Published : 07 Dec 2022 00:19 IST

ఆన్‌లైన్‌లో దిశా నిర్దేశం

సందేహాలను తీర్చే సైట్లు  

నేర్చుకునే క్రమంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. వాటిని వెంటనే తీర్చుకోవడం వల్ల విషయం స్పష్టంగా అర్థమై సంబంధిత అంశంపై పట్టు సంపాదించడానికి వీలవుతుంది. ఇందుకు తోడ్పడే కొన్ని వెబ్‌సైట్ల వివరాలను క్లుప్తంగా తెలుసుకుందామా?

ఇంజినీరింగ్‌, సైన్స్‌, కామర్స్‌, పాలిటీ, వైద్య విద్య, మేనేజ్‌మెంట్‌.. సబ్జెక్టు ఏదైనా సరే, చదివేటప్పుడు పూర్తిగా బోధపడదు. తరగతిలో అయితే వెంటనే అధ్యాపకులను అడిగి సందేహ నివృత్తి చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంట్లో చదువుకునేప్పుడూ కొన్ని అనుమానాలు రావొచ్చు. సూత్రం వెనుక అంతర్లీనంగా దాగున్న తర్కాన్ని అర్థంచేసుకోకుండా ఎంతకాలం చదివినా ప్రయోజనం ఉండదు. ఆ క్షణాన చదవడం పూర్తయినా భవిష్యత్తులో ఆ విషయాలేవీ గుర్తుండవు. అర్థం చేసుకుంటూ చదివితే అలాంటి సమస్యే ఉండదు. అలాగే విషయ గ్రహణ సామర్థ్యం విద్యార్థులందరికీ ఒకే విధంగా ఉండదు. దాంతో చదివేటప్పుడు కొందరికి కొన్ని రకాలైన సందేహాలు తలెత్తుతుంటాయి. వాటిని ప్రాథమిక స్థాయిలోనే నివృత్తి చేసుకుంటే అవగాహన పెరిగి సబ్జెక్టు మీద మంచి పట్టును సాధించవచ్చు.
నీట్‌, జేఈఈ లాంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో కొందరు మాత్రమే వేలల్లో ఫీజు కట్టి కోచింగ్‌ తీసుకోగలుగుతారు. ఆర్థిక స్తోమతలేని విద్యార్థులు కొన్ని వెబ్‌సైట్ల సాయం తీసుకుని నిపుణుల పాఠాలను వినొచ్చు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ లాంటి సబ్జెక్టుల్లోని అంశాలు అందరికీ సులువుగా అర్థంకావు. అలాంటప్పుడూ ఈ సైట్లలోని నిపుణులు చెప్పే వీడియో పాఠాల ద్వారా సందేహ నివృత్తి చేసుకోవచ్చు. వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాల్లో సందేహాలు, జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన అనుమానాలు, సాంకేతిక సందేహాల నివృత్తికీ కొన్ని వెబ్‌సైట్లు ఉన్నాయి.

కోరా: ఇదొక ప్రశ్న-సమాధానాల వెబ్‌సైట్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది తమ సందేహాలను దీంట్లో వ్యక్తం చేస్తుంటారు. ఒక్కొక్కరూ ఎన్ని సందేహాలనైనా నిరభ్యంతరంగా అడగొచ్చు. సంబంధిత సబ్జెక్టులకు చెందిన నిపుణులు సమాధానాలు చెబుతారు. విద్యార్థిగా పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలను మీరు అడిగితే సబ్జెక్టు నిపుణుల నుంచి సమాధానం వస్తుంది. జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ), నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌), ఛార్టెడ్‌ ఎకౌంటెంట్‌ (సీఏ).. ఇంకా ఇతర పరీక్షకలు సంబంధించిన వేర్వేరు గ్రూప్‌లు ఉన్నాయి. ఆయా గ్రూపుల్లో చేరడం ద్వారా సంబంధిత సమాచారాన్ని ప్రతిరోజూ పొందొచ్చు. సమస్యా పరిష్కారాలే కాకుండా కాన్సెప్ట్‌ డెఫినిషన్లు, వివిధ పరీక్షల సన్నద్ధకు అనుసరించాల్సిన పద్ధతుల గురించీ ఈ సైట్‌లో వివరిస్తారు.

https://www.quora.com

టాపర్‌: నిరంతరంగా నేర్చుకుంటూనే ఉండాలనుకునేవారికి ఇది గమ్యస్థానం లాంటిది. సాధన ద్వారా నేర్పించడం అనేది వీరి లక్ష్యం. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అన్ని ఎక్కువ సందేహాలు వస్తుంటాయి. అలా సందేహాలు వచ్చిన చోటనే విద్యార్థుల ప్రయాణం ఆగిపోకుండా ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తుందిది. విద్యార్థులు తమకు వచ్చిన అనుమానాలను టైప్‌ చేయడం లేదా ఫొటోను అప్‌లోడ్‌ చేయడం ద్వారాగానీ అడగొచ్చు. 

https://www.toppr.com

రెడిట్‌: ఒకేలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు దీంట్లో గ్రూప్‌గా ఏర్పడి వివిధ అంశాల పైన చర్చలు జరపొచ్చు. విద్యార్థులు కూడా తమ విద్యావసరాలకు అనుగుణంగా జేఈఈ, నీట్‌లాంటి కమ్యూనిటీ పేజీల్లో చేరొచ్చు. గతంలో వివిధ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను పరిశీలించడం ద్వారా కొన్ని సందేహాలను తీర్చుకోవచ్చు. అయినప్పటికీ కొన్ని మిగిలినట్లయితే ప్రశ్నను టైప్‌ చేయడం ద్వారా అడగొచ్చు. లేదా సంబంధిత ఫొటోను అప్‌లోడ్‌ చేయొచ్చు. కమ్యూనిటీ సభ్యులు మీ సందేహానికి సమాధానం చెబుతారు. అలా ఆ అంశాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతారు. 

https://www.reddit.com

హౌ స్టఫ్‌ వర్క్స్‌: క్విజ్‌లు, టెక్నాలజీకి సంబంధించిన అంశాలు, ఆరోగ్యం, సైన్సు, సంస్కృతి, డబ్బు, జీవనవిధానం లాంటి అనేక విషయాలకు సంబంధించిన సమాచారాన్ని దీంట్లో భద్రపరిచారు. ఫొటోగ్రాఫ్‌లు, డయాగ్రమ్‌లు, వీడియోలు, యానిమేషన్లు, వ్యాసాల రూపంలో సమాచారం ఉంటుంది.  కంప్యూటర్‌ వినియోగంలో సాధారణంగా కొన్ని సమస్యలు, సందేహాలు వస్తుంటాయి కదా. అలాంటివాటికీ దీంట్లో పరిష్కారాలు ఉంటాయి. సాధారణ జ్వరం లాంటి విషయాల నుంచి అంతరిక్ష విశేషాల వరకూ ఈ సైట్‌లో ఉండటం విశేషం.

https://www.howstuffworks.com/

హ్యాష్‌లెర్న్‌: దీంట్లో నిపుణులు రూపొందించిన కోర్సు వీడియోలు ఉంటాయి. డౌట్‌ సాల్వింగ్‌ సెషన్లు, అపరిమితమైన పుస్తకాలు, ప్రాక్టిస్‌ టెస్టులూ ఉంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ స్టడీ మెటీరియల్‌, ఇంజినీరింగ్‌, మెడికల్‌ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఇంకా ఐఐటీ-జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌, బిట్‌శాట్‌, వీఐటీఈఈఈ, ఎస్‌ఆర్‌ఎంఈఈఈ.. ఇతర రాష్ట్రాల ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు ఉంటాయి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర సిలబస్‌లు చదివే 8 నుంచి 12వ తరగతి విద్యార్థులకు శిక్షణ లభిస్తుంది. ఎస్‌ఎస్‌సీ, క్లాట్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ పోటీ పరీక్షలకూ శిక్షణ ఉంటుంది. జేఈఈ, నీట్‌కు సంబంధించిన పుస్తకాలు, మాక్‌ టెస్టులు ఉంటాయి. ప్రముఖ పబ్లిషర్ల పుస్తకాలూ ఉంటాయి. ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్‌ టెస్టులనూ రాసుకోవచ్చు.

https://www.crunchbase.com/organization/hashlearn

మై స్టడీ కార్ట్‌: ఈ ఎడ్యుకేషనల్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ కోచింగ్‌  ఉంటాయి. ఐఐటీ-జేఈఈ, నీట్‌-యూజీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, శాట్‌, కేవీపీవై, ఎన్‌టీఎస్‌ఈ, ఒలింపియాడ్‌ మొదలైనవాటికి శిక్షణ ఉంటుంది. జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షార్థుల కోసం నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ను అందిస్తారు. ఎయిమ్స్‌, నీట్‌, జిప్‌మర్‌, బిట్‌శాట్‌ మొదలైన పరీక్షలకూ శిక్షణ లభిస్తుంది. పాత ప్రశ్నపత్రాలు కూడా ఉంటాయి. నిపుణులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు సబ్జెక్టులనూ, మెలకువలనూ బోధిస్తారు. విద్యార్థుల సందేహాలను తీర్చి, మార్గనిర్దేశం చేస్తారు.

https://mystudycart.com/courses

కేసన్స్‌ ఎడ్యుకేషన్‌: ఇది ఐఐటీ-జేఈఈ పరీక్షకు ఆన్‌లైన్‌ కోచింగ్‌ను అందిస్తుంది. జేఈఈ-మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు వివరణాత్మకమైన వీడియో పాఠాలు ఉంటాయి. ఐఐటీ-జేఈఈ అభ్యర్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల కోసం ఏయే పుస్తకాలు చదవాలో చెబుతారు. ఈ పరీక్షకు అవసరమైన స్టడీ మెటీరియల్‌తోపాటు వీడియో లెక్చర్లు, నోట్సు, క్వశ్చన్‌ బ్యాంక్‌, టెస్ట్‌ సిరీస్‌లు కూడా ఉంటాయి. గ్రాఫిక్స్‌, యానిమేషన్స్‌తో విద్యార్థులకు సబ్జెక్టుల పట్ల ఆసక్తిని కలిగించడతోపాటు సందేహాలనూ నివృత్తి చేస్తారు.

https://www.kaysonseducation.co.in

సాల్వ్‌ఇట్‌నౌ: విద్యార్థుల సందేహాలను తీర్చే ఎలక్ట్రానిక్‌ వేదిక ఇది. మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులో తలెత్తే క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను తెలియజేస్తుంది. ఐఐటీ-జేఈఈతోపాటు ఒలింపియాడ్‌, ఇతర పోటీ పరీక్షలకూ శిక్షణను అందిస్తుంది. పాఠ్యాంశానికి సంబంధించిన సమస్యను ఫొటో తీసి పంపితే వెంటనే వీలైనంత త్వరగా పరిష్కారాన్ని పంపుతారు.

https://www.solveitnow.org


ఈనాడు ప్రతిభ

నకు ఎన్నో భాషలు తెలిసినా... సందేహ నివృత్తికీ, విషయ అవగాహనకూ మాతృభాషను మించింది లేదు. అందుకే  రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగార్థుల సందేహాలను ‘ఈనాడు ప్రతిభ’కు పంపొచ్చు. ఈ అద్భుతమైన వేదిక సందేహాలను తీర్చి, స్టడీ మెటీరియల్‌నూ అందిస్తుంది. ఈ పోర్టల్‌లో ‘ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌’ కాలమ్‌లో విద్య, కెరియర్‌కు సంబంధించిన సందేహాలను పోస్ట్‌ చేస్తే సంబంధిత నిపుణులు సమాధానం చెబుతారు. ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో ప్రశ్నలను అడగవచ్చు. ఉద్యోగాలు, ప్రవేశపరీక్షలు, అర్హత పరీక్షలు, టెన్త్‌ క్లాస్‌, ఇంటర్మీడియట్‌, ఇంజినీరింగ్‌ అనే విభాగాల్లో ఇప్పటికే నిపుణులు ఇచ్చిన సమాధానాలనూ ఈ కాలమ్‌లో చూడొచ్చు. ఆన్‌లైన్‌లో వివిధ పరీక్షల మాక్‌టెస్ట్‌లు రాసుకునే అవకాశం ఉంది. కరెంట్‌ అఫైర్స్‌తో పాటు ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, గ్రామర్‌, ఒకాబ్యులరీ మెలకువలూ తెలుసుకోవచ్చు. చదువు, పోటీ పరీక్షలు, కెరియర్‌ విషయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా ఈనాడు ప్రతిభ సేవలను ఉపయోగించుకోవచ్చు.

https://pratibha.eenadu.net/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని