మార్కెటింగ్‌లో ఏ కొలువులు?

బీఎస్సీ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) చదివి ఎంబీఏ మార్కెటింగ్‌ చేశాను. నాకుండే ఉద్యోగావకాశాల గురించి తెలుపగలరు....

Updated : 07 Feb 2022 06:15 IST

బీఎస్సీ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) చదివి ఎంబీఏ మార్కెటింగ్‌ చేశాను. నాకుండే ఉద్యోగావకాశాల గురించి తెలుపగలరు.

- సందీప్‌రెడ్డి

ఎంబీఏలో మార్కెటింగ్‌ చదివినవారికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. దశాబ్దకాలంగా పెరిగిన దేశీయ, బహుళజాతి వ్యాపార సంస్థల విస్తరణ, సోషల్‌ మీడియా వినియోగం, ఆన్‌లైన్‌ రిటెయిల్‌ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, డిజిటల్‌ మార్కెటింగ్‌ లాంటి అంశాల వల్ల మార్కెటింగ్‌ విభాగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి. ఎంబీఏ మార్కెటింగ్‌ చదివినవారికి సేల్స్‌ మేనేజ్‌మెంట్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, అడ్వర్టయిజింగ్‌ లాంటి విభాగాల్లో కొలువులు లభిస్తాయి. మీరు డిగ్రీలో చదివిన ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు సంబంధించిన ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌, సాఫ్ట్‌వేర్‌, ఫార్మా సంబంధిత రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, రిటెయిలింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మీడియా, హెల్త్‌కేర్‌, రియల్‌ ఎస్టేట్‌, టూరిజం, స్పోర్ట్స్‌ రంగాల్లో కూడా మార్కెటింగ్‌ చదివినవారికి ఉద్యోగావకాశాలు అధికం.

ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న స్టార్టప్‌ సంస్థల్లోనూ మార్కెటింగ్‌ నిపుణుల అవసరం చాలా ఉంది. ఎంబీఏ మార్కెటింగ్‌ చదివినవారికి మొదట్లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ లాంటి ఉద్యోగాలు లభిస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు వేతనాలు ఆకర్షణీయంగా లేనప్పటికీ, మీ పని తీరు, అనుభవాన్ని పట్టి భవిష్యత్తులో మెరుగైన వేతనాలు లభిస్తాయి. మీకు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో మార్కెటింగ్‌
ఉద్యోగాల కోసం ప్రయత్నించండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని