ఎంబీఏతో ఏ అవకాశాలు?

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)ను ఏటా నవంబర్‌/డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఐఐఎంలు నిర్వహిస్తాయి. ఐఐంఎం ల్లాంటి  ప్రతిష్టాత్మక విద్యాసంస్థలతో పాటు వివిధ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు ఎంబీఏ / పీజీడీబీఎం కోర్సుల్లో ప్రవేశానికి 

Updated : 19 Apr 2021 06:18 IST

ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. ఎంబీఏ చేసినవారికి ఉద్యోగా వకాశాలెలా ఉంటాయి?   - బద్రి

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)ను ఏటా నవంబర్‌/డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఐఐఎంలు నిర్వహిస్తాయి. ఐఐంఎం ల్లాంటి  ప్రతిష్టాత్మక విద్యాసంస్థలతో పాటు వివిధ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు ఎంబీఏ / పీజీడీబీఎం కోర్సుల్లో ప్రవేశానికి  క్యాట్‌ని ప్రామాణిక పరీక్షగా పరిగణిస్తాయి. క్యాట్‌లో ఉత్తీర్ణత సాధించాక, ఆ స్కోరుతో పాటు గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులను కూడా పరిగణనలోకి తీసుకొని ఎంబీఏ / పీజీడీబీఎంల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మరికొన్ని విద్యాసంస్థలు సొంత ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వాటిలో XAT, SNAP, NMAT లు ముఖ్యమైనవి. ఇవి కాకుండా CMAT, MAT, ATMA లాంటి ప్రవేశ పరీక్షల ద్వారా కూడా ఎంబీఏ / పీజీడీబీఎంలో  ప్రవేశం పొందవచ్చు. వివిధ రాష్ట్రాలు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. నూతనంగా ప్రారంభమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ చేయాలంటే CUCET  రాయవలసి ఉంటుంది.

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, దిల్లీ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, పాండిచేరి యూనివర్సిటీలతో పాటు ఎన్‌ఐటీల్లో ఎంబీఏ చదవాలనుకొంటే క్యాట్‌ ద్వారా ప్రవేశం  పొందవచ్చు. చాలామంది అభ్యర్ధులు క్యాట్‌ కోసం ఏడాది ముందునుంచే సన్నద్ధత మొదలుపెడతారు. మనదేశంలో కొన్ని మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రవేశాల్లో ప్రాముఖ్యం ఇస్తున్నాయి. ఉద్యోగానుభవంతో ఎంబీఏ చేయడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఎంబీఏ చదివినవారికి ప్రైవేటు, ప్రభుత్వ, బహుళ జాతి, అంతర్జాతీయ సంస్థల్లో చాలా ఉద్యోగావకాశాలుంటాయి. ఎంబీఏ ద్వారా మంచి ఉద్యోగావకాశాలు పొందాలంటే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌, లీడర్‌ షిప్‌, టీం బిల్డింగ్‌, టీం వర్కింగ్‌ సామర్థ్యాలతో పాటు తార్కిక దృక్పథం చాలా అవసరం. ఈ కోర్సు రెండు సంవత్సరాల ఎగ్జిక్యూటివ్‌ శిక్షణ కార్యక్రమం లాంటిది. మంచి విద్యాసంస్థలో చదువుతూ, పైన చెప్పిన మెలకువలు పెంపొందించుకొంటే మెరుగైన భవిష్యత్‌ మీ సొంతం అవుతుంది.

- ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని