ఏఐ కంటే మెరుగేనా?

మా బంధువుల అబ్బాయి బీటెక్‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) కోర్సులో చేరాడు. దీనికంటే ఈఈఈ లేదా సివిల్‌ బ్రాంచిలు మెరుగని సలహా ఇచ్చాను. మీరేమంటారు?

Updated : 15 Feb 2023 04:56 IST

మా బంధువుల అబ్బాయి బీటెక్‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) కోర్సులో చేరాడు. దీనికంటే ఈఈఈ లేదా సివిల్‌ బ్రాంచిలు మెరుగని సలహా ఇచ్చాను. మీరేమంటారు?

కె. రామకృష్ణ

త కొన్ని సంవత్సరాలుగా చాలామంది విద్యార్థులు/ తల్లిదండ్రులు ఇంజినీరింగ్‌ కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) లాంటి బ్రాంచీలపై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు ముఖ్య కారణం- ఈ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు ఉండటమే! చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు బీటెక్‌ డిగ్రీని త్వరగా ఉద్యోగం పొందే అవకాశంగానే చూస్తున్నారు. చాలా సందర్భాల్లో ఏఐ అంటే కనీస అవగాహన కూడా లేకుండా ఆ కోర్సులో చేరుతున్నారు. మీ బంధువుల అబ్బాయికి ఏఐ కాకుండా సివిల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీలు మెరుగని చెప్పానన్నారు. ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని మీరలా చెప్పారో అవన్నీ అతడికి వివరంగా చెప్పండి. ఏఐ బ్రాంచికున్న అనుకూల, ప్రతికూల అంశాలను గురించీ చెప్పి, తననే సరైన నిర్ణయం తీసుకోమని చెప్పండి.

కెరియర్‌ కౌన్సెలింగ్‌లో ప్రాథమిక సూత్రం ఏమిటంటే- కౌన్సెలర్లు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి ప్రత్యామ్నాయానికీ ఉన్న లాభనష్టాల గురించి విపులంగా వివరించి, నిర్ణయాన్ని విద్యార్థులకే వదిలేయాలి.

ఏఐ బ్రాంచి విషయానికొస్తే- ఈ రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ అవకాశాలూ మెరుగ్గా ఉండొచ్చు. కానీ ఆ సబ్జెక్టును బోధించడానికి తగినంతమంది అధ్యాపకులు అందుబాటులో లేరు. చాలా ఎక్కువమంది ఈ కోర్సును ఎంచుకుంటున్నారు కాబట్టి, భవిష్యత్తులో అవసరానికి మించి ఇంజినీర్లు తయారవ్వటం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవచ్చు. ఇక సివిల్‌, ఎలక్ట్రికల్‌ విషయానికొస్తే ఈ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. చాలామంది కంప్యూటర్‌ రంగంలోకి వెళ్ళడంవల్ల ఈ రెండు రంగాల్లో ఇంజినీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ప్రైవేటు రంగంలో సివిల్‌/ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లకు సాప్ట్‌వేర్‌ ఇంజినీర్ల కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. ఉద్యోగం, వేతనం లాంటి అంశాలకంటే ముందు ఆ అబ్బాయికి ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకొని, ఆ బ్రాంచిని ఎంచుకోమని సలహా ఇవ్వండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు