ఏ కోర్సు మంచిది?

మా అబ్బాయి ఇంటర్‌ ఎంఈసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బీకాం  బిజినెస్‌ అనలిటిక్స్‌ లేదా బీకాం ...

Published : 31 May 2021 00:14 IST

మా అబ్బాయి ఇంటర్‌ ఎంఈసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బీకాం  బిజినెస్‌ అనలిటిక్స్‌ లేదా బీకాం విత్‌ సీఏ చేస్తే మంచిదా?

- ఎం. నాగరాజు

ఇంటర్‌లో ఎంఈసీ చదివిన చాలామంది సీఏ చేస్తూ బీకాం లేదా బీకాం చదువుతూ సీఏలో చేరతారు. అయితే వీరిలో ఎక్కువమంది బీకాం మాత్రమే పూర్తి చేయగలుగుతున్నారు. కొద్దిమందే సీఏ కోర్సుని విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నారు. మరికొద్దిమంది సీఏ (ఇంటర్‌)తోనే ఆపేస్తున్నారు. బీకాం పూర్తయిన తర్వాత ఎంబీఏ లేదా ఎంకాం ఎంచుకోవచ్చు. సీఏ కోర్సు ప్రైవేటు, బహుళజాతి సంస్థల్లో కాస్టింగ్‌, అకౌంటింగ్‌ రంగాల్లో అవకాశాలు కల్పిస్తుంది. ఇది పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఇన్‌కమ్‌ టాక్స్‌, ఆడిట్‌ రంగాల్లో ఉపాధి లభిస్తుంది. ఎంబీఏ చదువుకున్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత ఉద్యోగావకాశాలున్నాయి. ఎంకాం కోర్సు పూర్తిచేసినవారు అకౌంటింగ్‌ విభాగాలు, బోధన రంగంలో ఉపాధి పొందుతున్నారు.
ఇటీవలికాలంలో డేటా సైన్స్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌ ప్రాచుర్యంలోకి వచ్చాయి. వివిధ సర్వేల ప్రకారం రాబోయే 20 ఏళ్లలో ఈ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం తగినంత మంది అర్హులు లేనందున చాలా కళాశాలలు బిజినెస్‌ అనలిటిక్స్‌  కోర్సుని బీకాం, బీబీఏ, ఎంబీఏల్లో అందిస్తున్నాయి. ఈ కోర్సు స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ల సమ్మేళనం. దీన్ని పూర్తిచేయడానికి ప్రాబ్లం సాల్వింగ్‌పై అవగాహన, గణితంపై ఆసక్తి అవసరం. బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు చేశాక మంచి ఉద్యోగాలు పొందాలంటే వ్యాపారపు ఫంక్షనల్‌ పరిజ్ఞానం, స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామింగ్‌లపై పట్టు అవసరం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీ అబ్బాయి అభిరుచిని బట్టి కోర్సును ఎంచుకోమని చెప్పండి. ఫంక్షనల్‌, టెక్నికల్‌ (అనలిటిక్స్‌) రంగాల్లో పూర్తి అవగాహన ఉన్నవారు మార్కెట్‌లో తక్కువగా ఉన్నందున సీఏతోపాటు బీకాం అనలిటిక్స్‌ని చేయగలిగితే దేశ విదేశాల్లో మేటి అవకాశాలు పొందవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని