సమయం వృథా కాకూడదంటే..

కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది నా కల. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూడాలో, కేంద్రప్రభుత్వ కొలువుల కోసం ప్రయత్నించాలో..

Published : 05 Jan 2022 11:21 IST

బీఎస్సీ పాసయ్యాను. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది నా కల. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూడాలో, కేంద్రప్రభుత్వ కొలువుల కోసం ప్రయత్నించాలో తెలియని సందిగ్ధంలో ఉన్నా. సమయం వృథా కాకుండా ఉండాలంటే ఏంచేయాలో సలహా ఇవ్వగలరు.

- ప్రశాంత్‌

చాలామంది డిగ్రీ పూర్తయ్యాక ఉపాధికి ప్రయత్నాలు చేయడం, ఉన్నతవిద్యను అభ్యసించడంలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ దిశలో ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకోసం మాత్రమే ప్రయత్నిస్తే, మరికొంతమంది రాష్ట్ర ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమవుతారు. చాలామంది రెండింటికీ తయారవుతారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఎక్కువ పోస్టులు అందుబాటులో ఉంటాయి. ఇక మీరు అడిగిన గ్రూప్‌ -2 తరహా నోటిఫికేషన్‌కు మీరు ఊహించేదానికంటే పోటీ ఎక్కువగానే ఉంటుంది. రాబోయే నోటిఫికేషన్‌ కోసం మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొలువుల కోసం కృషి చేయండి.

" కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్, మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, డేటా విశ్లేషణ లాంటి అంశాలను అధ్యయనం చేసి వాటిపై పట్టు సాధించండి."

ఏదైనా ఒక ఉద్యోగం పొందిన తరువాత మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. గతంలో జరిగిన గ్రూప్‌-1, గ్రూప్‌-2 నియామకాల్లో చాలామంది ఏదో ఒక ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌ కోసం సన్నద్ధమై ఉద్యోగాలు పొందారు. సమయం వృథా కాకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్, మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, డేటా విశ్లేషణ లాంటి అంశాలను అధ్యయనం చేసి వాటిపై పట్టు సాధించండి. ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి, పట్టుదల, కఠోర శ్రమ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న మీ కల కచ్చితంగా నెరవేరుతుంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని