ఏది మెరుగు?

రెండు ఇంజినీరింగ్‌ బ్రాంచిల్లో దేని ప్రత్యేకత దానిదే. ఆసక్తీ, అభిరుచులకు అనుగుణంగా ఏ బ్రాంచినైనా ఎంచుకోవాల్సివుంటుంది.

Updated : 31 Mar 2022 05:52 IST

బీటెక్‌లో ఈసీఈ, సీఎస్‌ఈ బ్రాంచిల్లో దేనివల్ల ఎక్కువ ప్రయోజనాలున్నాయి?

 - పి. గురు మనోహర్‌

* రెండు ఇంజినీరింగ్‌ బ్రాంచిల్లో దేని ప్రత్యేకత దానిదే. ఆసక్తీ, అభిరుచులకు అనుగుణంగా ఏ బ్రాంచినైనా ఎంచుకోవాల్సి వుంటుంది.
ఈసీఈలో ఇంజినీరింగ్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ట్రాన్స్‌మిటర్‌, రిసీవర్‌, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ లాంటి కమ్యూనికేషన్‌ పరికరాల గురించి చదువుతారు. వీటితో పాటు బేసిక్‌ ఎలక్ట్రానిక్స్‌, అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ ట్రాన్స్‌మిషన్‌, డేటా, వాయిస్‌, వీడియో రిసెప్షన్‌ (ఉదాహరణ ఏఎం, ఎఫ్‌ ఎం, డీటీహెచ్‌), మైక్రోప్రాసెసర్‌లు, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, మైక్రోవేవ్‌ ఇంజనీరింగ్‌, యాంటెన్నా, వేవ్‌ ప్రోగ్రెషన్‌ల గురించీ తెలుసుకుంటారు. ఉపగ్రహాలు, టెలివిజన్‌, రేడియో, కంప్యూటర్లు, మొబైల్స్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌ లాంటి అప్లికేషన్ల తయారీలో ఈ ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు.

టెలికమ్యూనికేషన్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌/ఐటీ, పవర్‌ సెక్టర్‌, హార్డ్‌వేర్‌ తయారీ, గృహోపకరణాలు, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, టెలివిజన్‌ పరిశ్రమ, పరిశోధన- అభివృద్ధి, ఆధునిక మల్టీమీడియా సేవా సంస్థల్లో, సివిల్‌ ఏవియేషన్‌, డిఫెన్స్‌, ఆలిండియా రేడియో, రైల్వే, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, డీఆర్‌డీ…ఓ లాంటి వివిధ రంగాల్లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలు ఎక్కువ.  

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో కంప్యుటేషన్‌కు సంబంధించిన వివిధ అంశాలతో పాటు కంప్యూటర్‌ నెట్‌ వర్క్‌, అల్గారిద]మ్‌ల విశ్లేషణ, ప్రోగ్రామింగ్‌ భాషలు, ప్రోగ్రామ్‌ డిజైన్‌, సాఫ్ట్‌వేర్‌, డేటా మైనింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ల గురించి చదువుతారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ మూలాలు, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, గణితం, ఎలక్ట్రానిక్స్‌, భాషాశాస్త్రంలో ఉన్నాయి. వివిధ పరిశ్రమల కోసం సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను రూపొందించి అభివృద్ధి చేయడం, సాఫ్ట్‌వేర్‌ నెట్‌వర్క్‌లను నిర్వహించడంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. పర్సనల్‌ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, స్కానర్‌ లాంటి కంప్యూటింగ్‌ పరికరాల కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తారు. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల కోసం కోడ్‌, సెక్యూరిటీ, అల్గారిద]మ్‌లను తయారుచేస్తారు. ఐటీ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, అభివృద్ధి, టెస్టింగ్‌, నెట్‌వర్కింగ్‌ అండ్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ లాంటి విభాగాల్లో ఉద్యోగావకాశం ఉంది.
ఇటీవలికాలంలో ప్రాచుర్యం పొందిన కృత్రిమ మేధ, మెషిన్‌ లర్నింగ్‌, డేటా సైన్స్‌ లాంటి వినూత్న రంగాల్లో కూడా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్‌లకు మెరుగైన ఉపాధి అవకాశాలున్నాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని