సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్లాలంటే...

బీటెక్‌ ఈసీఈ చేశాను. ఎంటెక్‌ లేదా ఎంఎస్‌ ఎలక్ట్రానిక్స్‌ చదివితే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? యూఎస్‌లో ఎంఎస్‌ చేస్తే అదనపు ప్రయోజనాలేమైనా ఉంటాయా?

Published : 31 Aug 2022 00:51 IST

* బీటెక్‌ ఈసీఈ చేశాను. ఎంటెక్‌ లేదా ఎంఎస్‌ ఎలక్ట్రానిక్స్‌ చదివితే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? యూఎస్‌లో ఎంఎస్‌ చేస్తే అదనపు ప్రయోజనాలేమైనా ఉంటాయా?  

  - ఎం.అనిరుధ్‌
- ఎంఎస్‌ ఎలక్ట్రానిక్స్‌ చదివినవారికి బోధన, పరిశోధన, రక్షణ రంగాలతోపాటు టెలివిజన్‌, ఆటోమొబైల్‌, రెఫ్రిజిరేటర్‌ తయారీలో ఉద్యోగావకాశాలుంటాయి. మహారత్న, నవరత్న లాంటి ప్రభుత్వరంగ సంస్థల్లో ఇంజినీర్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌వర్క్‌, డిజైన్‌, డెవలప్‌మెంట్‌, ఆటోమేషన్‌ రంగాల్లో కూడా ప్రవేశించవచ్చు. ప్రముఖ ఐటీ కంపెనీల్లోనూ ఎలక్ట్రానిక్స్‌ సంబంధిత విభాగాలు ఉంటాయి. ఎంటెక్‌లో చదివిన స్పెషలైజేషన్‌కు అనుగుణంగా నచ్చిన ఉద్యోగాలకు ప్రయత్నించండి, యూఎస్‌లో ఎంఎస్‌ చేయడం వల్ల ప్రధానంగా.. మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. బీటెక్‌లో చదివిన సబ్జెక్ట్‌లో మాత్రమే కాకుండా యూఎస్‌లో మీకు నచ్చిన సబ్జెక్ట్‌లో ఎంఎస్‌ చేసే వెసులుబాటూ ఉంది.


*   పదో తరగతి చదివాను. దూరవిద్యలో తొమ్మిదేళ్ల కిందట బీఏ పాసయ్యాను. సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్లాలంటే ఏ కోర్సు చదవాలి?        

   - డి.ప్రవల్లిక

- ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లాలంటే బీటెక్‌ చదివినవారికంట ఎక్కువ కష్టపడాల్సిఉంటుంది. అయితే ఈ రంగంలో రాణించడం అసాధ్యం కాదు. మీరు ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదివిఉంటే, ఎంసీఏ కోర్సు చదవొచ్చు. అలా కుదరకపోతే కంప్యూటర్‌/ సాఫ్ట్‌వేర్‌లో పీజీ డిప్లొమా/డిప్లొమా చేయండి. ఇంటర్‌ విద్యార్హతతో బీసీఏ కూడా చేసే అవకాశం ఉంది. మొదటగా మీరు ఎంఎస్‌-ఎక్సెల్‌, సీ ప్రోగ్రామింగ్‌, జావా, పైతాన్‌ లాంటి లాంగ్వేజెస్‌ నేర్చుకుని, సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగానికి ప్రయత్నించండి. అదేవిధంగా, ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సాఫ్ట్‌వేర్‌ కోర్సులూ, ఉద్యోగాల గురించి తెలుసుకుని, వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి.

- బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని