ఏ కోర్సు చదివితే మేలు?

గణితంపై ఆసక్తి ఉంది కాబట్టి గణితాన్ని కొనసాగించే కోర్సులగురించి ఆలోచించండి. పదో తరగతి తరువాత డిప్లొమా చేయడం వల్ల మ్యాథ్స్‌ సబ్జెక్టును అంతగా నేర్చుకొనే అవకాశం ఉండదు.

Published : 01 Feb 2023 00:37 IST

పదో తరగతి చదువుతోన్న మా చెల్లికి గణితం అంటే చాలా ఆసక్తి. తనను ఇంటర్‌ చదివించాలా? ఏదైనా డిప్లొమా చేయిస్తే బాగుంటుందా?

రాథోడ్‌ నవీన్‌

* గణితంపై ఆసక్తి ఉంది కాబట్టి గణితాన్ని కొనసాగించే కోర్సులగురించి ఆలోచించండి. పదో తరగతి తరువాత డిప్లొమా చేయడం వల్ల మ్యాథ్స్‌ సబ్జెక్టును అంతగా నేర్చుకొనే అవకాశం ఉండదు. ఇంటర్‌ (ఎంపీసీ) చదివిస్తూ ఎన్‌ఐటీ/ఐఐటీలో ఇంజినీరింగ్‌ కోసం జేెఈఈ మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రాయించండి. అలా కానీ పక్షంలో ఎంసెట్‌లో మంచి ర్యాంకు ద్వారా ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీటు కోసం ప్రయత్నించండి. ఒకవేళ తనకు ఇంజినీరింగ్‌ మీద ఆసక్తి లేకపోతే ఇంటర్‌ ఎంపీసీ తర్వాత బీఎస్సీలో మ్యాథ్స్‌తో పాటు ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ / జియాలజీ/ డేటా సైన్స్‌ లాంటి సబ్జెక్టుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంచుకొని డిగ్రీ చేయొచ్చు. ఆపై మ్యాథ్స్‌లో పీజీ చేయటం మంచిది. బీఎస్సీపై ఆసక్తి లేకపోతే బీఏలో మ్యాథ్స్‌తో పాట ఎకనామిక్స్‌ /స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ లాంటి సబ్జెక్టులతోనూ డిగ్రీ చేయొచ్చు. అప్పుడు కూడా మ్యాథ్స్‌లో పీజీ చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉంటే ఆ తరువాత మ్యాథ్స్‌లో పీహెచ్‌డీ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా సీఏ లాంటి కోర్సుల్లో ఆసక్తి ఉంటే ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌ చదివి.. బీకాం చేస్తూ సీఏ కూడా చేసే వీలుంటుంది. ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన జాతీయ విద్యావిధానం-2020 ద్వారా మ్యాథ్స్‌లో నాలుగు సంవత్సరాల ఆనర్స్‌ డిగ్రీని చేయొచ్చు. ఇంటర్‌ తరువాత చాలామంది ఇంజినీరింగ్‌ కోర్సులకు వెళ్ళడం వల్ల మ్యాథ్స్‌ సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్నవారి సంఖ్య తక్కువగా ఉంది. మీ సోదరికి మ్యాథ్స్‌ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని ఉంటే బీఎస్సీ/ బీటెక్‌ తరువాత బీఈడీ చేసి, ఆ రంగంలోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని