సరైన నిర్ణయమేనా?

ఒక కోర్సులో చేరి కొంతకాలం చదివి, దాన్ని మధ్యలో వదిలేసి మరో కోర్సులో చేరాలా, వద్దా అనే ఆలోచన చాలామందిని వేధిస్తుంది.

Published : 14 Feb 2023 00:27 IST

ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. కానీ ఆసక్తి లేదు. ఈ కోర్సును మధ్యలోనే వదిలిపెట్టి సాధారణ డిగ్రీలో చేరటం సరైన నిర్ణయమేనా? ఎటూ తేల్చుకోలేకపోతున్నా.

ఎం.చందు

ఒక కోర్సులో చేరి కొంతకాలం చదివి, దాన్ని మధ్యలో వదిలేసి మరో కోర్సులో చేరాలా, వద్దా అనే ఆలోచన చాలామందిని వేధిస్తుంది. ఈ నిర్ణయం తీసుకునేముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోండి. ముందుగా మీరు ఇంజినీరింగ్‌ కోర్సులో ఎందుకు చేరారు? ఇబ్బంది బ్రాంచితోనా? ఇంజినీరింగ్‌ కోర్సుతోనా? ఇంజినీరింగ్‌ కష్టంగా తోచి, సబ్జెక్టుల్లో మంచి మార్కులు పొందలేకపోతున్నారా? ఏమైనా బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయా? సమస్య కళాశాల అధ్యాపకులతోనా? సహాధ్యాయుులతోనా? ఈ కోర్సును కొనసాగించడం వల్ల ఉద్యోగావకాశాలు ఉండవని దిగులు పడుతున్నారా? గతంలో తెలుగు మీడియం చదివి ఇప్పుడు ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడం వల్ల భాషా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? సాధారణ డిగ్రీలో చేరి పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వాలనుకొంటున్నారా?
ఈ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు తెలియకుండా.. సలహా ఇవ్వడం కష్టమే! ఇలాంటి నిర్ణయాలు తీసుకొనేముందు ఒక్కో అంశంలో ఉన్న లాభ నష్టాలను బేరీజు వేసుకోవాలి.

మీ దీర్ఘకాలిక ఆశయాలు, స్వల్పకాలిక లక్ష్యాలు ఏమిటి? ఇంజినీరింగ్‌ కోర్సు చదవడం వల్ల వాటిని సాధించలేననే భయమా? పరీక్షల ఒత్తిడి ఎక్కువగా ఉందా? ఈ కోర్సు వదిలేసి డిగ్రీలో చేరాక, దానిపై కూడా ఆసక్తి తగ్గితే, అప్పుడేం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు మీదగ్గర సరైన సమాధానాలున్నాయా? ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకోండి.
ఒక కోర్సును రెండు సంవత్సరాలు చదివి, మరో కోర్సుకి మారడం అనేది చాలా పెద్ద నిర్ణయం. అందుకే తొందరపాటు వద్దు. మీ శ్రేయోభిలాషులతో, అధ్యాపకులతో, కెరియర్‌ కౌన్సెలర్‌లతో చర్చించండి. గతంలో ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌ కోర్సును మధ్యలో వదిలేసి, డిగ్రీ చదివి ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి అత్యున్నత ఉద్యోగాలు పొందినవారు, డిగ్రీ పూర్తిచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగం పొందనివారు, డిగ్రీనే పూర్తిచేయనివారూ ఉన్నారు. మీరు ఏ కేటగిరీలో ఉంటారు అనేది మీ కృషి, పట్టుదల, బలమైన ఆశయం, కుటుంబ సభ్యుల సహకారం, ఆర్థిక వనరులు లాంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది.

నా మిత్రుడొకరు ప్రముఖ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండేళ్లు బీటెక్‌ చదివి, ఆ కోర్సుపై ఆసక్తి లేకపోవడం వల్ల మధ్యలో వదిలేసి, డిగ్రీ, పీజీ పూర్తిచేశారు. థియేటర్‌పై ఉన్న ఆసక్తితో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో డిప్లొమా కోర్సు చదివారు. ప్రస్తుతం ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేస్తూ, థియేటర్‌ రంగంలో రాణిస్తున్నారు. నూతన జాతీయ విద్యావిధానం - 2020, అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌, జాతీయ స్థాయిలో క్రెడిట్‌ల బదిలీ లాంటి విధానాలు అమల్లోకి వస్తే విద్యా సంవత్సరాలు నష్టపోకుండానే, ఒక కోర్సు నుంచి మరో కోర్సుకూ, ఒక విద్యా సంస్థ నుంచి మరో విద్యాసంస్థకూ మారే అవకాశం ఉంటుంది.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని