సీబీటీకి ఏ జాగ్రత్తలు?

ఇటీవలికాలంలో చాలా ఉద్యోగ/ప్రవేశ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గానే నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలపాటు పెన్ను, పేపర్‌ పరీక్షలకు అలవాటుపడిన తరానికి మొదటిసారి సీబీటీ రాయడం కొంత కంగారు కలిగించవచ్చు.

Updated : 26 Oct 2022 06:48 IST

* పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ మొదటిసారిగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) రాయబోతున్నాను. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

- మానస

ఇటీవలికాలంలో చాలా ఉద్యోగ/ప్రవేశ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గానే నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలపాటు పెన్ను, పేపర్‌ పరీక్షలకు అలవాటుపడిన తరానికి మొదటిసారి సీబీటీ రాయడం కొంత కంగారు కలిగించవచ్చు. కానీ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, మాక్‌ టెస్ట్‌లను కంప్యూటర్‌పై సాధన చేస్తే సీబీటీని సులువుగా రాయవచ్చు. సాధారణ రాత పరీక్షలో అభ్యర్థులు తమకు కేటాయించిన బెంచి/ కుర్చీపై కూర్చొని రైటింగ్‌ ప్యాడ్‌/ టేబుల్‌పై పరీక్ష రాస్తారు. కానీ సీబీటీలో వారికి కేటాయించిన కంప్యూటర్‌ ముందు కూర్చుంటారు. కేటాయించిన ఐడీ…, పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవ్వాలి. ఆపై తెరపై ఉన్న వివరణాత్మక సూచనలను జాగ్రత్తగా చదవాలి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నలు కంప్యూటర్‌ తెర మీద కనిపిస్తాయి. ప్రశ్నను జాగ్రత్తగా చదివి, సరైన సమాధానాన్ని మౌస్‌తో గుర్తించాలి. పరీక్ష అయ్యేవరకు కీబోర్డ్‌ పనిచేయదు. ఒకవేళ మీరు తప్పు సమాధానాన్ని గుర్తించినట్లు భావిస్తే, పరీక్ష పూర్తయ్యేలోపు ఎప్పుడైనా దాన్ని సరిచేసుకోవచ్చు. ఈ  వెసులుబాటు పెన్ను, పేపర్‌ పరీక్షల్లో ఉండదు.

ఏదైనా కంప్యూటర్‌/మౌస్‌ సరిగా పనిచేయకపోతే, ఆ అభ్యర్ధికి వెంటనే మరొక కంప్యూటర్‌/మౌస్‌ను కేటాయిస్తారు. ఈ మార్పిడిలో కోల్పోయిన సమయం సర్వర్‌లో సర్దుబాటు చేస్తారు. రాత పరీక్షలోలాగా మీరు ప్రతిసారీ టైమ్‌ చూసుకొనే పని లేకుండా, మానిటర్‌పై ఇంకా ఎంత  టైమ్‌ మిగిలి ఉందో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టైమర్‌ సున్నాను చూపించగానే పరీక్ష పూర్తవుతుంది. మీరు గుర్తించిన సమాధానాలు వాటికవే అప్‌ లోడ్‌ అయిపోతాయి. ప్రత్యేకించి పరీక్షను క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసేప్పుడు సమయంతో పాటు, ఎన్ని ప్రశ్నలు చదివారు, ఎన్ని  సమాధానాలు రాశారు, ఎన్నింటికి సమాధానాలు రాయలేదు, ఎన్ని సమాధానాలను రివ్యూ చేయాలని భావించారు అనే వివరాలు కూడా డిస్‌ ప్లే అవుతాయి. ఒకవేళ పరీక్ష సమయం పూర్తయ్యేలోపు మీరు రివ్యూ చేయాలనుకున్న సమాధానాలను రివ్యూ చేయలేకపోతే, ఆ సమాధానాలను కూడా మూల్యాంకనం చేస్తారు. మీరు పరీక్ష రాసేప్పుడు అవసరమైన కాలిక్యులేషన్స్‌ అన్నింటినీ ఇచ్చిన రఫ్‌షీట్‌లో మాత్రమే చేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత రఫ్‌ షీట్లను తప్పనిసరిగా విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సీబీటీని ధైర్యంగా రాయండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని