జాతీయ స్థాయిలో మెరిశారు!

సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షలో, సీఏ ఐపీసీసీలో జాతీయ స్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించారు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన ఇద్దరు మిత్రులు. చిన్ననాటి నుంచి ఒకే పాఠశాల, కళాశాలలో చదివారు. స్నేహితులు కావడం యాదృచ్ఛికమైనా ఒకరికొకరు సన్నిహితంగా

Updated : 06 Apr 2022 05:40 IST

సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షలో, సీఏ ఐపీసీసీలో జాతీయ స్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించారు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన ఇద్దరు మిత్రులు. చిన్ననాటి నుంచి ఒకే పాఠశాల, కళాశాలలో చదివారు. స్నేహితులు కావడం యాదృచ్ఛికమైనా ఒకరికొకరు సన్నిహితంగా ఉంటూ మేటి ర్యాంకర్లుగా నిలిచారు- రిషబ్‌ ఓత్స్వాల్‌, శశి శ్రీనివాస్‌.

ఇటీవల విడుదలైన సీఎంఏ ఫౌండేషన్‌ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో రిషబ్‌ మొదటి ర్యాంకు, శశి శ్రీనివాస్‌ రెండో ర్యాంకు సాధించారు. 2022 ఫిబ్రవరిలో వచ్చిన సీఏ ఐపీసీసీ ఫలితాల్లోనూ జాతీయస్థాయిలో రిషబ్‌ 8వ ర్యాంకు, శశిశ్రీనివాస్‌ 10 ర్యాంకుతో ప్రతిభ చాటారు. వీరి విజయం వెనుక స్ఫూర్తి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంది. ఎల్‌కేజీ నుంచి తరగతిలో మొదటి ర్యాంకు తెచ్చుకోవాలనే లక్ష్యం రిషబ్‌ది. ఇక శశి శ్రీనివాస్‌ 8వ తరగతిలో ఉన్నపుడు సిటీ మాంటిస్సోరి లక్నో నుంచి పొయిట్రీ రైటింగ్‌కు ఆహ్వానాలు వచ్చాయి. ఈ పోటీలో తన పొయిట్రీకి ప్రపంచంలోనే ద్వితీయ స్థానం లభించిన ఉత్సాహం!  ఇవే వీరిద్దరూ అత్యున్నత. ర్యాంకులు సాధించడానికి పునాదులు పడ్డాయని అంటున్నారు. ఇద్దరి తండ్రులూ పలమనేరు పట్టణంలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు. వారిద్దరు కూడా స్నేహితులు కావడం గమనార్హం. రిషబ్‌ తండ్రి రాజేష్‌ ఇంటర్మీడియట్‌, తల్లి సుమిత్ర కంప్యూటర్‌ సైన్స్‌ చదువుకున్నారు. శశి శ్రీనివాస్‌ తల్లి శ్రీలక్ష్మి, తండ్రి లక్ష్మిపతి ఇద్దరూ డిగ్రీ చదువుకున్నారు.


ఏ రోజు పాఠాలు ఆరోజే

దేశవ్యాప్తంగా జరిగే పరీక్షల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలంటే కష్టపడి చదవాలి. సిలబస్‌లో ఏరోజు పాఠాలు ఆరోజే పూర్తి చేసుకోవాలి. సన్నద్ధతకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి.
ఎల్‌కేజీ నుంచే కష్టపడి చదవటం అలవాటు. తరగతిలో మొదటి స్థానం రావాలని ప్రయత్నం చేసేవాణ్ని. పాఠశాల తరఫున మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌, సైన్స్‌ ఒలింపియాడ్‌లో 6 బంగారు, మూడు రజత పతకాలు సాధించాను. పదో తరగతి పరీక్షల్లో 97 శాతం మార్కులు వచ్చాయి. గుంటూరు మాస్టర్‌ మైండ్స్‌లో ఎంఈసీ చదివాను. ఇంటర్‌లో కూడా 96 శాతం మార్కులు సాధించాను. అదే కళాశాలలో సీఏ ఫౌండేషన్‌ కోసం చేరాను. అత్యున్నత ర్యాంకులు వచ్చిన తరువాత బిగ్‌ఫోర్‌ కంపెనీలైన కేపీఎంజీ, బెంగళూరు కోరమంగళ బ్రాంచిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాను.


రివిజన్‌ ఎంతో ముఖ్యం

చదివిన పాఠ్యాంశాల రివిజన్‌ విద్యార్థులకు ఎంతో ముఖ్యం. అప్పుడే అన్ని అంశాలనూ గుర్తుపెట్టుకోగలుగుతాం. పాఠశాల స్థాయి నుంచే లక్ష్యం ఏర్పరచుకుంటే అత్యున్నత స్థాయికి ఎదగటానికి దోహదపడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పొయిట్రీ పోటీల్లో ద్వితీయ స్థానం రావటం నాలో పెనుమార్పు తీసుకొచ్చింది. ఇక అక్కడి నుంచి నాలో ఉన్న చదివే శక్తిని గుర్తించాను. పదో తరగతిలో 95 శాతం మార్కులొచ్చాయి. ఇంటర్‌లో ఎంఈసీ తీసుకుని కష్టపడి చదివా. 97.5 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యా. మాస్టర్‌ మైండ్స్‌ కళాశాలలో సీఏ ఫౌండేషన్‌ కోర్సులో 400 మార్కులకు 325 మార్కులు సాధించా. అక్కడే సీఏ ఇంటర్‌మీడియట్‌లో 2022 ఫిబ్రవరి ఫలితాల్లో జాతీయస్థాయి 10వ ర్యాంకు అందుకున్నాను. ఇక సీఎంఏ ఫౌండేషన్‌లో జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకు పొందా. మా నాన్న కష్టపడి చదివిస్తుంటే అదే స్ఫూర్తిగా తీసుకున్నాను. ఇప్పుడు బిగ్‌ఫోర్‌కి చెందిన కేపీఎంజీ బెంగళూరు కోరమంగళలో ఇంటర్న్‌షిప్‌
ప్లేస్‌మెంట్‌ వచ్చింది. నెలకు రూ.15 వేల స్టైపెండ్‌ తీసుకుంటున్నా.

-  మణి (పలమనేరు, న్యూస్‌టుడే)



 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని