డిప్లొమా తర్వాత కామర్స్‌?

డిప్లొమా (మెకానికల్‌) పూర్తిచేశాను. ఇప్పుడు బీకాం చదువుతున్నాను. డిప్లొమా తర్వాత ఎంచుకున్న డిగ్రీకి విలువ ఉంటుందా?

Published : 21 Apr 2020 01:08 IST

* డిప్లొమా (మెకానికల్‌) పూర్తిచేశాను. ఇప్పుడు బీకాం చదువుతున్నాను. డిప్లొమా తర్వాత ఎంచుకున్న డిగ్రీకి విలువ ఉంటుందా?

              - హేమంత్‌ కుమార్‌

*  మీరు ‘డిప్ల్లొమా మెకానికల్‌ చేసిన తర్వాత బీకాం చదివాను’ అని చెప్పారు. చదివిన డిప్లొమా, ఇప్పుడు చేస్తున్న డిగ్రీ వేర్వేరు రంగాల్లోనివి. ఈ రెండిటికీ ప్రత్యక్ష సంబంధం లేదు. డిప్లొమా, ఇంజినీరింగ్‌, మాథ్స్‌, ఫిజిక్స్‌ లాంటి కోర్సులు లాజికల్‌ రీజనింగ్‌, డేటా విశ్లేషణ లాంటి విషయాల్లో మెలకువలు పెంపొందడానికి దోహదపడటం వల్ల పోటీ పరీక్షల్లో సాటి పోటీదారులకంటే మీరు కొంత మెరుగైన స్థితిలో ఉంటారు. కొన్ని ఉద్యోగాలకు అకౌంట్స్‌తో పాటు, టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరమైనప్పుడు మీ డిప్లొమా, డిగ్రీ రెండూ ఉపయోగపడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రకరకాల కోర్సులు చదవడం అనేది అదనపు అర్హత కూడా. మీ డిగ్రీల విలువ మీకు సబ్జెక్టుపై ఉన్న అవగాహన, అనుభవం, భావప్రకటనా సామర్థ్యం లాంటి వాటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిశ్చింతగా బీకాం పూర్తిచేసుకుని ఎంకామ్‌ లేదా ఎంబీఏ లాంటివి ఎంచుకొని మంచి భవిష్యత్తుకు దారులు వేసుకోండి.


మైక్రో బయాలజీ చేస్తే?

* డిగ్రీ (బీజడ్‌సీ) పూర్తయింది. ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయాలనుంది. ఇది చేసినవారికి ఉండే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలేంటి?

- టి. రాజా

*  సూక్ష్మజీవుల జీవక్రియ, జీవనశైలిలకు సంబంధించిన విషయాలపై ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ విద్యార్థులు నిష్ణాతులై ఉంటారు. ఫార్మా, వైద్యరంగం, డెయిరీ రంగం, వ్యవసాయం, వైద్య పరిశోధన, నానో టెక్నాలజీ, ఇమ్యునాలజీ, కెమికల్‌ టెక్నాలజీ లాంటి రంగాల్లో మైక్రోబయాలజీ పాత్ర చాలా ఉంది. ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ పూర్తిచేసిన విద్యార్థులకు వైద్య, ఫోరెన్సిక్‌, ఫుడ్‌ ఇండస్ట్రీస్‌, పరిశోధనా సంస్థల్లో చాలా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకులుగా, విశ్వవిద్యాలయాల్లోని  ప్రయోగశాలల్లో టెక్నికల్‌ అసిస్టెంట్లుగానూ ఉద్యోగాలు చేయవచ్చు. వైద్యరంగంలో నిరోధకత, నిర్ధారణ, సూక్ష్మజీవుల చికిత్సా పద్ధతులు వంటి అంశాలమీద ఉద్యోగం లభిస్తుంది. ఫుడ్‌ కార్పొరేషన్‌ లాంటి సంస్థలతో పాటు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ జాతీయ పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తలుగా, టెక్నికల్‌ ఆఫీసర్లుగా, టెక్నికల్‌ అసిస్టెంట్లుగా పనిచేసే అవకాశాలున్నాయి. వైద్య కళాశాలల్లోనూ మైక్రో బయాలజీ, పాథాలజీ విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయి. ప్రస్తుతం యావత్‌ ప్రపంచాన్నీ ఇబ్బంది పెడుతున్న కరోనా లాంటి వైరస్‌ల గురించి పరిశోధన చేయాలనుకొంటే ఈ కోర్సు చాలా ఉపయోగకరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని