సాఫ్ట్‌వేర్‌ కొలువు సాధ్యమేనా?

డిగ్రీ (బీఎస్‌సీ కంప్యూటర్స్‌) 2014లో పూర్తిచేయాల్సివుంది. కొన్ని కారణాల వల్ల 2019లో పూర్తిచేశాను. ప్రస్తుతం స్వయంఉపాధి పొందుతున్నాను.

Updated : 12 Apr 2022 06:05 IST

డిగ్రీ (బీఎస్‌సీ కంప్యూటర్స్‌) 2014లో పూర్తిచేయాల్సివుంది. కొన్ని కారణాల వల్ల 2019లో పూర్తిచేశాను. ప్రస్తుతం స్వయంఉపాధి పొందుతున్నాను. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలి?

- ఎ. అరవింద్‌

ఏ సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసినవారికైనా పూర్వ విద్యార్హతలతో సంబంధం లేకుండా సమస్యా పరిష్కార సామర్థ్యం, కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌, అనలిటికల్‌ నైపుణ్యాలు ఉంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ. మీరు డిగ్రీ చేయడానికి తీసుకున్న ఎక్కువ సమయం పెద్ద సమస్య కాదు. డిగ్రీ పూర్తి చేశాక ఏ రంగంలో స్వయం ఉపాధి పొందుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో వచ్చిన మార్కులను కాకుండా మీకున్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొనే కంపెనీలు చాలా ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ  చేయడం అనేది మీకో అదనపు అర్హత అవుతుంది. ముందుగా మీరు డిగ్రీలో చదివిన కంప్యూటర్‌ కోర్సులను మరొకసారి పూర్తిగా చదివి విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోండి. సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చెయ్యాలనుకుంటున్న రంగానికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను నేర్చుకోండి. కొన్ని లైవ్‌ ప్రాజెక్టుల్లో పనిచేసి మీ బయోడేటాను మెరుగుపర్చుకోండి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో మెరుగైన ఉద్యోగాలు పొందాలంటే సీ, సీ ప్లస్‌ ప్లస్‌, జావా, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైతాన్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, బిగ్‌ డేటా, మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి వాటిలో మీకు నచ్చిన కోర్సుల్ని చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేయండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని