ఆత్మహత్య ఆలోచనలు వేధిస్తున్నాయి..
ఇంటర్‌లో మ్యాథ్స్ ఫెయిలై సప్లిమెంటరీ రాశాను. ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. కౌన్సెలింగ్ కోసం సన్నద్ధమవుతుండగా.. మ్యాథ్స్‌లో మళ్లీ ఫెయిల్ అయ్యాను. మా క్లాసు టాపర్ కూడా ఎంసెట్‌లో ర్యాంకు సంపాదించి.. ఇంటర్ ఫెయిలై ఆత్మహత్య చేసుకున్నాడు. నాకూ అలాంటి ఆలోచనలే వస్తున్నాయి. వీటి నుంచి బయటపడి.. నా దృష్టంతా సబ్జెక్టు మీదే నిలపాలంటే నేనేం చేయాలి?
గాయత్రి
* ఇంటర్ ఫెయిలై ఇంజినీరింగ్ చదవలేకపోయాననే బాధతో ఇలాంటి ప్రతికూల ఆలోచనలు చేయటంలో అర్ధం లేదు. ప్రపంచంలో అన్నింటికన్నా అత్యంత విలువైనది మీ జీవితం. ఇది మీ ఒక్కరిదే కాదు, మీ కుటుంబానిదీ, సమాజానిదీ కూడా! ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారీ మీరే లోకంగా ఉండే అమ్మానాన్నల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆత్మహత్య చేసుకున్న మీ క్లాస్ టాపర్ కన్నవాళ్లకు ఎంత క్షోభ మిగిల్చాడో దృష్టిలో పెట్టుకోండి. పరీక్షలో ఫెయిలవ్వడం అనేది ప్రమాదం లాంటిది. దాని తరువాత కూడా జీవితం ఉంటుంది. చాలాసార్లు అంతకుముందు కంటే ఇంకా బాగుండే అవకాశమూ ఉంది.
దాదాపు 35 సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిలైనప్పుడు ఆత్మహత్య ఆలోచన నాకూ వచ్చింది. అప్పుడు మా అమ్మగారు ‘జీవితాన్ని అర్థ్ధాంతరంగా ముగించడం పిరికివాళ్ళు చేసే పని’ అంటూ మందలించి, ఆ ఆలోచన నుంచి నన్ను దూరం చేశారు. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకొనివుంటే, ఈ రోజు మీకీ సమాధానం ఇవ్వడానికి నేనుండేవాడినే కాదు.
ఈ ఓటమి కంటే ముందు, మీరెన్నో విజయాలు సాధించివుంటారు. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని మీమీద నమ్మకాన్ని పెంచుకోండి. ‘చంద్రుడు కనిపించట్లేదని ఏడిస్తే, కళ్ళల్లో నీరు నిండి నక్షత్రాలు కూడా కనిపించవు’. మన చుట్టూ ఉన్న చాలామంది మనకంటే తీవ్రమైన సమస్యలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అవకాశం ఉంటే ఎవరైనా ఒక కౌన్సెలర్‌తో మాట్లాడండి. అమ్మానాన్నలతో మీ ఆలోచనలను పంచుకోండి. సానుకూల దృక్పథం ఉన్న బంధువులతో, స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి. మ్యాథ్స్ సబ్జెక్టుకు ట్యూషన్ పెట్టుకొని ఈసారి కచ్చితంగా ఉత్తీర్ణులయ్యే ప్రయత్నం చేయండి. ఇంటర్ మ్యాథ్స్‌లో ఉత్తీర్ణతే కష్టంగా ఉంటే, ఇంజినీరింగ్‌లో ఉండే మ్యాథ్స్ కూడా కష్టంగా ఉండే అవకాశం ఉంది. అందుకని ఇంజినీరింగ్ కాకుండా, నచ్చిన మరేదైనా డిగ్రీ చదివే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇంజినీరింగ్ మీద బాగా ఇష్టం ఉంటే.. ఈ కోర్సులో చేరడానికి ముందే ఇంజినీరింగ్ మ్యాథ్స్‌పై పట్టు తెచ్చుకొనే ప్రయత్నం చేయండి.
ప్రతి ఓటమీ విలువైన అనుభవాన్నిస్తుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని, రాబోయే చిక్కులను సమర్థంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని పొందండి. సమస్యతో పోరాడాలే కానీ, సమస్య నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. ఈ వైఫల్యాన్ని మిమ్మల్ని మీరు రుజువు చేసుకొనే అవకాశంగా భావించండి. సమస్యను లోపల నుంచి కాకుండా, బయట నుంచి చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు సమస్య తీవ్రత తగ్గిపోతుంది!
ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని