శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?

భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పరిపాలనా నియంత్రణ కింద ఉండేవే కేంద్రపాలిత ప్రాంతాలు. వీటి పాలకులు ఎవరు, ఎందుకు ఏర్పాటు చేశారు, ప్రాంతాల న్యాయపాలన ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది లాంటి అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

Published : 06 Mar 2020 00:05 IST

భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పరిపాలనా నియంత్రణ కింద ఉండేవే కేంద్రపాలిత ప్రాంతాలు. వీటి పాలకులు ఎవరు, ఎందుకు ఏర్పాటు చేశారు, ప్రాంతాల న్యాయపాలన ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది లాంటి అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

కేంద్రపాలిత ప్రాంతాలు

బ్రిటిష్‌ వారి పాలనాకాలంలో కొన్ని ప్రాంతాలను షెడ్యూల్డ్‌ జిల్లాలుగా ఏర్పరిచారు. వీటిని తర్వాతి కాలంలో ‘చీఫ్‌ కమిషనర్‌ ప్రావిన్సెస్‌’గా పిలిచారు. 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శాసన నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్‌ రూపకల్పన, పరిపాలకుల నియామకాలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోడల్‌ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తుంది.
కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు కారణాలు
* రాజకీయ, పరిపాలన పరమైనవి
* సాంస్కృతిక వైవిధ్యం   

* వ్యూహాత్మక ప్రాధాన్యం
*వెనుకబడిన, గిరిజన ప్రజలపై ప్రత్యేక శ్రద్ధ


జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ల ఏర్పాటు

దేశచరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇంతవరకు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్‌ భౌగోళిక పటం రూపురేఖలు మారిపోయాయి. 2019 అక్టోబరు 31 నుంచి జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ - 370ను రద్దు చేసి దేశచరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. జమ్ముకశ్మీర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్‌చంద్ర ముర్ము, లద్దాఖ్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆర్‌కే మాథుర్‌ నియమితులయ్యారు. జమ్ముకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని (అక్టోబరు 31) ‘అపాయింటెంర్‌ డే’ గా కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం జమ్ముకశ్మీర్‌కు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి తరహాలో శాసనసభను ఏర్పాటు చేస్తారు. లద్దాఖ్‌కు శాసనసభ ఉండదు.


పుదుచ్చేరి, దిల్లీ శాసనసభలు

పుదుచ్చేరి: 1963లో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి 30 మంది శాసనసభ్యులతో కూడిన శాసనసభను ఏర్పాటుచేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పరిపాలనలో సహకరిస్తుంది. శాసనసభ సమావేశాలు అందుబాటులో లేనప్పుడు ప్రజాశేయస్సు కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆర్డినెన్స్‌ను జారీ చేయగలరు. ఈ ఆర్డినెన్స్‌ను శాసనసభ సమావేశమైన 6 నెలల 6 వారాల్లో ఆమోదిస్తే, అది చట్టంగా మారుతుంది.
దిల్లీ: 69వ రాజ్యాంగ సవరణ చట్టం - 1991 ద్వారా దిల్లీకి 70 మంది శాసనసభ్యులతో కూడిన శాసనసభను ఏర్పాటుచేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పరిపాలనలో సహకరిస్తుంది. 1992లో ‘దిల్లీ జాతీయ రాజధాని భూభాగం’గా National Capital Territory of Delhi) చేశారు.
దిల్లీ శాసనసభ శాంతిభద్రతలు, పోలీసు, భూమికి సంబంధించిన అంశాలు మినహా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన, ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలు చేయవచ్చు. పుదుచ్చేరి, దిల్లీ శాసనసభలు రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించినప్పటికీ పార్లమెంటు శాసనాల ఆధిక్యత కొనసాగుతుంది.


శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల పాలన

శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌ దీవులు, చండీగఢ్‌, దాద్రానగర్‌ హవేలీ అండ్‌ డామన్‌ డయ్యూ, లక్షద్వీప్‌, లద్దాఖ లాంటి వాటి పాలనకు ‘కేంద్ర హోం మంత్రిత్వ సలహా కమిటీ’ బాధ్యత వహిస్తుంది. ఈ కమిటీలో కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన పాలకుడు, పార్లమెంటు సభ్యుడితో పాటు జిల్లా పంచాయతీ, నగరపాలక మండలి లాంటి ప్రాంతీయ సంస్థలకు ఎన్నికైన సభ్యులు నామినేట్‌ అవుతారు. ఈ సలహా కమిటీకి కేంద్ర హోంమంత్రి అధ్యక్షత వహిస్తారు.


కేంద్రపాలిత ప్రాంతాల పాలన - విశిష్టత

ఇవి కేంద్ర ప్రభుత్వ నియంత్రణ, పరిపాలన కింద కొనసాగుతాయి. వీటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. వీటికి కేంద్రంతో ఏక కేంద్రపరమైన సంబంధం ఉంటుంది. పరిపాలనలో వివిధ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఏకరూపత లేదు. వీటి పరిపాలకులను అడ్మినిస్ట్రేటర్‌గా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పేర్కొంటారు. కేంద్రపాలిత ప్రాంతాల కోసం పార్లమెంటు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై శాసనాలు రూపొందించగలదు.


రాజ్యాంగ వివరణ

కేంద్రపాలిత ప్రాంతాల పాలన గురించి రాజ్యాంగంలోని జుఖిఖిఖివ భాగంలో ఆర్టికల్‌్ 239 నుంచి 242 మధ్య వివరించారు.
ఆర్టికల్‌ 239: కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన గురించి వివరిస్తుంది.
ఆర్టికల్‌ 239(A): కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభ లేదా మంత్రిమండలి లేదా రెండింటి ఏర్పాటు గురించి వివరిస్తుంది.
ఆర్టికల్‌ 239(A)(A): కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి ప్రత్యేక నియమ నిబంధనలను వివరిస్తుంది.
ఆర్టికల్‌ 239(A)(B): కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సందర్భంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలను తెలుపుతుంది.
ఆర్టికల్‌ 240: కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా నియమ నిబంధనలను రూపొందించడానికి రాష్ట్రపతికి గల అధికారాలను వివరిస్తుంది.
ఆర్టికల్‌ 241: కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టు ఏర్పాటు గురించి వివరిస్తుంది.
ఆర్టికల్‌ 242: కేంద్రపాలిత/చీఫ్‌ కమిషనర్‌ ప్రాంతమైన ‘కూర్గ్‌’ గురించి వివరిస్తుంది (దాన్ని తొలగించారు).


1. కేంద్రపాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో వివరించారు?
1) జుఖివ భాగం       2) జుఖిఖివ భాగం  
3) జుఖిఖిఖివ భాగం   4) ఖిశ్రీవ భాగం

2. వివిధ కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు సంబంధించిన సంవత్సరాల్లో సరికానిది?
1) అండమాన్‌ నికోబార్‌ దీవులు - 1956  
2) దిల్లీ - 1956     3) లక్షద్వీప్‌ - 1956  
4 )పుదుచ్చేరి - 1956
3. అండమాన్‌ నికోబార్‌ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి?
1) బాంబే హైకోర్టు   2) కలకత్తా హైకోర్టు  
3) కేరళ హైకోర్టు    4) మద్రాస్‌ హైకోర్టు
4. దిల్లీ శాసనసభ వేటికి సంబంధించిన అంశంపై శాసనాలు చేసేందుకు వీల్లేదు?
1) శాంతిభద్రతలు     2) పోలీసు  
3) భూమి           4) అన్నీ
5. 1966లో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పరిచారు?
1) చండీగఢ్‌      2) దిల్లీ  
3) పుదుచ్చేరి     4) లక్షద్వీప్‌
6. శాసనసభను కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?
1) దిల్లీ          2) పుదుచ్చేరి  
3) 1, 2       4) లక్షద్వీప్‌
7. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌ ఎప్పుడు ఏర్పడింది?
1) 1966     2) 1962    3) 1961    4) 1956
8. దిల్లీ శాసనసభలోని శాసనసభ్యుల (ఎంఎల్‌ఏ్శ సంఖ్య?
1) 30      2) 60     3) 70      4) 90
9. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏ హైకోర్టు పరిధిలో ఉంది?
1) బాంబే హైకోర్టు          2) కలకత్తా హైకోర్టు  
3) మద్రాస్‌ హైకోర్టు         4) కేరళ హైకోర్టు

సమాధానాలు: 1-3  2-4  3-2  4-4  5-2  6-3 7-1  8-3  9-3
* 1961లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైన దాద్రానగర్‌ హవేలీ, 1962లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన డామన్‌ డయ్యూలను కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2020 జనవరి 26న ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. దీని ముఖ్య కేంద్రం డామన్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని