విద్యార్థి ఈ-మెయిల్‌ సంతకం...ఎలా ఉండాలి?

యూనివర్సిటీ విద్యార్థి అయినా... ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థి అయినా... నేటి డిజిటల్‌ ప్రపంచంలో తమ చదువులు, ఇంటర్న్‌షిప్స్, ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ-మెయిల్‌ను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ-మెయిల్‌ మొత్తం ఎంత జాగ్రత్తగా రాస్తారో

Published : 02 Aug 2022 00:40 IST

యూనివర్సిటీ విద్యార్థి అయినా... ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థి అయినా... నేటి డిజిటల్‌ ప్రపంచంలో తమ చదువులు, ఇంటర్న్‌షిప్స్, ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ-మెయిల్‌ను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ-మెయిల్‌ మొత్తం ఎంత జాగ్రత్తగా రాస్తారో చివర్లో జతచేర్చే సంతకానికీ అంతే ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఎదుటివారికి మీపై సరైన అభిప్రాయాన్ని ఏర్పరచడంలోనూ, తిరిగి మిమ్మల్ని సంప్రదించేలా ఆసక్తి కలిగించడంలోనూ చక్కటి ఈ-మెయిల్‌ సంతకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

సంతకం అంటే కాగితంపై రాసినట్లుగా పేరు రాస్తే చాలనుకుంటే పొరపడినట్లే. ఈ-మెయిల్‌ సంతకం మన గురించి పూర్తి వివరాలు తెలియజెప్పేలా ఉండాలి. ఇందులో సాధారణంగా పూర్తి పేరు, చదువు, ఫోన్‌ నంబర్, మెయిల్‌ ఐడీ, సోషల్‌ మీడియా ఖాతాల లింక్‌లు ఉంటాయి. వీటికి తోడు ఫొటోతోపాటు ఇతర వివరాలు కావాలంటే జతచేర్చుకోవచ్చు.

* హాయిగొలిపే రంగులు ఒకటి లేదా రెండు మాత్రమే వినియోగించాలి. అప్పుడే హుందాగా కనిపిస్తుంది.

* విద్యార్థి ఈ-సంతకం ఎంత సింపుల్‌గా ఉంటే అంత మంచిది. దానివల్ల తొలి అభిప్రాయం (ఫస్ట్‌ ఇంప్రెషన్‌) పాజిటివ్‌ కోణంలో ఉంటుంది. అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అవసరం అనుకుంటే రెజ్యూమె లింక్‌ను జతచేయొచ్చు.

* విద్యార్థుల కోసం ఇప్పుడు ఎన్నో ఉచిత ఈ-మెయిల్‌ సిగ్నేచర్‌ టెంప్లెట్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని సులభంగా నచ్చిన  సంతకాన్ని సిద్ధం చేసుకోవచ్చు.

* పంపే మెయిల్‌లో ఐడీ ఉన్నా సరే, సంతకంలో తిరిగి మెయిల్‌ ఐడీని రాయడం ద్వారా మన మెయిల్‌ను ఫార్వర్డ్‌ చేయాల్సి వచ్చినా... అవతలివారికి సౌకర్యంగా ఉంటుంది.

* సోషల్‌ మీడియా ఖాతాల్లో లింక్డ్‌ఇన్‌ వంటి ప్రొఫెషనల్‌ ఖాతాలు ఎంచుకోవడం ఉత్తమం. అలాగే అక్కడ ఉండే సమాచారం ముఖ్యులు, రిక్రూటర్లకు సదభిప్రాయాన్ని కలిగించేలా ఉండాలి.

* ఏవైనా ప్రత్యేక అర్హతలు ఉంటే రాయవచ్చు. విద్యార్థిగా సాధించిన విజయాలు, సొంతం చేసుకున్న అవార్డుల వంటివాటి గురించి ఒక్క వాక్యంలో చెప్పొచ్చు. ఉదాహరణకు ‘విన్నర్‌ ఆఫ్‌ గూగుల్‌ సైన్స్‌ ఫెయిర్‌- 2022’.

* ఈ-మెయిల్‌ సంతకం ఒకరకంగా విజిటింగ్‌ కార్డ్‌లాంటిదే. మనం దాన్ని ఎంత అందంగా, హుందాగా తయారుచేసి వినియోగిస్తే అంతగా ఇతరులకు ఆసక్తిని కలిగించగలం... తద్వారా అవకాశాలు అందిపుచ్చుకోగలం!

భాష రాసేటప్పుడు పాటించాల్సిన అన్ని నియమాలనూ చక్కగా పాటిస్తూ, కంటికి ఇంపైన ఫాంట్స్‌లో అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని