తరచూ కోపం వస్తోందా?

మనలో కొంతమందికి చిన్నచిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంటుంది. కావాల్సినవాటిని సమయానికి అందివ్వలేదని అమ్మ మీదా.. అడిగినవాటిని వెంటనే కొనివ్వలేదని నాన్న మీదా అలుగుతూనే ఉంటాం.

Updated : 20 Sep 2022 13:03 IST

ప్రేరణ

మనలో కొంతమందికి చిన్నచిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంటుంది. కావాల్సినవాటిని సమయానికి అందివ్వలేదని అమ్మ మీదా.. అడిగినవాటిని వెంటనే కొనివ్వలేదని నాన్న మీదా అలుగుతూనే ఉంటాం. స్నేహితులను అయితే కోపంతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడేస్తుంటాం కూడా. కానీ అవి వాళ్లను ఎంతగా బాధిస్తాయో ఆ క్షణంలో అసలు ఆలోచించం. అచ్చంగా ఈ కథలోని అభిలాగే..!

భి అనే అబ్బాయికి చీటికీమాటికీ కోపం వచ్చేసేది అతడి తండ్రి ఎలాగైనా కొడుకు ప్రవర్తనను మార్చాలనుకున్నాడు. ఒకరోజు మేకులున్న సంచిని కొడుక్కిచ్చి.. కోపం వచ్చినప్పుడల్లా గోడకు మేకు  కొట్టమన్నాడు. మొదటిరోజే అభి ముప్పై మేకులు కొట్టాడు. ఆ తర్వాత మెల్లగా కోపాన్ని తగ్గించుకోసాగాడు. కొన్ని రోజుల తర్వాత.. గోడకు మేకులు కొట్టడం కంటే కోపాన్ని తగ్గించుకోవడమే సులువనిపించింది. ఒకరోజు తనకు అసలు కోపమే రాలేదు కూడా. ఇదే విషయాన్ని తండ్రికి చెబితే.. ప్రతిరోజూ ఒక మేకును గోడ నుంచి తీసేయమని సలహా ఇచ్చాడు.

కొన్ని రోజుల తర్వాత అభి మేకులన్నీ తీసేసి తండ్రిని గోడ దగ్గరకు తీసుకెళ్లి చూపించాడు. అప్పుడు తండ్రి.. ‘మేకులను తీశావుగానీ వాటితో పడిన రంధ్రాలను ఏమీ చేయలేకపోయావు చూశావా... నువ్వు కోపంతో మాట్లాడినప్పుడు ఎదుటివారి మనసు కూడా ఇలాగే గాయపడుతుంది. ఆ తర్వాత క్షమించమని అడిగినా సరే, ఆ గాయం తాలూకు గుర్తులు అలాగే ఉండిపోతాయి’ అన్నాడు. తప్పు తెలుసుకున్న అభి ఆ తర్వాత తన ప్రవర్తనను ఎంతో మార్చుకున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని