ఉద్యోగం చేస్తూ.. సివిల్స్‌ ఎలా?

విద్యుత్‌ శాఖలో ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి సన్నద్ధం కావడం కొంత కష్టమే! కానీ, సివిల్స్‌పై మీకున్న ఇష్టం ఈ కష్టాన్ని అధిగమించి లక్ష్యాన్ని అందుకొనేలా చేయవచ్చు. ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి సిద్ధం అవ్వాలంటే కనీసం మూడు...

Updated : 20 Apr 2022 05:28 IST

బీటెక్‌ పూర్తిచేసి విద్యుత్‌ శాఖలో సబ్‌-ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. ఐఏఎస్‌ కావాలనేది నా లక్ష్యం. పని ఒత్తిడితో చదవడానికి సమయం దొరకడం లేదు. సివిల్స్‌కు ఎలా సిద్ధం కావాలి?   

 - ఎస్‌. హర్ష

విద్యుత్‌ శాఖలో ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి సన్నద్ధం కావడం కొంత కష్టమే! కానీ, సివిల్స్‌పై మీకున్న ఇష్టం ఈ కష్టాన్ని అధిగమించి లక్ష్యాన్ని అందుకొనేలా చేయవచ్చు. ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి సిద్ధం అవ్వాలంటే కనీసం మూడు సంవత్సరాలపాటు ప్రణాళికాబద్ధంగా చదవాలి. మీరు వేరే ఊళ్లలో ఉంటే.. ముందుగా హైదరాబాద్‌కి బదిలీపై కానీ, డెప్యుటేషన్‌పై కానీ రండి. మీ ఆఫీస్‌ పని సమయం రోజుకి 7 గంటలుంటే రోజుకు 5 గంటల చొప్పున ప్రిపరేషన్‌కి కేటాయించండి. రెండు సంవత్సరాల పాటు సెలవు దొరికే అవకాశం ఉంటే రోజుకు కనీసం 12 గంటల సమయాన్ని సన్నద్ధతకు కేటాయించి మీ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు. 

ముందుగా యూపీఎస్‌సీ ప్రకటన పూర్తిగా చదివి మీ వయసు, సామాజిక నేపథ్యాలనుబట్టి ఎన్ని అవకాశాలున్నాయో తెలుసుకోండి. అందుకు తగ్గట్లుగా ప్రణాళికల్ని సిద్దం చేసుకోండి. ప్రిలిమ్స్‌ కోసం అవసరమైన మెటీరియల్‌ని సమకూర్చుకోండి. గతంలో సివిల్స్‌ సాధించినవారినీ, ప్రస్తుతం సివిల్స్‌ రాస్తున్నవారినీ సంప్రదించి వారి అనుభవాలు తెలుసుకోండి. యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న సివిల్స్‌ విజేతల విజయగాథలను చూసి, వారి ప్రిపరేషన్‌ పద్ధతుల గురించి అవగాహన పెంచుకోండి. ఆప్షనల్‌ని ఎంచుకొన్నాక అందుకు సంబంధించిన సిలబస్, పాత ప్రశ్నపత్రాల్ని జాగ్రత్తగా పరిశీలించండి. ప్రామాణిక పుస్తకాలను సేకరించండి. మంచి కోచింగ్‌ సెంటర్‌లో కనీసం ఏడాది శిక్షణ తీసుకొనే ప్రయత్నం చేయండి. అలా కుదరని పక్షంలో ఏదైనా ప్రముఖ శిక్షణ సంస్థ నుంచి ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకోండి. వార్తాపత్రికలు, జనరల్‌ స్టడీస్, ఆప్టిట్యూడ్‌లకు సంబంధించిన పుస్తకాలను నిరంతరం చదువుతూ, నోట్సు తయారు చేసుకోండి. ఈ సన్నద్ధత, మెయిన్స్‌ పరీక్షలో వ్యాసాలు రాయడానికి బాగా ఉపకరిస్తుంది. ముందే చెప్పినట్లు- కనీసం రెండు, మూడు సంవత్సరాల పాటు గట్టి పట్టుదలతో కృషి చేస్తే, ఐఏఎస్‌ అవ్వాలనే మీ కలను నిజం చేసుకోవడం సాధ్యం అవుతుంది.  

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని