Published : 24 Jan 2023 00:44 IST

పోల్చుకుని దిగులుపడుతోంది...

నా స్నేహితురాలు స్కూల్‌ టాపర్‌. కాలేజీలో చేరాక బాగా చదివేవాళ్లతో పోల్చుకుని దిగులుపడుతోంది. తనలో మార్పు రావాలంటే ఏం చేయాలి?

పల్లవి

సమస్య చాలామంది ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. స్కూల్‌లో చదివేప్పుడు చాలా సంవత్సరాలుగా తెలిసినవారితోనే పోటీ పడతారు. వారి బలాలు, బలహీనతలపై పూర్తి అవగాహన ఉండటంతో పెద్దగా ఒత్తిడి లేకుండానే చదువుకొని ఉంటారు. ఒకసారి స్కూల్‌ నుంచి కళాశాలకు మారిన తరువాత పోటీ పెరుగుతుంది. వివిధ పాఠశాలల నుంచి మనకంటే ఎక్కువ తెలివైనవారు, హార్డ్‌ వర్క్‌ చేసేవారు కళాశాలలో చేరతారు కాబట్టి పోటీ ఎక్కువగానే ఉంటుంది. మరికొంతమంది ఇంటర్‌ సిలబస్‌ను 8, 9, 10 వ తరగతుల్లో పూర్తిచేసుకొని వచ్చి, చాలా సందర్భాల్లో లెక్చరర్‌ ప్రశ్న అడగకముందే సరైన సమాధానంతో సిద్ధంగా ఉంటారు. అలాంటివారిని చూసి బెంబేలు పడే బదులు వారితో స్నేహం చేస్తూ, వారి నుంచి సబ్జెక్ట్‌ మెలకువలను నేర్చుకోవచ్చు. వారిని పోటీదారులుగా చూడకుండా విజ్ఞాన భాగస్వాములుగా చూడటం మేలు.

ఇలా సహాధ్యాయులను చూసి ఆత్మవిశ్వాసం కోల్పోయి న్యూనతా భావంతో బాధపడితే, చదువులో, జీవితంలో వెనకబడిపోయే ప్రమాదం ఉంది. కొంతకాలం పాటు మీ స్నేహితురాలు ఇతరులతో పోల్చుకోకుండా తనతో తానే పోటీపడమని చెప్పండి…. మార్కులు మాత్రమే ప్రతిభకు కొలమానం కాదు. చదువులో అయినా, జీవితంలో అయినా పక్కవారితో పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడే మనమీద నమ్మకాన్ని కోల్పోతాం.

ఇదే పరిస్థితిని నేను ఇంటర్మీడియట్‌ చదివేప్పుడు ఎదుర్కొన్నాను. దాదాపు ఆరు నెలలపాటు పోటీ విషయాన్ని మర్చిపోయాను. నా బలాలూ బలహీనతలను అంచనా వేసుకొని ప్రణాళికాబద్ధంగా చదివాను. ఇంటర్‌ పరీక్షల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో మార్కులు పొంది, ఇంజినీరింగ్‌లో సీటు సంపాదించి ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ పొందగలిగా. విద్యా, ఉద్యోగ గమ్యాల్లో ఇంటర్మీడియట్‌ చిన్న భాగమే! ఇదే జీవితం కాదు. ఇప్పుడు నేర్చుకొన్న అనుభవాలు జీవితాంతం ఉపయోగపడతాయి. మీ స్నేహితురాలిని సాధ్యమైనంత వరకు సానుకూల దృక్పథంతో ఉండమని చెప్పండి. లెక్చరర్లతో మాట్లాడుతూ సందేహాలు నివృత్తి చేసుకుంటూ, కుటుంబ సభ్యులతో మనసులో ఉన్న భావాలను ఎప్పటికప్పుడు పంచుకోమని చెప్పండి. జీవితం పట్ల ఆశావహ దృక్పథం ఉంటే ఎలాంటి క్లిష్ట సమస్యనైనా తేలిగ్గా అధిగమించవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని