అదనపు కోర్సులు చేయాలా?

డిప్లొమా, బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. నాకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలేంటి? ఇంకా ఏవైనా అదనపు కోర్సులు చేస్తే మేలా?

Published : 17 Feb 2020 00:57 IST

* డిప్లొమా, బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. నాకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలేంటి? ఇంకా ఏవైనా అదనపు కోర్సులు చేస్తే మేలా?
- పార్థసారథి
డిప్లొమా చేసి ఇంజినీరింగ్‌ పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. డిప్లొమా అర్హతతో మీరు రైల్వే శాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌, లోకో పైలెట్‌ లాంటి ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన భారీ పరిశ్రమల్లో  కూడా టెక్నీషియన్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ అర్హతతో గేట్‌ స్కోరు ద్వారా ప్రభుత్వరంగ సంస్థల్లో టెక్నికల్‌ ట్రైనీ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకొని, ఆఫీసర్‌ క్యాడర్‌ ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.
ఒకవేళ మీకు టెక్నికల్‌ వైపు వెళ్లాలని లేకపోతే, ఇంజినీరింగ్‌ అర్హతతో బ్యాంకు పోస్టులకూ, ఇతర ప్రభుత్వశాఖల పోస్టులకూ ప్రకటనలు పడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ప్రైవేటు రంగ ఉద్యోగాల విషయానికి వస్తే- మెలకువలు, సృజనాత్మకత ఉన్న ఇంజినీర్లు ఎప్పుడూ డిమాండ్‌లోనే ఉంటారు. ఇప్పుడు మనదేశంలో పెద్ద ప్రైవేటు కంపెనీలతో పాటు ఎన్నో స్టార్ట్‌ అప్‌లు ప్రారంభమయ్యాయి. అందుకని ప్రైవేటు రంగంలో ఇంజినీర్‌లకు ఎప్పుడూ గిరాకీనే. ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ కోర్సులను  నేర్చుకొని సాఫ్టువేర్‌ రంగంలోకి కూడా వెళ్లొచ్చు. డేటా అనలిటిక్స్‌ లాంటి కోర్సులను కూడా చదివి ఆ రంగంలో కూడా ప్రయత్నించవచ్చు. ఇంకా చదువులను కొనసాగించాలని ఉంటే, టెక్నికల్‌ రంగంలో అయితే ఎం.టెక్‌ లేదా ఎంసీఏ ఎంచుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించిన విషయాలపై అవగాహన తెచ్చుకొని మేనేజ్మెంట్‌ నైపుణ్యాలూ పెంపొందించుకోవాలని అనుకునేవారు ఎంబీఏను ఎంచుకోవచ్చు.      

- ప్రొ. బి.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని