిక్స్‌ 8) ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి రెండు గంటలు.
అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులైతే ప్రతి పేపర్లోనూ 40 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలైతే 32 శాతం మార్కులు పొందాలి. అర్హుల జాబితా నుంచి మెరిట్‌ లిస్ట్‌ తయారుచేస్తారు. స్టేజ్‌-1 ఫలితాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగాలు వెల్లడిస్తాయి. ఎంపికైనవారికి దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు వివరాలు పంపుతారు.

స్టేజ్‌-1 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు స్టేజ్‌-2 (ఎన్‌టీఎస్‌ఈ) రాసే అవకాశం లభిస్తుంది. స్టేజ్‌ -2 ప్రశ్నపత్రం కూడా స్టేజ్‌ -1 మాదిరిగానే ఉంటుంది. ప్రశ్నల స్థాయి పెరుగుతుంది. ప్రశ్నపత్రాన్ని ఎన్‌సీఈఆర్‌టీ రూపొందిస్తుంది. రుణాత్మక మార్కులు ఉండవు. పేపర్లవారీ కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.

ఎంపికైతే...
అర్హుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన రెండు వేల మందిని స్కాలర్‌షిప్‌కి ఎంపిక చేస్తారు. మొత్తం ఉపకారవేతనాల్లో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 4 శాతం దివ్యాంగులు, 27 శాతం ఓబీసీలకు మంజూరు చేస్తారు. 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తారు. ఎంపికైనవారికి ఇంటర్‌లో ఉన్నప్పుడు నెలకు  రూ.1250 చొప్పున చెల్లిస్తారు. డిగ్రీ, పీజీ కోర్సులు చదువుతున్నప్పుడు నెలకు రూ.2000 చొప్పున అందుతుంది. పీహెచ్‌డీలో చేరినవారికి యూజీసీ నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్‌ ఉంటుంది.

సిలబస్‌

మెంటల్‌ ఎబిలిటీలో విద్యార్థుల రీజనింగ్‌ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఎనాలజీస్‌, క్లాసిఫికేషన్‌, సిరీస్‌, కోడింగ్‌- డీ కోడింగ్‌,  ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో పదో తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.
అర్హత: ఏపీ/ తెలంగాణలో గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలకు చెందిన పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులూ అర్హులే.
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:  తెలంగాణలో ఆగస్టు 28, ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబరు 7, 2019.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేది: తెలంగాణలో ఆగస్టు 29, ఏపీలో సెప్టెంబరు 5, 2019.
స్టేజ్‌-1 పరీక్ష తేదీ: 03.11.2019 (పేపర్‌ -1 ఉదయం, పేపర్‌ -2 మధ్యాహ్నం ఉంటాయి)
స్టేజ్‌-2 పరీక్ష తేదీ:  మే 10, 2020
వెబ్‌సైట్లు: http://bse.telangana.gov.in, http://main.bseap.org/NTSE.aspx

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని