ఫిజికల్‌ కెమిస్ట్రీలో పీజీ చేస్తే..?

ఫిజికల్‌ కెమిస్ట్రీ కోర్సు మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, బయాలజీ, కెమిస్ట్రీల సమ్మేళనం. దీనిలో ఎక్కువగా అనలిటికల్‌ కెమిస్ట్రీ, కంప్యుటేషనల్‌ కెమిస్ట్రీలను నేర్చుకొంటారు.

Published : 07 Jun 2021 00:19 IST

ఎంఎస్‌సీ (ఫిజికల్‌ కెమిస్ట్రీ) కోర్సు చదివితే ఏ ఉద్యోగావకాశాలుంటాయి?

- ఉమా శ్రీకాంత్‌.

* ఫిజికల్‌ కెమిస్ట్రీ కోర్సు మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, బయాలజీ, కెమిస్ట్రీల సమ్మేళనం. దీనిలో ఎక్కువగా అనలిటికల్‌ కెమిస్ట్రీ, కంప్యుటేషనల్‌ కెమిస్ట్రీలను నేర్చుకొంటారు. ఈ కోర్సులో ముఖ్యంగా పరిశ్రమల్లో కెమిస్ట్రీ వినియోగం తెలుసుకుంటారు. ఫిజికల్‌ కెమిస్ట్రీ  రంగంలో రాణించాలంటే గణితంలోని ప్రాథÅ]మిక సూత్రాలపై మంచి అవగాహన ఉండాలి.
ఎంఎస్‌సీ (ఫిజికల్‌ కెమిస్ట్రీ) చదివితే ప్రైవేటు ఫార్మా, ఫుడ్‌, కాస్మొటిక్స్‌, బయో టెక్నాలజీ లాంటి కంపెనీల్లో, బోధన రంగంలో చాలా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇస్రో, డీఆర్‌డీఓ, ఓఎన్‌జీసీ, భారత్‌ పెట్రోలియం, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో,  కేంద్ర ప్రభుత్వ ప్రయోగశాలల్లో, కేంద్ర, రాష్ట్ర,  ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని కెమిస్ట్రీ ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు/సైంటిఫిక్‌ ఆఫీసర్‌/ టెక్నికల్‌ ఆఫీసర్‌/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ ల్యాబ్‌ అసిస్టెంట్‌/ రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు పొందొచ్చు.
బోధన రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి స్కూల్‌ అసిస్టెంట్‌/ టీజీటీ/ పీజీటీగా పాఠశాలల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఇవే కాకుండా  ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కెమిస్ట్రీ లెక్చరర్‌గా స్థిర పడవచ్చు. నెట్‌/సెట్‌ లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీలో సహాయ ఆచార్యుడిగా ఉద్యోగం పొందవచ్చు. ఫిజికల్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసి కేంద్ర/ రాష్ట్ర/ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుడిగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పరిశోధనలపై ఎక్కువ ఆసక్తి ఉంటే విదేశాల్లో పోస్ట్‌ డాక్టొరల్‌ పరిశోధన కోసం ప్రయత్నించవచ్చు. ఎంఎస్‌సీ (ఫిజికల్‌ కెమిస్ట్రీ) తర్వాత గేట్‌ రాసి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఎమ్‌టెక్‌ చేసి ఇంజినీరింగ్‌ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు. ఫిజికల్‌ కెమిస్ట్రీ కోర్సు చేసినవారికి కెమికల్‌ ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లో  అధిక ప్రాధాన్యం ఉంటుంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని