ప్రతిభావంతులకు చేయూత!

ఇంటర్మీడియట్‌ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుని, డిగ్రీ/ వృత్తివిద్యాకోర్సుల్లో చేరినవారు కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌లను పొందే అవకాశం వచ్చింది! తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండి, ఇతర స్కాలర్‌షిప్‌లు ...

Published : 03 Nov 2018 11:26 IST

ప్రతిభావంతులకు చేయూత!

ఇంటర్మీడియట్‌ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుని, డిగ్రీ/ వృత్తివిద్యాకోర్సుల్లో చేరినవారు కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌లను పొందే అవకాశం వచ్చింది! తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండి, ఇతర స్కాలర్‌షిప్‌లు పొందనివారు అర్హులు. ఎంపికైనవారికి కోర్సు పూర్తయ్యేవరకూ ఈ ఉపకారవేతనాలు లభిస్తాయి. అక్టోబరు 31లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు!

 

ప్రతిభావంతులకు చేయూత!

డిగ్రీ, వృత్తివిద్యాకోర్సులు చదువుతున్న విద్యార్థులకు ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఆఫ్‌ స్కాలర్‌షిప్స్‌’ కింద భారతప్రభుత్వం ఉపకార వేతనాలు అందజేయబోతోంది. మొత్తం 82,000 స్కాలర్‌షిప్‌ను బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఏజీబీఎస్సీ లేదా మరేదైనా డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ప్రతిభావంతుల కోసం ఉన్నతవిద్యావిభాగం కేటాయించింది. సీనియర్‌ సెకెండరీ/ఇంటర్మీడియట్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా వీటిని అందిస్తారు. 
ప్రస్తుతం ఏదైనా యూజీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 82,000 స్కాలర్‌షిప్‌ల్లో 41,000 అమ్మాయిలకు, 41,000 అబ్బాయిలకు కేటాయించారు. ప్రతిభావంతుల అవసరాలను తీర్చే లక్ష్యంతో వీటిని ఏర్పాటుచేశారు. 
యూజీ నుంచి పీజీ వరకు అయిదేళ్లపాటు ఈ ఉపకారవేతనాలు అందుతాయి. బీటెక్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్నవారికి నాలుగేళ్ల వరకు చెల్లిస్తారు. సాధారణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్‌ పీజీలు చదువుతున్నవారికి ఏడాదికి రూ.10,000 చొప్పున మొదటి మూడేళ్లు చెల్లిస్తారు. పీజీలో చేరినప్పుడు ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు అందిస్తారు. 
అర్హత: ఇంటర్‌ లేదా ప్లస్‌ 2 లో 80 పర్సంటైల్‌ కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. రెగ్యులర్‌ విధానంలో చదివినవారే అర్హులు. డిప్లొమా విద్యార్థులకు అవకాశం లేదు. అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఇతర ఏ స్కాలర్‌షిప్పులనూ పొందనివారే దీనికి అర్హులు. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ వర్తించినవారు ఈ స్కాలర్‌షిప్‌కి అనర్హులు. ఎంపికైనవారు తర్వాత ఏడాదిలోనూ పొందడానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీస హాజరు ఉండాలి. నిర్దేశిత మార్కుల శాతం తప్పనిసరి. 
రాష్ట్రాలవారీగా... 
ప్రతిభావంతులకు చేయూత!ఆయా రాష్ట్రాల్లో ఉన్న 18-25 ఏళ్ల వయసు జనాభా ఆధారంగా రాష్ట్రాలవారీ స్కాలర్‌షిప్‌లను కేటాయిస్తారు. రాష్ట్రాల వారీ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. సీబీఎస్‌ఈ ద్వారా ప్లస్‌ 2 చదివినవారికి 5413, ఐసీఎస్‌ ఈ విద్యార్థులకు 577 స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ద్వారా చదువుకున్న విద్యార్థులకు 3527, తెలంగాణ ఇంటర్‌ బోర్డు విద్యార్థులకు 2570 స్కాలర్‌షిప్‌లు కేటాయించారు. కేటాయించిన స్కాలర్‌షిప్‌ల్లో సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ విద్యార్థులను 3:2:1 విధానంలో ఎంపిక చేస్తారు. 
రిజర్వేషన్‌: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 5 శాతం స్కాలర్‌షిప్‌లు కేటాయించారు. 
దరఖాస్తు చేయదల్చినవారు https://scholarships.gov.in/లో డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌పై క్లిక్‌ చేసి వివరాలు నమోదుచేసుకోవాలి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని