కొలువుకు ఏ కోర్సు మేలు?

ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్‌) ప్రథమ సంవత్సరం చదువుతున్నా. దీని తర్వాత ఏ కోర్సు చేస్తే దేశవిదేశాల్లో ఉద్యోగ సాధనకు ఉపయోగం?

Updated : 16 Aug 2021 05:23 IST

ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్‌) ప్రథమ సంవత్సరం చదువుతున్నా. దీని తర్వాత ఏ కోర్సు చేస్తే దేశవిదేశాల్లో ఉద్యోగ సాధనకు ఉపయోగం?

  - ఫణికిరణ్‌

* ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్‌) చదివిన తర్వాత స్టాటిస్టిక్స్‌లో పీహెచ్‌డీ చేసినవారికి బోధన, పరిశోధన రంగాల్లో చాలా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేస్తే విదేశాల్లోనే కొలువులో చేరవచ్చు. ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్‌) తర్వాత అఖిల భారత సర్వీస్‌ అయిన ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌కు ప్రయత్నించవచ్చు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, స్టాటిస్టిక్స్‌లో జూనియర్‌ లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లాంటి ఉద్యోగాలకు సన్నద్ధం కావచ్చు. ప్రస్తుతం డేటా సైన్స్‌ రంగంలో చాలా కొలువులకు అర్హులైన అభ్యర్ధుల కొరత ఉంది. మీరు స్టాటిస్టిక్స్‌తో పాటు బిగ్‌ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైతాన్‌లలో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ కోర్సులు చేసి నైపుణ్యాల్ని పెంచుకోండి. ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) చదివినా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆక్చూరియల్‌ సైన్స్‌లో సర్టిఫికెట్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ఈ మెలకువలతో విదేశాల్లోనూ ఉపాధికి ప్రయత్నించవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఉద్యోగాలకు ఆయా దేశాల్లో పూర్తిచేసిన డిగ్రీలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. విదేశాల్లో డేటా సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, ఆక్చూరియల్‌ సైన్స్‌ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చేయగలిగితే అక్కడే ఉద్యోగంలో స్థిరపడవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని