పాలిటెక్నిక్‌ విద్యార్థులకు మహీంద్రా సాయం

ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు మహీంద్రా సంస్థ సాయం అందిస్తోంది. ఏటా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలను మంజూరు చేస్తోంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా చదువుతున్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ప్రకటన ఇప్పటికే విడుదలైంది....

Published : 14 Aug 2019 01:29 IST

ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు మహీంద్రా సంస్థ సాయం అందిస్తోంది. ఏటా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలను మంజూరు చేస్తోంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా చదువుతున్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ప్రకటన ఇప్పటికే విడుదలైంది.

ప్రతిభ ఉండీ, పేదరికం కారణంగా ఉన్నత చదువులకు దూరం అవుతున్న విద్యార్థులు ఎందరో. అలాంటి వారికి సాయం అందించాలనే ఉద్దేశంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ సంస్థ ‘ఆల్‌ ఇండియా టాలెంట్‌ స్కాలర్‌షిప్‌’ పేరుతో ఉపకారవేతలనాలను అందిస్తోంది.  దేశవ్యాప్తంగా దీనిని నిర్వహిస్తున్నారు. దేశంలో అందరూ చదువుకోవాలనీ, డబ్బులేని కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదనేది సంస్థ ఉద్దేశం. సంస్థకు చెందిన ‘కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌’ ఏటా వీటిని అందిస్తోంది. ఉత్తీర్ణులైనవారికి ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్ధతిలో డబ్బులు నేరుగా అభ్యర్థి ఖాతాలో జమ అవుతాయి.

ఎవరు అర్హులు?
పదోతరగతి/ఇంటర్మీడియట్‌లో 60శాతం కన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 2019 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం కోర్సులో ప్రవేశం పొంది, చదువుతుండాలి. విద్యార్థినులకు, తక్కువ వార్షిక ఆదాయం ఉన్న అభ్యర్థులు, దివ్యాంగులు, సైనిక దళాల్లో పనిచేసేవారి పిల్లలకు ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.
స్కాలర్‌షిప్‌ వివరాలు
పాలిటెక్నిక్‌ డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ.10000 చొప్పున అందిస్తారు. గరిష్ఠంగా మూడేళ్ల వరకు వీరు ఈ ప్రోత్సాహాన్ని పొందుతారు. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. వెబ్‌సైట్‌ నుంచి ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని నింపిన తర్వాత పోస్టులో పంపాలి. దరఖాస్తు ఫీజు లేదు. దేశవ్యాప్తంగా మొత్తం 550 మందికి స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు.

ఎంపిక విధానం
మొదటిదశలో అభ్యర్థుల కుటుంబ నేపథ్యం, మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
దేశవ్యాప్తంగా మొత్తం 12 కేంద్రాల్లో దీనిని నిర్వహిస్తారు. వీటిలో ఎక్కడైనా విద్యార్థులు హాజరుకావొచ్చు. ఇందుకోసం ప్రయాణ ఖర్చులు సైతం చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు
* దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22.08.2019
*చిరునామా: ద కోఆర్డినేటర్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌, మహీంద్రా హౌస్‌, ఆటోసెక్టార్‌, టి.ఎస్‌.రెడ్డి కాంప్లెక్స్‌, 1-7-1, పార్క్‌లేన్‌, ఎస్‌.డి.రోడ్‌, సికింద్రాబాద్‌-500003.
ఫోన్‌: 022-22897848
వెబ్‌సైట‌: https://www.kcmet.org/whatwe-do-scholarship-grants.aspx


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు