బీమా రంగంలో కోర్సు చేయాలంటే?

బీఏ (సోషియాలజీ, మాస్‌ కమ్యూనికేషన్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌) పూర్తిచేశాను. బీమా రంగానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ ....

Updated : 23 Nov 2022 10:30 IST

బీఏ (సోషియాలజీ, మాస్‌ కమ్యూనికేషన్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌) పూర్తిచేశాను. బీమా రంగానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చువరీస్‌ ఆఫ్‌ ఇండియాలో డిప్లొమా కోర్సు చేయాలనుకుంటున్నాను. అడ్మిషన్‌ ఎలా పొందాలి? దూరవిద్య ద్వారా చదివే వీలుందా? తెలియజేయగలరు.

- ఎల్‌. స్రవంతి

ట్టం ద్వారా ఏర్పాటైన ఒక నియంత్రణ సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చువరీస్‌ ఆఫ్‌ ఇండియా. ఇందులో సభ్యత్వం పొందినవారు ఇన్సూరెన్స్‌, ఫినాన్షియల్‌ మోడలింగ్‌ సంబంధిత విషయాల్లో నిష్ణాతులైవుంటారు. ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు పూర్తిచేసినవారు ఈ సంస్థలో స్టూడెంట్‌ మెంబర్‌ షిప్‌ తీసుకొని పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవ్వాలి. ముందుగా దీనికోసం యాక్చువరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ACET) అనే ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది.

గణితం, స్టాటిస్టిక్స్‌, ఆంగ్లం, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజిక్‌ విభాగాల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఈ పరీక్ష ఉంటుంది. దీన్ని సంవత్సరానికి మూడు సార్లు జూన్‌, సెప్టెంబర్‌/ అక్టోబర్‌, జనవరి నెలల్లో నిర్వహిస్తారు. యాక్చువరీస్‌ మూడు స్థాయుల కోర్సు. ప్రవేశ పరీక్ష రాసిన తర్వాత రెండో స్థాయి, మూడో స్థాయి పరీక్షలూ రాయాల్సి ఉంటుంది. రెండో స్థాయి పరీక్షలో ఫైనాన్స్‌, ఎకనామిక్స్‌కు సంబంధించిన పేపర్లు ఉంటాయి. మూడో స్థాయిలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి పేపర్‌లు రాయాలి. విద్యార్థి వీటన్నింటిలో తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి. ఇందులో స్టూడెంట్‌ మెంబర్‌షిప్‌, అసోసియేట్‌, ఫెలో, అఫిలియేట్‌ మెంబర్‌ లాంటి హోదాలుంటాయి. సొంతంగా చదివి పరీక్షలకు హాజరుకావాల్సిన కోర్సు కాబట్టి దీన్ని దూరవిద్యగా భావించవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని