మెడికల్‌ టెక్నీషియన్‌ కావాలంటే..

బీటెక్‌ (సివిల్‌) మూడో సంవత్సరం చదువుతున్నా. మెడికల్‌ టెక్నీషియన్‌గా చేయాలనివుంది. ఇందుకు ఏమైనా ఒకేషనల్‌ కోర్సులుంటాయా?

Published : 16 May 2022 02:41 IST

బీటెక్‌ (సివిల్‌) మూడో సంవత్సరం చదువుతున్నా. మెడికల్‌ టెక్నీషియన్‌గా చేయాలనివుంది. ఇందుకు ఏమైనా ఒకేషనల్‌ కోర్సులుంటాయా?

- డి. సాయిశంకర్‌

* మీరు మెడికల్‌ టెక్నీషియన్‌ కోర్సుని బీటెక్‌ మానేసి చదవాలనుకొంటున్నారా, బీటెక్‌తోపాటు కొనసాగించాలను కొంటున్నారో చెప్పలేదు. మీరు డిగ్రీ పూర్తి చేయలేదు కాబట్టి, పదో తరగతి/ ఇంటర్మీడియట్‌ విద్యార్హత ఉన్న ఒకేషనల్‌ కోర్సుల కోసం ప్రయత్నించండి. కొన్ని కోర్సులకు ఇంటర్‌లో బయాలజీ కోర్సు కూడా అవసరం అవుతుంది. ఒకవేళ మీరు ఇంటర్‌లో ఎంబైపీసీ చదివివుంటే చాలా కోర్సులకు మీరు అర్హులవుతారు. సాధారణంగా ఒకేషనల్‌ కోర్సులు ఏదైనా రంగంలో నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగావకాశాలను కల్పిస్తాయి. అలా కాకుండా మీరు ఉన్నత విద్యకు వెళ్లాలనుకొంటే ఆయా కోర్సుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ లాంటి కోర్సుల గురించి ఆలోచించాలి.

వైద్యరంగంలో చాలారకాల టెక్నీషియన్స్‌ అవసరం ఉంటుంది. మెడికల్‌ లాబొరేటరీ టెక్నీషియన్‌, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌, హాస్పిటల్‌ హైజీన్‌ టెక్నీషియన్‌, ఐసీయూ టెక్నీషియన్‌, మెడికల్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌, కార్డియాలజీ టెక్నీషియన్‌, ఎక్స్‌రే టెక్నీషియన్‌, హాస్పిటల్‌ స్టోర్‌ అసిస్టెంట్‌, డయాలసిస్‌ టెక్నీషియన్‌, ఆప్టోమెట్రీ టెక్నీషియన్‌ లాంటి వొకేషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులన్నింటికి మెరుగైన ఉద్యోగావకాశాలూ ఉన్నాయి. కానీ అంతకంటే ముందు మీరు బీటెక్‌ కోర్సు పూర్తిచేసుకొని, ఆ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మెడికల్‌ టెక్నీషియన్‌గా కంటే, సివిల్‌ ఇంజనీర్‌గా మీ భవిష్యత్తు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని